దేవరగట్టు ‘కర్రల’ సమరానికి సర్వం సిద్ధం

30 September, 2017 - 11:41 AM


(న్యూవేవ్స్ డెస్క్)

కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. సాంప్రదాయం, విశ్వాసం పేరుతో కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద ఎత్తైన కొండపై వెలసిన మాల మల్లేశ్వరస్వామి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ గుడిలోని దేవతామూర్తులైన మాలమ్మ, మల్లేశ్వరునికి దసరా పర్వదినాన రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురుతో విగ్రహాలను వూరేగిస్తారు. ఈ ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీన్నే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు.ఈ దాడుల్లో భారీ ఎత్తున గాయాలపాలవుతారు. కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో ఈ ఉత్సవంపై నిషేధం ఉంది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి సంప్రదాయం పేరిట ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కర్నాటకలోని బళ్లారి నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ఉత్సవంలో మద్యం తాగకూడదని పోలీసులు నిబంధన విధించారు. అలాగే కర్రలకు ఇనుప చువ్వలు, ఇనుప రింగులు ఉంచకూడదని తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. హద్దు మీరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఈ ఉత్సవాలను అడ్డుకోవాలని ప్రయత్నించిన పోలీసులపై గ్రామస్థులు దాడికి పాల్పడటం.. తొక్కిసలాటలో ఓ బాలుడు మృత్యువాత పడటం, పలువురు గాయాలపాలవడం తదితర ఘటనలు జరిగాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా, కర్రల సమరాన్ని నిషేధించాలని 2008లో జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఆదేశాలు జారీచేసింది. అయితే ఇది ఇంతవరకు అమలు కాలేదు.