‘సిట్’కు శిల్ప ఆత్మహత్య కేసు విచారణ

10 August, 2018 - 12:58 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థిని, డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌)కు అప్పగించింది. ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే శిల్ప ఆత్మహత్య చేసుకున్నదంటూ ఆరోపణలు రావడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. సిట్‌ అధికారిగా చిత్తూరు డీఎస్పీ రమణ కుమార్‌‌ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా.. శిల్ప మృతికి కారణమైన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌‌ను ఆమె బంధుమిత్రులు కోరారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రూయా ఆసుపత్రి పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ రవికుమార్ సహా మరో ఇద్దరిని ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే.. ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించడాన్ని ఇతర ప్రొఫెసర్లు, విద్యార్థులు తప్పుబడుతున్నారు. శుక్రవారం ఉదయం సమావేశమైన ప్రభుత్వ డాక్టర్లు, వైద్యులను కామాంధులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతుండటం విచారకరమని, ఎటువంటి విచారణా లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డాక్టర్లను బాధిస్తోందని ఏపీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం చైర్మన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.