మోదీకి ‘సీన్ సితారే’నా…?

08 June, 2018 - 5:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దేశంలో జరిగే సాధారణ ఎన్నికల్లో పరాభవం తప్పేలా లేదని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు అర్థమైనట్లుంది. మళ్లీ అధికారంలోకి రావడం కోసం వాళ్ళిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. అందులో భాగంగానే తాజాగా మోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ నివాసానికి వెళ్లి, ఆయనతో ముచ్చటించి వచ్చారు. వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2014 ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయవిహారం చేయడంతో కేంద్రంలో నరేంద్ర మోదీ పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టే క్రమంలో వయో వృద్ధులకు కేబినెట్‌‌లో నో ఛాన్స్ అని కమలం పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీంతో సీనియర్ కమలనాథులంతా తెరమరుగయ్యారనే చెప్పాలి. బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వానీ గాంధీనగర్ నుంచి లోక్‌‌సభకు ఎన్నికైన ఆయన పార్టీలో నామమాత్రంగానే మిగిలిపోవాల్సి వచ్చింది.

అయితే.. మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఎల్.కె. అద్వానీని దైవంగా కొలచిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే వరకు అద్వానీపై ఆయన ప్రేమ కురిపించారు. ఆ తర్వాత అద్వానీతో పనేముందనుకున్నారో ఏమో పక్కన పెట్టేశారు. ఇటీవల త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ క్రమంలో ఆ పార్టీకీ చెందిన విప్లవ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ ముఖ్యఅతిథిగా వెళ్లారు. అప్పటికే సభా వేదికపై ఎల్. కే. అద్వానీతో పాటు పలువురు కమలనాథులు ఆశీనులయ్యారు.

ఆ కార్యక్రమానికి వచ్చిన మోదీ నేరుగా వేదికనెక్కారు. మోదీని చూసి అంతా గౌరవ సూచకంగా మిగతా నాయకులు లేచి నమస్కరించారు. ఆ క్రమంలో అద్వానీ కూడా లేచి మోదీకి నమస్కరించారు. కానీ అద్వానీని పట్టించుకోకుండా మోదీ ముందు వెళ్లిపోయి ఆ పక్కనే ఉన్న మరొక నాయకుడిని పలకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌‌లో హల్‌చల్ చేసింది. సోషల్ మీడియా సాక్షిగా మోదీ వైఖరిపై నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మోదీ.. అద్వానీ ఇంటికి ఎందుకు వెళ్లారనే అంశంపై పలు రకాలుగా చర్చనీయాంశమైంది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు గానూ 21 రాష్ట్రాల్లో కాషాయం పార్టీ జెండా రెపరెపలాడుతోంది. దక్షిణాదిలో ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ అధిక సీట్లు గెలుచుకున్నా అధికారానికి అడుగుదూరంలోనే ఉండిపోవాల్సిన గతి పట్టింది.

అలాగే.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తదితర నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.
ఇలా అయితే.. దక్షిణాదిలో కాషాయం పార్టీ గెలుపు కష్టమని మోదీ, అమిత్ షా ద్వయం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదీకాక ఇప్పటికే ఎన్డీఏలో నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఇక శివసేన అయితే అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. బీహార్‌‌లోని జేడీ (యూ) సీట్ల సర్దుబాటుపై పేచీల మీద పేచీలు పెడుతూ.. బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో ఇలా అయితే రానున్న ఎన్నికల్లో గెలుపు సులువు కాదనే పాయింట్ మోదీ, అమిత్ షా ఇద్దరికీ అర్థమైనట్లుంది. దాంతో వయో వృద్ధులంటూ దూరంగా నెట్టిన అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో పాటు వృద్ధ నేతలను కలుపుకుని వెళ్లాలని మోదీ, అమిత్ షా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బీజేపీకి అటల్ బీహారీ వాజపేయి, ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. 1990లో బీజేపీ అంటే ఈ ముగ్గురే గుర్తుకు వచ్చేవారు. 2014 ఎన్నికల తర్వాత దూరంగా పెట్టిన ఈ ఇద్దరినీ కలుపుకుని వెళ్తే కానీ 2019 ఎన్నికల్లో మన ప్లాన్ వర్కవుట్ కాదని మోదీ, షా ద్వయం భావించారు. దీంతో వారిని దువ్వే పనిలో పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దూరం చేసుకున్న వారిని దగ్గర చేసుకోవడం.. దగ్గరగా ఉన్న వారిని దూరం పెట్టడం.. అదే కదా రాజకీయమంటే. రాజకీయాన్ని బాగా ఒంట బట్టించుకున్న మోదీ, అమిత్ షా ద్వయం పార్టీలోని కురు వృద్ధులను కలుపుకుని వెళ్లడంలో ఎంత వరకు సఫలం అవుతారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.