‘ఉగ్రవాదులు మా సోదరులు’

11 January, 2018 - 5:04 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌ అధికార పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే ఐజాజ్‌ అహ్మద్‌ మిర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాల చేతుల్లో హతమవుతున్న కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాదులు తమ సోదరులని, అమరులని వ్యాఖ్యానించారు. వారి మరణాలను మనం వేడుకలుగా జరుపుకోకూడదన్నారు.

గురువారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు ఐజాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌‌ నుంచి ఉగ్రవాదులుగా మారి భద్రతా దళాల చేతుల్లో హతమవుతున్న వారు అమరులు. వారు మా సోదరులు. వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. వారు ఏం చేస్తున్నవారో వారికే తెలీదు. ఉగ్రవాదుల హత్యలను మనం వేడుకగా జరుపుకోకూడదు. ఇది మన సామూహిక వైఫల్యం. మన భద్రతా దళాలు అమరులైనప్పుడు ఎలా విచారం వ్యక్తం చేస్తామో ఉగ్రవాదులు హతమైనప్పుడు కూడా అలాగే ఉందాం. జవాన్ల కుటుంబాలతోపాటు ఉగ్రవాదుల కుటుంబాలకు కూడా సంఘీభావం తెలుపుదాం’ అని మీర్‌ వ్యాఖ్యానించారు. హురియత్‌, వేర్పాటువాదులు, ఉగ్రవాదులతో మాట్లాడి కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని అల్లర్లను నిలువరించాలంటే వారితో చర్చలు జరపాలని పేర్కొన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే ఉగ్రవాదులను వెనకేసుకొస్తూ మాట్లాడటం పట్ల మిత్రపక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలు పీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బాధ్యత గల పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.