‘మహానటి’ యూనిట్‌కు మెగాస్టార్ సత్కారం

12 May, 2018 - 2:09 PM

అలనాటి లేడీ సూపర్ స్టార్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సూపర్‌ హిట్‌ టాక్‌‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాను అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా యూనిట్‌‌కు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.తాజాగా మెగా స్టార్‌ చిరంజీవి.. దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించారు. మొదటి నుంచీ కూడా ‘మహానటి’ని తెరకెక్కించే ప్రయత్నాన్ని ప్రశంసిస్తోన్న చిరంజీవి తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్‌లను తన ఇంటికి ఆహ్వానించారు. ‘మహానటి’ని అందంగా, హృద్యంగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయినందుకు, తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగిన ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ , మహానటి సినిమా ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌‌లకు శాలువాలు కప్పి సత్కరించారు. పట్టు వస్త్రాలతో వారిని సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించారు.

‘మహానటి’ సినిమా చూసిన తర్వాత భావోద్వేగానికి గురైనట్లు చిరంజీవి చెప్పారు. సావిత్రి తన అభిమాన నటి అన్నారు. ‘మహానటి’ ద్వారా ఆమెకు జీవం పోశారంటూ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. తమిళనాట నడిగయ్యార్‌ తిలగం పేరుతో శుక్రవారం రిలీజైన మహానటికి అక్కడ కూడా సూపర్‌ హిట్ టాక్‌ రావటం విశేషం.