మర్యాదగా చెబుతున్నా.. నోరు అదుపులో పెట్టుకోండి!

11 January, 2019 - 12:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ‘సర్.. మర్యాదగా చెబుతున్నా మీకు.. దయచేసి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మీరు వంద విమర్శలు చేయండి. కానీ లూజ్ టంగ్‌తో మాట్లాడకండి. కేవలం సంస్కారంతోనే మేం ఆగుతున్నాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరు. మా అన్నయ్య, తమ్ముడిని ఎవరైనా అంటే మాత్రం నూరు శాతం రియాక్ట్ అవుతాం. ఇప్పటికైనా ఈ లూజ్ టంగ్‌ను ఆపేస్తారని ఆశిస్తున్నాం’ అని నటుడు నందమూరి బాలక‌ృష్ణను ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ‘ఎన్టీఆర్ కాలిగోటికి కూడా చిరంజీవి సరిపోడు’ అంటూ నందమూరి బాలకృష్ణ ఓసారి మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడాన్ని నాగబాబు తప్పుపట్టారు. బాలకృష్ణ వ్యాఖ్యల క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలతో తమకు చాలా బాధ కలిగిందన్నారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా నాగబాబు ఆరవ వీడియో విడుదల చేశారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘బాలయ్య చిన్నపిల్లాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు’ అని వదిలేశారని నాగబాబు గుర్తుచేశారు. రిక్షా తొక్కే వ్యక్తి ఆయన కొడుక్కి గొప్ప కావచ్చనీ, బాలయ్య తన తండ్రి గొప్పతనాన్ని కీర్తించుకోవడం ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అయితే పక్కనవారిని అవమానించడం ఎంతవరకూ సబబని నాగబాబు ప్రశ్నించారు.

‘చిరంజీవి కాలిగోటికి కూడా బాలకృష్ణ సరిపోడు’ అని చెబితే మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్, మీ ఇంట్లో, పార్టీ వాళ్లకు ఎలా ఉంటుంది? ఎంత అహంకారం మీకు? మాకు కోపాలు రావా అంటూ మెగా బ్రదర్ ఈ వీడియోలో బాలకృష్ణను నిలదీశారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలనీ, రాజకీయ విమర్శలు చేయొచ్చని నాగబాబు స్పష్టం చేశారు. అలాంటి వాటిపై తాను రియాక్ట్ కాబోనన్నారు. చిరంజీవి అంటే కేవలం తమకు అన్నయ్య మాత్రమే కాదనీ, తండ్రితో సమానమని వ్యాఖ్యానించారు. తమ అన్నదమ్ముల మధ్య చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయనీ, కానీ తాము ముగ్గురం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఇకపై తాను బాలయ్య జోలికి రాబోననీ, కానీ తమ కుటుంబాన్ని మరోసారి విమర్శిస్తే తాను మళ్లీ రావాల్సి ఉంటుందని నాగబాబు హెచ్చరించారు.

‘థ్యాంక్యూ బాలయ్య గారూ.. ఇకపై మీరు దీన్ని కొనసాగించాలనుకుంటే మీ ఇష్టం. మెగా ఫ్యాన్స్‌కు ఒకటే విన్నపం.. మనం చెప్పాల్సింది చెప్పాం. ఇకపై దీన్ని ఇష్యూ చేయకండి. మహేశ్‌బాబు ఫ్యాన్స్ కావచ్చు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు. మెగా ఫ్యాన్స్ కావచ్చు. మనమంతా మనుషులమే. ఆ తర్వాతే అభిమానులం’ అని నాగబాబు స్పష్టం చేశారు.

ఇంతకాలం తర్వాత బాలకృష్ణ విమర్శలపై స్పందించారేంటి? దీని వెనుక రాజకీయ కారణం ఉందా? అని కొందరు మీడియా మిత్రులు తనను అడిగారని నాగబాబు తెలిపారు. ఈ వీడియోల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మిగతా నేతలు, వ్యక్తులకు రాజకీయ ఉద్దేశాలు ఉండొచ్చనీ, తమకు మాత్రం లేవన్నారు. తమకు సంస్కారం, కల్చర్ ఉన్నాయి కాబట్టి ప్రతీ అడ్డమైన దానికి రియాక్ట్ కాలేదని ఈ వీడియోలో వ్యాఖ్యానించారు.

విమర్శలు భరించి, భరించి, భరించి ఒళ్లు మండిపోయి ఇప్పుడు స్పందిస్తున్నాం అని నాగబాబు తెలిపారు. అయినా రియాక్ట్ కావడానికి అసలు టైమింగ్ ఏముందని ప్రశ్నించారు. ‘మన ఇంట్లో దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత కనబడ్డాడు. పోనీలే ఏడాది అయిపోయింది కదా. వదిలేద్దాం అనుకుంటామా? మనను కొట్టి పారిపోయినవాడు సంవత్సరం తర్వాత కనిపిస్తే వదిలేస్తామా? పట్టుకుని కొడతాం’ అని నాగాబాబు వ్యాఖ్యానించారు.