‘సైరా’ మూవీ ట్రైలర్ రిలీజ్

18 September, 2019 - 10:39 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మెగా చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ మూవీ రిలీజ్ కోసం మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా ట్రైలర్ వచ్చేసింది. జనాల్ని ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ మొత్తం చిత్రం యూనిట్ రూపొందించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు మేకింగ్ వీడియో మెగా ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం సాయంత్రం విడుదల చేసింది.ట్రైలర్‌లోనే యాక్షన్‌, సెంటిమెంట్‌, దేశభక్తి చూపించారు. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతడు కారణజన్ముడు’ అంటూ మొదలైన ట్రైలర్‌.. చివరి వరకూ అందరినీ కట్టిపడేసింది. అంతేకాకుండా పలు డైలాగ్‌లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము. మీకెందుకు కట్టాలిరా శిస్తు’, ‘స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’ అంటూ చిరంజీవి పలికే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. భారీ యాక్షన్‌ విజువల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది.తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. మెగాస్టార్‌ సరసన నయనతార హీరోయిన్‌’గా నటించిన ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్‌, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కూడా కావటంతో ఆయన తనయుడు, నిర్మాత రామ్‌చరణ్‌ దగ్గరుండి సినిమా పనులన్నీ చూసుకుంటున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.