క్లారిటీ ఇచ్చిన ‘సాహో’ టీమ్

19 July, 2019 - 5:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు.. అందుకు గల కారణాలను సైతం ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విశదీకరించింది. ఈ సినిమాను అత్యంత నాణ్యతతో తీర్చిదిద్దే క్రమంలో ఆలస్యం అయిందని తెలిపింది.

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు భారీగా హంగులు జోడిస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. జాకీ ష్రాఫ్, నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, చుంకీ పాండే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా  తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ బాగ్చ, జిబ్రాన్ సంగీతాన్ని అందించారు.

వంశీకృష్ణ, ప్రమోద్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అసలు అయితే ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇదే రోజు టాలీవుడ్‌లో శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం, అడవి శేష్ నటించి ఎవరు చిత్రాలు విడుదలవుతున్నాయి. అలాగే బాలీవుడ్‌లో మిషన్ మంగళయాన్, బాట్లా హౌస్ చిత్రాలు విడుదలవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సాహో చిత్రం విడుదల తేదీని మార్చారనే టాక్ వైరల్ అవుతోంది. కాగా ప్రభాస్.. బాహుబలి 1, 2 భాగాల తర్వాత వస్తున్న సాహోపై ఆయన ఫ్యాన్స్‌ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు రూ. 300 కోట్ల భారీ ప్రాజెక్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.