పైరసీకారులకు చిరు ‘స్వీట్ వార్నింగ్’!

20 August, 2018 - 12:03 PM

‘కోట్లాది రూపాయలు వెచ్చించి తీసిన సినిమా కంటెంట్‌‌ని కుర్రతనంగానో, వేరే దురుద్దేశాలతోనో చోరీ చేసి ఫ్రెండ్స్‌‌తో షేర్‌ చేసుకోవడం ఏం న్యాయం? సినిమా పరిశ్రమ కొన్ని వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న మాతృసంస్థ. తల్లిలాంటిది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్లు దాన్ని దొంగిలించడం అంటే..తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లే అని తెలుసుకోవాలి. ఈ రోజు వారంతా జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? మీ తల్లితండ్రులకు బాధ కలిగించాలా? ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కర్నీ నేను హెచ్చరిస్తున్నా. కింది స్థాయి టెక్నీషియన్లు ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే అది మీ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని గుర్తుంచుకోండి’ అని మెగా స్టార్ చిరంజీవి అన్నారు.

విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్న జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై సక్సెస్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన బ్లాక్‌‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘ఈ ఫంక్షన్‌‌లో పాలు పంచుకోవడం నా బాధ్యత. ఆ సంతృప్తి కోసమే గీత గోవిందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌‌కి వచ్చా. ఓ సినిమా బాగుందంటే అది చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెట్‌ సినిమానా అని ఆలోచించరు. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకుల దృష్టిలో అన్నీ పెద్ద బడ్జెట్‌ సినిమాలే’ అని చిరంజీవి అన్నారు. ‘రెండేళ్లుగా చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషం, ఉత్సాహం, ప్రోత్సాహంతో ముందుకెళుతోందన్నది వాస్తవం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, అభిమానానికి మేం ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం’ అన్నారు.‘ఏం సినిమా తీస్తున్నారని అరవింద్‌‌ను నేను అడిగినప్పుడు గీత గోవిందం చేస్తున్నాను. అర్జున్‌‌రెడ్డి సినిమాలో విజయ్‌ అగ్రెసివ్‌ పాత్ర చేశాడు.. గీత గోవిందం సినిమాలో చాలా సాఫ్ట్‌. ఈ పాత్రని ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న డౌట్‌ వచ్చినప్పుడు నాకు నా విజేత గుర్తొచ్చింది. ఖైదీ, అడవిదొంగ, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్లు లేవు వంటి సినిమాలతో యాక్షన్‌ హీరోగా నేను దూసుకెళుతున్న టైమ్‌‌లో.. విజేత ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీ. ఈ పాత్రలో నన్ను ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న మీమాంస నాకు, అరవింద్‌‌కు ఉండేది. ఆ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకులకూ నన్ను దగ్గర చేసి, ఆల్‌ క్లాస్‌ హీరో అనిపించింది. గీత గోవిందం సినిమా కూడా విజయ్‌‌ని ఆల్‌ క్లాస్‌ హీరో అనిపించింది. విజయ్‌‌కి ఇది ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌. నీకు చాలా భవిష్యత్‌ ఉంది. ఈ సినిమాతో నీకు స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. 1978 నుంచి నేను 30 సినిమాలు చేసినా సరే ఖైదీ సినిమా నాకు స్టార్‌ హీరో స్టేటస్‌ ఇచ్చింది. ఇండస్ట్రీలోని టాప్‌‌స్టార్స్‌‌లో విజయ్‌ ఒక్కడు అయినందుకు స్వాగతిస్తున్నా. మన ఇండస్ట్రీకి దక్కిన మరో అరుదైన స్టార్‌ విజయ్‌ దేవరకొండ’ అని మెగాస్టార్ ప్రశంసించారు.పైరసీ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ సినిమా కంటెంట్‌ దాదాపు గంటన్నర లీకైపోయింది.. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు అరవింద్‌. ఆయనకు ఊరట కలిగించేందుకు నేను ఓ మాట చెప్పా. పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘అత్తారింటికి దారేది’ కంటెంట్‌ లీకైనా సక్సెస్‌‌కి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. ‘గీత గోవిందం’ సినిమా కూడా అత్తారింటికి దారేది అంత హిట్‌ అవుతుందని సెంటిమెంట్‌‌గా అనుకోమని చెప్పా అన్నారు.

గీత గోవిందం మూవీ సమర్పకుడు అల్లు అరవింద్‌, చిత్ర నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు పరశురామ్‌, నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ‘ఈ సినిమా సక్సెస్‌ వెనకాల సమర్పకుడు అరవింద్‌, దర్శకుడు పరశురామ్‌, నిర్మాత బన్నీ వాసు ఉన్నారు. జస్ట్‌ నేను యాక్టర్‌‌లా నా జాబ్‌ చేశానంతే’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. సీనియర్‌ నటి అన్నపూర్ణ, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, శానం నాగ అశోక్‌ కుమార్, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్, కెమెరామన్‌ మణికందన్‌ తదితరులు ఈ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు.