బాక్సర్‌గా ‘మెగా ప్రిన్స్’..!

11 October, 2019 - 3:04 AM

‘ఎఫ్‌ 2, గద్దలకొండ గణేష్‌’ చిత్రాలతో ఈ సంవత్సరం సూపర్‌ హిట్స్‌ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కొత్త చిత్రానికి గురువారం కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమాకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తారు. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్‌  నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ ఆన్‌ చేయగా, నటుడు, మెగా బ్రదర్ నాగబాబు క్లాప్‌ ఇచ్చారు. అల్లు అరవింద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి వరుణ్‌ తేజ్, కిరణ్‌ కొర్రపాటిలకు స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సందర్భంగా కిరణ్‌ కొర్రపాటి మాట్లాడుతూ.. ‘బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. వరుణ్‌ కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ మూవీ కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుని చాలా మేకోవర్‌ అయ్యారు. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్‌ సి.విలియమ్స్, సంగీతం: తమన్‌.ఎస్‌.