‘ఏపీలో సినీ పరిశ్రమకు సీఎం జగన్ తోడ్పాటు!’

15 October, 2019 - 7:47 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: సినిమా పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని ఆయన చెప్పడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా తాను ముందుంటానని వైఎస్‌ జగన్‌ చెప్పారన్నారు. ఏది కావాలన్నా అడగడానికి ఏ మాత్రం సంకోచించవద్దని తనకు జగన్ చెప్పారని చిరంజీవి అన్నారు. సహాయం చేసే జగన్ గుణం తనలో చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. జగన్‌తో ఉన్నంతసేపూ కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగిందని మెగాస్టార్ చెప్పారు. సైరా నరసింహారెడ్డి సినిమాను త్వరలోనే తప్పకుండా చూస్తానని జగన్ తనకు చెప్పారని తెలిపారు.

సీఎం జగన్‌తో భేటీపై చిరంజీవి ఏమన్నారంటే..:

‘వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే కలవాలనుకున్నాను. కానీ సైరా నరసింహారెడ్డి మూవీ షూటింగ్‌ వల్ల అది కుదరలేదు. అందుకే ఇపుడు సైరా సినిమా చూడాలని వ్యక్తిగతంగా ఆయనను ఆహ్వానిద్దామని అనుకున్నాను. మీరు సతీసమేతంగా రావాలి, మధ్యాహ్నం మాతో కొంత సమయం గడపాలి అని వైఎస్‌ జగన్‌ కోరారు. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఐ ఫీల్‌ ఇట్స్‌ ఏ హానర్‌. ఎంతో ప్రేమతో, సోదర వాత్సల్యంతో వైఎస్‌ భారతి కూడా మమ్మల్ని ఆహ్వానించారు. కుటుంబ సభ్యుల మధ్య గడిపిన అనుభూతి కలిగింది. వారిద్దరికీ ప్రత్యేకించి అభినందనలు. నేను సీఎంను కోరింది ఏంటంటే.. రాయలసీమకు సంబంధించిన ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడి చరిత్రపై రామ్‌చరణ్‌ ‘సైరా’ సినిమా తీశాడు. దానిని మీరు తప్పకుండా చూడాలి అని అడిగాను. ఆయన త్వరలోనే ఈ సినిమా చూస్తానని చెప్పారు’ అని చిరంజీవి అన్నారు.

సినిమా పరిశ్రమకు మీ సహాయ సహకారాలు, ప్రోత్సాహం కావాలి అని వైఎస్‌ జగన్‌ను కోరగానే సినీ పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతోమందికి ఆదరువు కావాలని, ఉపాధి కల్పించాలని ఆయన ఆకాంక్షించారన్నారు. సినీ పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అలాగే సినీ పరిశ్రమకు ఏదైనా చేయాల్సి వస్తే తానెప్పుడూ ముందుంటానని, అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దని వైఎస్‌ జగన్‌ అన్నారని చెప్పారు.

గత ప్రభుత్వం రెండేళ్లుగా నంది అవార్డుల్ని ప్రకటిస్తున్నా వాటిని అందించలేదని ప్రస్తావించగా త్వరలోనే ఉత్సవం నిర్వహించేలా తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, కచ్చితంగా అమలు చేస్తామని జగన్‌ చెప్పారన్నారు. సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారంటే.. ‘ఎనీ టైమ్‌ అన్నా కచ్చితంగా అందర్నీ కలుస్తాను. సమయం తీసుకొని ఏర్పాటు చేయండి’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారని చిరంజీవి తెలిపారు.

అంతకు ముందు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా సోమవారం కలుసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణి సురేఖతో కలిసి వచ్చిన చిరంజీవి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పటమటలోని తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి కలిసి చిరంజీవి దంపతులను సాదరంగా ఆహ్వానించారు.చిరంజీవి జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు. సురేఖ కూడా తాను స్వయంగా వైఎస్‌ భారతికి చీరను బహూకరించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ కూడా చిరంజీవికి శాలువ కప్పి, వెండి వీణను జ్ఞాపికగా అందజేశారు. ఆ తర్వాత సీఎం ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ జగన్ నివాసంలో ఉన్నారు. మధ్యాహ్న భోజనం చేస్తూ వారు పలు విషయాలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వారు వ్యక్తిగత, సినిమా సంబంధ విషయాలు చర్చింరుకున్నారని తెలుస్తోంది. తరువాత జగన్‌ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు చెప్పారు.