అడుక్కుంటా అనుమతివ్వండి మహప్రభో!

09 May, 2018 - 11:38 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: ‘ప్రభుత్వం నాకు రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదు. దయచేసి పోలీసు యూనిఫామ్‌‌లోనే అడుక్కునేందుకు నాకు అనుమతివ్వండి’ అంటూ ముంబైకి చెందిన కానిస్టేబుల్‌ ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు విన​తిపత్రం అందజేశాడు.

ముంబైకి చెందిన ద్యనేశ్వర్‌ అహిర్రావ్‌ ముందుగా స్థానిక మురోల్‌ ఆయుధ విభాగంలో పనిచేసేవాడు. కొన్ని రోజుల క్రితం అతనిని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీకి మార్చారు. సరిగ్గా అదే సమయంలో అహిర్రావ్ భార్య కాలు విరిగింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం మార్చి 20 నుంచి 22 వరకు సెలవు పెట్టాడు. ఈ విషయం గురించి ఇంచార్జికి ఫోన్‌‌లో తెలిపాడు.అనంతరం మరో ఐదు రోజులు కూడా సెలవు తీసుకున్నాడు. భార్యను ఆస్పత్రి నుంచి తీసుకువచ్చిన తర్వాత మార్చి 28న వచ్చి తనకు కేటాయించిన మాతోశ్రీలో విధుల్లో చేరాడు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ అతనికి జీతం రాలేదు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో పోలీసు దుస్తుల్లోనే అడుక్కునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ద్యనేశ్వర్‌ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, గవర్నర్‌ విద్యాసాగర్‌‌రావుకు, ముంబై పోలీసు కమిషనర్‌‌ దత్త పడ్‌సాల్‌గికర్‌కు లేఖ రాశాడు.

ఆ ఉత్తరంలో తను సెలవు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందువల‍్ల తనకు యూనిఫామ్‌‌లో అడుక్కునేందుకు అనుమతి ఇవ్వాలని ద్యనేశ్వర్ కోరాడు.

ద్యనేశ్వర్ లేఖ గురించి ఒక సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్‌ ఇంచార్జికి తెలపకుండా విధులకు హాజరు కాని వారికి మాత్రమే జీతం నిలిపి ఉంచుతారు. అందువల్లే ద్యనేశ్వర్‌‌కు రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదని వివరించారు.