సమ్మె బాటలో ‘మీ సేవ’లు!

13 January, 2019 - 10:49 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ‘మీ సేవ’ కేంద్రాల్లో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేయాలని మీ సేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చాలీచాలని ఆదాయంతో, మీ సేవ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో సమ్మెకు దిగుతున్నట్టు కమిటీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు.

ఏపీలో మొత్తం 11,054 మీ సేవ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేశారు. వీటిలో నెలకు 500లోపు లావాదేవీలుండే కేంద్రాలు 4,530. మీ సేవ ద్వారా అందించే సేవలకు నామమాత్రపు కమీషన్‌ రావడంతో కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల కేంద్రాలు మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,020 కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఏ సర్టిఫికేట్‌ కావాలన్నా ప్రజలు వెంటనే మీ సేవ కేంద్రానికి వెళ్తున్నారు. విద్యుత్‌ బిల్లులు, వివిధ రకాల పన్నులు, ప్రభుత్వ పరీక్షల ఫీజులు ఇలా సుమారు వందల్లో సేవలు ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి.

ఏపీ ఆన్‌‌లైన్, శ్రీవెన్, రామ్‌ ఇన్‌‌ఫో, కార్వీ, సీఎంఎస్‌ కంపెనీలు మీ సేవ కేంద్రాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. మీ సేవ కేంద్రాలు అందించే సేవలకు ఈ కంపెనీల ద్వారా కేటగిరీ–ఎ, కేటగిరీ–బి కింద కమీషన్‌ చెల్లిస్తున్నారు. కేటగిరీ–ఎ సర్వీసుకు రూ.11 నుంచి రూ.12.90 ఇస్తుండగా, కేటగిరీ–బి సర్వీసుకు రూ.17 నుంచి రూ.18.50 ఇస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఈ మొత్తాల కంటే తక్కువ కమీషన్‌ చెల్లిస్తున్నాయి. పైగా కమీషన్‌‌లో మీ సేవ కేంద్రాలు జారీ చేసే ప్రతి సర్టిఫికేట్‌‌కు రూ.1.50, టీడీఎస్, జీఎస్‌‌టీ కింద 18 శాతం మినహాయిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్‌ పెంచకపోవడం, తక్కువ కమీషన్‌ ఇస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు.

వివిధ సేవలకు చెల్లించే కమీషన్‌ పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు సరైన ఆదాయం రానందున వారికి కనీస వేతనం చెల్లించాలని మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. అప్లికేషన్‌ స్కానింగ్‌‌ను రూ.2 నుంచి రూ.5కు పెంచాలని, ఇటీవల పెంచిన కమీషన్‌‌తో కేంద్రాల నిర్వాహకులకు ఆర్థిక ప్రయోజనం పూర్తిగా లభించనందున కమీషన్‌‌ పూర్తిగా చెల్లించాలని కోరుతున్నారు. 18 శాతం జీఎస్‌‌టీని రద్దు చేయాలని, కమీషన్‌ రివైజ్డ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యుత్‌ కనెక్షన్‌‌ను కేటగిరీ–2 నుంచి ప్రత్యేక కేటగిరీకి మార్చాలని, ఆధార్‌ కేంద్రాలను అన్ని మీ సేవ కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఇలాంటి పలు డిమాండ్లతో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సంక్షేమ సంఘం నిర్ణయించింది.