ముంబైలో 33కి చేరిన మృతులు

01 September, 2017 - 12:02 PM


(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: ముంబైలోని భేండీబజార్‌లో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 33కు పెరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తొమ్మిది మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 33కు చేరింది. వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం కూడా సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరో తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.దక్షిణ ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన భేండీ బజార్‌లో గురువారం ఓ ఐదంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. 117ఏళ్ల నాటి ఈ పురాతన భవనంలో మొత్తం 9 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒక ప్లేస్కూల్‌ కూడా ఉంది. ఆ స్కూల్‌ ప్రారంభం కాకముందే ఈ దుర్ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో దాదాపు 50 మంది చిన్నారులు ఈ ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆరు గోదాములు ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సమీప బంధువులకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు. కాగా, ఇది నివాసయోగ్యమైన భవనం కాదని, శిథిలావస్థకు చేరుకుందని మహారాష్ట్ర హౌసింగ్‌ అండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆరేళ్ల క్రితమే నోటీసులు జారీ చేసింది. కొన్ని కుటుంబాలు ఖాళీ చేశాయి. అయితే పలు కుటుంబాలు మాత్రం ఖాళీ చేసేందుకు ఒప్పుకోలేదు. భవనాన్ని ప్రమాదకరంగా ప్రకటించడంతో ‘ద సైఫీ బుర్హానీ పునరుద్ధరణ ట్రస్ట్, మరమ్మతులు చేపట్టింది. 2013–14లో ఏడు కుటుంబాల్ని తరలించింది.