విపక్షానికి… సురేశ్ సవాల్

08 November, 2019 - 4:49 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరమని భావిస్తున్నామని… అందుకోసం తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలు వేసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో విలేకర్లతో మంత్రి సురేశ్ మాట్లాడుతూ… వచ్చే విద్యాసంవత్సరం నుంచి క్రమంగా ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. 9,10 తరగతుల విద్యార్థులకు రెండేళ్లు వెసులుబాటు ఉంటుందన్నారు. అయితే తెలుగును తమ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయ పడ్డారు.

అయితే ప్రస్తుతం 62 శాతానికి పైగా విద్యార్ధులు ఆంగ్లమాధ్యమంలోనే చదువుతున్నారని మంత్రి సురేశ్ గుర్తు చేశారు. కాగా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారన్ని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంత పిల్లలూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలని తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందాలంటే ఆంగ్లమాధ్యమం తప్పనిసరి అని ఆయన చెప్పారు.

అయితే తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమం చేపడుతోందని ఆయన వివరించారు. విద్యాశాఖలో సంస్కరణల దిశగా ముందుకెళ్తున్నామన్నారు. విద్యారంగంలో గత ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన కరిక్యులమ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సురేశ్ వివరించారు. అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు సిలబస్ మారుస్తున్నామని ఆయన వెల్లడించారు. నేటి పోటీ పరీక్షలకు తగినట్లు బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆంగ్ల మాధ్యమ బోధన కోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇస్తామన్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఇఫ్లూ, ఇతర సంస్థల సహకారం సైతం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. తమను విమర్శించే వారు ఎవరైనా తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా ? అని విపక్ష పార్టీల నేతలకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ సందర్బంగా సవాల్ విసిరారు. రాజకీయాలు చేసేందుకే విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం మాతృ భాష వికాసానికి కట్టుబడి ఉందని సురేశ్ స్పష్టం చేశారు. తెలుగును సబ్జెక్టుగా చదవడం తప్పని సరి చేశామని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామర్థ్యం, నైపుణ్యానికి కొరత లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పుకొచ్చారు.

కాగా పాఠశాలలోనే తెలుగు మీడియానికి బదులు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై విపక్ష టీడీపీ నేతలు .. అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిమూలపు సురేశ్ పై విధంగా స్పందించారు.