‘నివేదికలు చూశాక రివర్స్ టెండరింగ్’

11 July, 2019 - 4:51 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హాయంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి.

ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. ప్రాజెక్టులపై కమిటీలు వేశామని… వాటి నివేదికలు వస్తాయని తెలిపారు. ఈ నివేదికలు చూశాక రివర్స్ టెండరింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.

గత ప్రభుత్వం ప్రాజెక్టులపై అంచనాలు పెంచుకుంటూ పోయిందని గుర్తు చేశారు. కమిటీ నివేదికలు వచ్చాక అన్ని విషయాలు బయటకొస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూర్తి చేస్తారని సభలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.