‘ముందు వాగ్దానం.. తర్వాత మొహం చాటేయడం’

13 August, 2019 - 4:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కాకినాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం కోటా కేటాయించిందని.. దీనిని కేంద్రం వెంటనే ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గం నాయకుడు ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తి చేశారు. బీసీ (ఎఫ్‌)గా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేశారని ముద్రగడ తెలిపారు.

దీనిని అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపారని మోదీకి రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. ఈ అంశంపై మంగళవారం ప్రధాని మోదీకి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. బ్రిటీష్ రాజపత్రం ప్రకారం కాపులకు రిజర్వేషన్ కల్పించారన్నారు.

1956లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రిజర్వేషన్లు తొలగించారని .. ఆ తర్వాత వచ్చిన సీఎం దామోదరం సంజీవయ్య 1961లో కాపు జాతికి రిజర్వేషన్లు కల్పించారని వెల్లడించారు. 1964లో సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి ఈ రిజర్వేషన్లు రద్దు చేయడం జరిగిందని చెప్పారు.

కాపు జాతికి రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం.. గెలిచిన తర్వాత మొహం చాటేయడం జరుగుతుందన్నారు. కేవలం తన సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం వాడుకుంటున్నారని మోదీకి రాసిన లేఖలో ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.