బ్లాక్ లిస్టులో 82 వైద్య కళాశాలలు!

08 June, 2018 - 4:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: 2018-19 విద్యా సంవత్సరంలో దేశంలోని 82 వైద్య కళాశాలల ప్రవేశం అనుమతులపై నిషేధం విధించాలని జాతీయ వైద్య మండలి (ఎమ్‌‌సీఐ) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ విషయంపై స్పందించిన సంబంధిత శాఖ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ.. వివిధ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ఇతర వనరులు తదితర అంశాల ఆధారంగా ఎమ్‌‌సీఐ తనిఖీలు నిర్వహించిందన్నారు. తనిఖీల్లో భాగంగా సంబంధిత అంశాల్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఎమ్‌‌సీఐ ఆయా కళాశాలలను బ్లాక్‌ లిస్టులో చేర్చాలని సూచించిందని తెలిపారు.

ఈ మేరకు 2018- 19 సంవత్సరానికి గాను ప్రవేశాలు నిషేధించాలని సిఫారసు చేసిందన్నారు. బ్లాక్‌ లిస్టులోని 82 మెడికల్‌ కాలేజీల్లో 70 ప్రైవేట్‌, 12 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయని ఆ అధికారి తెలిపారు. ఈ కళాశాలలపై నిషేధం విధించడం ద్వారా అందుబాటులో ఉన్న 64 వేల సీట్లలో సుమారు 10వేల సీట్లు విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అంతే కాకుండా కొత్తగా 31 ప్రభుత్వ, 37 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతించాలంటూ వచ్చిన ప్రతిపాదనలు కూడా ప్రస్తుతానికి తిరస్కరించినట్లు ప్రభుత్వాధికారి తెలిపారు.

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2021-22 నాటికి కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.