విచిత్ర దొంగ!

14 July, 2019 - 7:51 AM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: ఇల్లు కంటే గుడిసె పదిలం అన్నది పెద్దల సామెత. బయటి ప్రపంచం కేంటే జైలే పదిలం అనేది తాజా సామెతగా చెప్పుకోవాలేమో.. ఇలాంటి సామెతనే ఒక విచిత్ర దొంగ ఫాలో అయిపోయాడు. బయట సమాజంలో ఉంటే.. మూడు పూటలా భోజనం.. కాలక్షేపానికి కబుర్లు చెప్పుకునేందుకు తోటి దొంగలు అందుబాటులో ఉండని పరిస్థితిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. దాంతో చెన్నైలో ఈ విచిత్ర దొంగ మళ్ళీ జైలుకు వెళ్ళేందుకు చేసిన పని ఇప్పుడు మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అతగాడో దొంగ.. పోలీసులకు దొరికిపోయి జైలు జీవితం అనుభవించాడు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతగాడిని విడిపెట్టారు. అయితే.. బయటి సమాజంలో ఆ జైలు జీవి ఇమడలేకపోయాడు. బయటి కంటే.. జైలే నయమనుకున్నాడు. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసిన ఆ దొంగ ఓ బైకులు దొంగిలించాడు. అది కూడా కెమెరాకు తన ముఖం స్పష్టంగా కనిపించేలా మరీ ఫోజులిచ్చి బైకుల్ని తస్కరించాడు. ఇతగాడి చోరీ కాస్తా సీసీ కెమెరాల్లో పరిశీలించిన పోలీసులు ఊరకే ఉంటారా? మళ్ళీ పట్టుకున్నారు. జైలుకు పంపించారు.

విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన జ్ఞాన ప్రకాశం జైలు ఫుడ్, అందులోని వాతావరణం, ఇతర ఖైదీల ఫ్రెండ్‌షిప్ కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఇది అతగాడికి హాబీగా మారింది. బయట ఉంటే తిండి దొరకదేమో అనే బెంగ ఉండొచ్చేమో కానీ.. జైల్లో ఉంటే ముప్పూటలా వేళకు భోజనం పెడతారని ఈ విచిత్రదొంగ ఫిక్సయిపోయాడు. అందుకే జైలుకు వెళ్లడం కోసమే చోరీలు వృత్తిగా పెట్టుకున్నాడు.

జ్ఞాన ప్రకాశం వయసు 52 సంవత్సరాలు. మొదటిసారి ఈ ఏడాది మార్చిలో ఓ చోరీ కేసులో అరెస్టయిన ప్రకాశం జైలుకు వెళ్లాడు. అక్కడి ఖైదీల స్నేహపూర్వక ధోరణి, ముఖ్యంగా జైలు రుచులు అతడికి ఎంతగానో నచ్చేశాయి. సొంత ఇంటి కంటే జైలే బాగుందనిపించింది. జూన్‌లో బెయిల్‌పై బయటికొచ్చినా జైలు వాతావరణాన్ని మాత్రం మరచిపోలేకపోయాడు. దాంతో.. మళ్లీ ఓ దొంగతనం చేసి జైలుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

చెన్నై నగరంలోని కైలాసపురం ప్రాంతంలో బైకులు చోరీ చేస్తూ.. అక్కడున్న సీసీ కెమెరాలో ముఖం కనిపించేలా చూసుకుని మరీ వెళ్ళేవాడు. అయితే.. తాను చోరీ చేసిన బైకులో పెట్రోల్ అయిపోవడంతో నిలిచి ఉంచిన ఓ బైకు నుంచి పెట్రోల్ చోరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఎందుకు పెట్రోల్ దొంగిలిస్తున్నావని పోలీసులు అడిగితే, తాను పెట్రోల్ మాత్రమే కాదని, బైకులు కూడా చోరీ చేస్తున్నానని చెప్పాడు. వీడేంటి, విచారణ లేకుండానే అన్నీ కక్కేస్తున్నాడని ఆశ్చర్యపోయిన పోలీసులు ఆ తర్వాత ప్రకాశం చెప్పింది విని మరింత షాక్ తిన్నారు.

జైలు జీవితం కోసమే తాను చోరీలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీనిపై ఏసీపీ వివరణ ఇచ్చారు. ప్రకాశానికి కుటుంబ సభ్యుల నిరాదరణ చాలా మనస్తాపం కలిగించిందని, జైలు అతడికి సొంత ఇల్లులా అనిపించిందని తెలిపారు. ఇతర ఖైదీలతో స్నేహం ఏర్పడడం, వేళకు మంచి భోజనం పెట్టడం ప్రకాశాన్ని బాగా ఆకర్షించిందని వెల్లడించారు.

ప్రకాశం అందరిలాంటి దొంగేమీ కాదు. అందుకే వార్తల్లోకి ఎక్కాడు. సాధారణంగా దొంగతనాలు చేసి జైలుకెళ్తారు కానీ మనోడు మాత్రం తిండి, స్నేహితు కోసం జైలుకెళ్ళడం విచిత్రం కాక మరేంటి?