’24 గంటల కరెంట్‌‌ కావాలా..వద్దా?’

13 January, 2018 - 3:00 PM

                                                       (న్యూవేవ్స్ డెస్క్)

వరంగల్: తెలంగాణలో సాగుకు ఇస్తున్న 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. సాగుకు 24 గంటల విద్యుత్ అవసరమా.. వద్దా అనేది రైతులే నిర్ణయించుకుంటారని చెప్పారు. 24 గంటలు అవసరం లేని చోట రైతులు తీర్మానం చేసుకుని అవసరమైన దగ్గర ఆ విద్యుత్ ను వినియోగించుకుంటారని ఆయన తెలిపారు. నిరంతర సరఫరా వద్దనుకుంటే గ్రామతీర్మానం చేయాలని రైతులకు సూచన చేశారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పర్యటించిన మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ ఎస్సారెస్పీ కింద వర్ధన్నపేట నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీనిచ్చారు . సాధారణ రీతిలో పనులు జరిగితే కాళేశ్వరం పూర్తికి పదేళ్లు పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఏడాది లోపే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కానుందన్నారు. కాళేశ్వరం పనులు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయన్నారు.