అపర కుబేరుడైనా.. ఆడబిడ్డ తండ్రే కదా!

13 December, 2018 - 5:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: ఆయన అపర కుబేరుడు అయితే కావొచ్చు గాక.. దేశ సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉండి ఉండొచ్చు గాక.. ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నవాడైతే అవ్వొచ్చు గాక.. ఎంతటి వాడైనా ఓ ఆడబిడ్డకు తండ్రే కదా..! అల్లారు ముద్దుగా పెంచుకున్న తన గారాలపట్టిని ఓ అయ్య చేతిలో పెట్టే సమయంలో భావోద్వేగానికి లోను గాక తప్పదంటే.. తప్పదంతే..!

సరిగ్గా.. ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది.. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ వివాహం బుధవారం రాత్రి అంగరంగా ముంబైలో వైభవంగా జరిగింది. పిరమాల్ గ్రూపు సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్‌తో ఈషా అంబానీ పెళ్ళి వేడుక కనీ వినీ ఎరుగని రీతిలో జరిగింది.

అమెరికా మాజీ ప్రథమ మహిళ, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బిగ్ బీ అమితాబ్ సహా దేశ, విదేశాల్లోని వీవీఐపీలు ఈ వివాహమహోత్సవానికి హాజరయ్యారు. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఈ వివాహానికి హాజరై సందడి చేశారు. ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన వివాహ వేడుక బుధవారం రాత్రి జరిగింది.

గుజరాతీ సం‍ప్రదాయం ప్రకారం జరిగిన ఈషా- ఆనంద్‌‌ల వివాహంలో భాగంగా పెళ్లికుమార్తె ఈషాను ఆమె సోదరులు ఆకాశ్‌, అనంత్‌, అన్‌‌మోల్‌ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్‌‌ పట్టి మండపానికి తీసుకువచ్చారు. నృత్య కళాకారులతో బారాత్‌ బృందం ముందు కదిలింది. రోల్స్‌ రాయిస్‌ కారులో వరుడు ఆనంద్‌‌ తన కుటుంబసభ్యులతో కలిసి అంటిలియాకు చేరుకున్నారు. ఆ తర్వాత ఈషా-ఆనంద్‌ పెళ్లి వేదిక వద్దకు చేరుకోగానే వధువు- వరుడి బంధువుల కోలాహలంతో సందడి నెలకొంది. ఇరువర్గాల ఆనందోత్సాహాల మధ్య ఈషా- ఆనంద్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

కన్యాదానం సమయంలో బిగ్‌‌బీ అమితాబ్‌ బచ్చన్‌.. మంత్రాల పరమార్థం వివరిస్తుండగా.. ముఖేష్ అంబానీ దంపతులు తమ ముద్దుల కూతురిని అల్లుడి చేతిలో పెట్టారు. అయితే ఈ సమయంలో ముఖేష్‌ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఇన్నాళ్లూ అపురూపంగా పెంచుకున్న తన కూతురుని మెట్టినింటికి పంపిస్తున్నపుడు ఆమాత్రం ఉద్వేగానికి గురవడం సహజమే. ఈ విషయంలో సగటు భారతీయ తండ్రికి తానేమీ అతీతుడ్ని కానని ముఖేష్ అంబానీ నిరూపించుకున్నారు.