దేవరగట్టు ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు

09 October, 2019 - 6:33 AM

(న్యూవేవ్స్ డెస్క్)

దేవరగట్టు (కర్నూలు జిల్లా): బన్నీ ఉత్సవంలో ప్రతి ఏడాది మాదిరిగానే మళ్ళీ రక్తం పారింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయ దశమి రాత్రి జరిగే కర్రల సమరం (బన్నీ ఉత్సవం)లో 50 మందికి పైగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందని సమాచారం. గాయాలపాలైన వారిని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ ఇలవేల్పు మాలమల్లేశంను దక్కించుకునేందుకు విజయ దశమి మంగళవారం రాత్రి ఐదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో యుద్ధానికి దిగారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ కర్రల యుద్ధం ఆచారాన్ని ఈసారి కూడా భక్తులు కొనసాగించారు.

కాగా.. బన్నీ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు దేవరగట్టుకు తరలివచ్చారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప దగ్గరే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. ఉత్సవం సందర్భంగా జరిగే హింసన నివారించడం కోసం వారు, పోలీసులు చేపట్టిన చర్యలు అస్సలు ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్ వాహనంతో నిఘాను పటిష్టం చేశారు. వెయ్యి మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

నిజానికి నెల రోజుల ముందు నుంచే బన్నీ ఉత్సవంలో హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం చేసినా మాలమల్లేశం భక్తులు పెడచెవిన పెట్టారు. బన్నీ ఉత్సవం సందర్భంగా మద్యాన్ని అరికట్టేందుకు ఆబ్కారీ అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కర్రల యుద్ధంలో పాల్గొన్నవారిలో ఎక్కువ శాతం మంది మద్యం సేవించి వచ్చారు. మద్యం మత్తులోనే వారు కర్రలతో కొట్టుకోవడంతో ఇంత పెద్ద ఎత్తున గాయాలపాలయ్యారని తెలుస్తోంది.