త్వరలో పోస్టుల భర్తీ

16 June, 2019 - 6:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో తన ఛాంబర్‌లో సుచరిత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఛాంబర్‌లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలపై అత్యాచారాలు, నేరాల నివారణ బాధ్యత పోలీసులపై ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత అందరిది అని చెప్పారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని సీఎం వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు కమిటీ వేశామని.. ఆ నివేదిక అందిన వెంటనే అమలు చేస్తామని సుచరిత తెలిపారు.

పోలీసుల విభాగంలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఆమె ప్రకటించారు. రాష్ట్రానికి 4 బెటాలియన్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. మహిళ, గిరిజన బెటాలియన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళలకు సత్వర భద్రత కోసం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. నేరాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని సుచరిత పేర్కొన్నారు.