చిరు 152వ సినిమా ప్రారంభం

09 October, 2019 - 1:47 AM

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం మంగళవారం లాంఛనంగా ప్రారంభమైంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహించారు. తద్వారా సైరా నరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ మూవీని అందించిన చిరంజీవి తన అభిమానులకు దసరా కానుక ప్రకటించినట్లయింది. ఎలాంటి హడావుడీ లేకుండా ఈ ప్రారంభ వేడుక జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్‌ కొట్టారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివతో పాటు చిరంజీవి తల్లి అంజనీదేవి, కుమార్తె సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’  రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలై దాదాపు వారమైనా థియేటర్లలో ఇంకా అభిమానుల హడావుడి తగ్గలేదు. ఇప్పటికీ పలు థియేటర్ల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే ‘సైరా’ ఏ రేంజ్‌లో హిట్‌ అయిందో తెలుసుకోవచ్చు.  ఇంతటి భారీ విజయం అందుకున్న టాలీవుడ్‌ మెగాస్టార్‌ తన తదుపరి చిత్రానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఉగాదికి ఈ కొత్త సినిమాను విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలతో ఈ చిత్రం స్క్రిప్ట్‌ను కొరటాల శివ రూపొందించినట్లు సమాచారం.