కోర్టులో సంగీతకు ఊరట…!

11 January, 2018 - 3:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: బోడుప్పల్‌లో భర్త ఇంటి ముందు గత 54రోజులుగా దీక్ష చేస్తున్న సంగీతకు మియాపూర్ కోర్టులో ఊరట లభించింది. సంగీతపై వేధింపుల కేసులో ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, మామ బాల్‌రెడ్డితో పాటు అత్త గురువారం మియాపూర్ ఫ్యామిలీ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీతకు అనుకూలంగా  కోర్టు తీర్పునిచ్చింది. సంగీతకు నెలకు రూ.20వేలు ఇచ్చి, ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలపై తాము పైకోర్టులో అప్పీల్ చేస్తామని సంగీత అత్తింటి వారు తెలిపారు.

ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ తనకు, తన కుమార్తెకు అన్యాయం జరిగిందని, అత్తింటివారు ఇంట్లోంచి గెంటేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకూ, తన కుమార్తెకు ఆర్థికంగా, రక్షణపరంగా ఏవైతే హక్కులు ఉన్నాయో అవి తనకు చెందాలన్న ఉద్దేంతోనే దీక్షకు కూర్చున్నానని పేర్కొంది. గత 50 రోజులుగా అత్తింటివాళ్లతో ఎన్ని విధాలుగా, ఎంతో మందితో మాట్లాడించినా వారి నుంచి స్పందన లేదని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన కుమార్తె భవిష్యత్తు ముఖ్యమని, అందుకే న్యాయ పోరాటం చేస్తున్నట్లు సంగీత స్పష్టం చేసింది.

బోడుప్పల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి.. టీఆర్ఎస్ నేతగా చెప్పుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకు విడాకులిచ్చిన శ్రీనివాస్ రెడ్డి 2013లో సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెను చిత్ర హింసలకు గురిచేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. సంగీత ఇంట్లో నుంచి వెళ్లిపోగానే అదే ప్రాంతానికి చెందిన జగదీశ్వరీ అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సంగీత.. ఇదేంటని ప్రశ్నిస్తే దారుణంగా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దానికి సంబంధించి వీడియో వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సంగీత తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ఎదుటే పోరాటం సాగిస్తోంది. తన చిన్నారి కూతురితో కలిసి భర్త ఇంటి ఎదుటే నిరసన తెలుపుతోంది.