రష్యా, చైనా అధ్యక్షులతో మోదీ బేటీ

14 June, 2019 - 1:07 AM

(న్యూవేవ్స్ డెస్క్)

బిష్కెక్‌: షాంఘై సహకార సంస్ధ (ఎస్‌సీఓ) సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని నగరం బిష్కెక్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. పుతిన్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అమేథిలో రైఫిల్‌ తయారీ యూనిట్‌కు రష్యా సహకారాన్ని కొనియాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.మరోవైపున చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌’తో కూడా ప్రధాని మోదీ భటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై వారిద్దరూ ఈ సందర్భంగా చర్చలు జరిపారు. భారతదేశంలో బ్యాంక్‌ ఆఫ్‌ చైనా శాఖల ప్రారంభంతో పాటు మసూద్‌ అజర్‌ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. కాగా.. ఎస్‌సీఓ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారని, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతం అవుతోందని, వారు పలు ద్వైపాక్షిక అంశాలపై సంప్రదింపులు జరిపారని పీఎంఓ ట్వీట్‌ చేసింది.