మెగా ఫ్యామిలీలో ఫుల్ జోష్..!

02 October, 2019 - 8:45 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్‌ రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అక్టోబర్ 2 బుధవారం గాంధీజీ జయంత్రి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్‌ వచ్చింది. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు, ఈ మూవీ నిర్మాత రామ్‌చరణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ తమ సంతోషాన్ని ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తండ్రి చిరింజీవి తనను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని, ఆలింగనం చేసుకున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘మన​కు అన్నీ ఇచ్చేసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని చెర్రీ ప్రశంసించారు. ‘సైరా’తో సూపర్‌హిట్‌ అందించినందుకు తన తండ్రికి ధన్యవాదాలు తెలిపారు.

‘సైరా నరసింహారెడ్డి’ పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారని, అందరినీ మెప్పించారని సమీక్షకులు పేర్కొన్నారు. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందని అంటున్నారు. తమ హీరో ప్రతిష్టాత్మకంగా చేసిన సైరా మూవీ బాగుందన్న టాక్‌ రావడంతో  మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. వారి ఆనందాలు, సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ‘సైరా నరసింహారెడ్డి’ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద వారంతా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతున్నారు. ‘సైరా సూపర్‌‘ అంటూ పండుగ చేసుకుంటున్నారు.