మద్రాసుతో తెలుగు మీడియా ముడి

05 February, 2018 - 3:26 PM

మీడియా పల్స్

ఇటీవల మీడియా సంంబంధమైన సదస్సులో పాల్గొనాలని మద్రాసు వెళ్ళాను. సంవత్సరమున్నర క్రితం వరకు నేను- ఒక మూడున్నర సంవత్సరాల పాటు అక్కడే పనిచేశాను. చర్చించబోయే పత్రికలు, సినిమా, రేడియో, టీవీ రంగాలలో ఒకటి ఆకాశవాణి. చెన్నపురి ఆకాశవాణిలో పనిచేసిన అనుబంధం కూడా ఉంది. ఇప్పటి తరానికి అప్పటి విషయాలు పూర్తిగా తెలియకపోవచ్చు. ఒక టెలిఫోన్ సంభాషణలో టంకసాల అశోక్ గారు అన్నట్టు మనం మద్రాసును మరచిపోయాం. మిగతా రంగాల గురించి ఇప్పుడు ప్రస్తావించడంలేదు కానీ, మీడియా గురించి చెప్పుకుందాం. తెలుగు మీడియా పురుడుపోసుకుంది మద్రాసులోనే!

ఇప్పుడు మద్రాసువాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. అన్ని దక్షిణాది భాషలూ, సంస్కృతీ అక్కడ అలరారేవి. కావేరినది ఉత్తర ప్రాంతమంతా తెలుగుల ప్రాంతమే! ఉత్తరం వాళ్ళనే మాట తెలుగువారికి వాడేవారు! భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత హైద్రాబాదు, బెంగళూరు, తిరువనంతపురం ప్రాంతాలకు ప్రముఖులు, మేధస్సు, కళా ప్రయత్నాలు కొంతవరకు తరలిపోయాయి.తొలి తెలుగు దినపత్రిక- అన్ని రకాలుగా- ఆంధ్రపత్రిక మద్రాసులోనే 1908లో పుట్టింది. వారపత్రికగా బొంబాయిలో జన్మించవచ్చు. వారపత్రికలూ, మాస పత్రికలూ, పిల్లల పత్రికలూ, సినిమా పత్రికలూ రూపుదిద్దుకున్నది ఇక్కడే. కేసరిగారి గృహలక్ష్మి, పందిరి మల్లికార్జునరావుగారి కిన్నెర, నాగిరెడ్డి- చక్రపాణి గార్ల చందమామ, చక్రపాణి గారి యువ మాత్రమే కాక విజయచిత్ర, స్వతంత్ర సినిమా రంగం, వనిత, భారతి వంటి లెక్కకు మించిన సంఖ్యలో మొదలు కావడమే కాదు, విశేషంగా పరిఢవిల్లాయి. ఒకప్పుడు జాతీయ స్థాయిలో సంపాదకులు ఎంతోమంది తెలుగువారు- సివై చింతామణి, ఎం. చలపతిరావు, కోటంరాజు రామారావు, కోటంరాజు పున్నయ్య, ఖాసా సుబ్బారావు, ఈశ్వరదత్, ఏఎస్ రామన్, పార్థసారథి ఢిల్లీ, అలహాబాదు, లాహోర్ దాకా వ్యాపించి ఉండేవారు. వీరందరికీ ఏదో రీతిలో మద్రాసుతో అనుబంధం ఉంది. ది హిందూ పత్రికను ప్రారంభించిన ఆరుగురు యువకులలో ఒకరు న్యాపతి సుబ్బారావు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది డాక్టర్ పి. వరదరాజులు నాయుడు. కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన వీరు ఒక తెలుగు దినపత్రికను కూడా నడిపారు. అయితే వివరాలు పెద్దగా లేవు. ప్రకాశం పంతులు నడిపిన ‘స్వరాజ్య’ హిందూ పత్రికకు ముచ్చెమటలు పోయించింది ఒక దశలో. మరో దశలో హిందూ పత్రిక- మూతబడుతున్న ఆంధ్రపత్రికను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది.

అన్ని రకాల తెలుగు పత్రికలకూ ప్రణాళికా, ఒక స్వరూపం, ఒక నిర్దుష్టమైన భాషాశైలి రూపొందబడింది ఇక్కడే! పత్రికా భాష అంటూ నేడు భూషణ, దూషణలకు గురయిన, గురవుతున్నది ప్రాణం పోసుకుని స్థిరపడింది ఇక్కడే! కాశీనాథుని నాగేశ్వరరావు, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, కొడవంటి కుటుంబరావు, గోరాశాస్త్రి, జి.వి.జి. మొదలయిన వారు ప్రధానంగా కృషి చేసిందీ, కీర్తి పొందింది ఇక్కడి నుంచే! తెలుగు పత్రికా రంగం తెనాలి, విజయవాడ మీదుగా భాగ్యనగరానికి వెళ్ళింది.

స్వర్ణయుగంగా కీర్తిస్తూ పేర్కొనే తెలుగు సినిమాలు చాలా భాగం రూపొందింది మద్రాసులోనే. సిసలైన కళాకారులు అందరూ ఇక్కడే వారి కళా కౌశలంతో తెలుగు ప్రపంచాన్ని ఏలారు. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఘంటసాల, ఎన్‌టిఆర్, ఎఎన్ఆర్ వంటి మహానుభావులు అద్భుతమైన కృషి చేసింది మద్రాసు కేంద్రంగానే. జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల దాకా సినిమా రంగం మద్రాసులోనే ఉంది. ఇక ఎలెక్ట్రానిక్ మాధ్యమాలకు మూలపుటమ్మ లాంటి ఆకాశవాణి తొలుత తెలుగు కార్యస్థానం మద్రాసే. తెలుగు సినిమా వ్యావహారిక భాష నేర్చుకున్న సమయంలో 1938లో తెలుగు ఆకాశవాణి శ్రీకారం చుట్టుకుంది. స్వాతంత్య్రం  వచ్చాక 1948లో విజయవాడ 1950లో హైదరాబాదులో తెలుగు కేంద్రాలు వచ్చే దాకా మద్రాసు తెలుగు వాణిదే అగ్రస్థానం. ఆచంట జానకీరామ్, బుచ్చిబాబు, రజని వంటి ఎంతోమంది తెలుగు ఆకాశవాణిని వెలిగించారు.

మద్రాసులో మొదలైన పత్రికలు, సినిమా, రేడియో రంగాలు ప్రవర్ధమానమై, స్థిరపడుతున్న సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమంతో పాటు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమాలు రూపుదిద్దుకుని బలపడుతున్నాయి. కనుకనే అప్పటి పత్రికలు, రేడియో, సినిమాలలో వస్తువు గానీ, శైలి గానీ, వ్యక్తీకరణ గానీ- సంస్కారవంతంగా, ప్రజల కోసం కళాత్మకంగా రూపొందాయి.

టెలివిజన్ తెలుగు కార్యక్రమాలు హైదరాబాదులో మొదలు కాగా, ప్రయివేటు తెలుగు టెలివిజన్ మాత్రం మద్రాసులో 1995లో ప్రారంభమైంది. పత్రికారంగపు మేధస్సు, సినిమారంగపు కళానైపుణ్యంతో ప్రయివేటు తెలుగు టెలివిజన్ విస్తరిస్తుందని పత్రికా, సినిమా రంగపు సంస్థలు ప్రవేశించినప్పుడు ఆశించారు. ఏ కాలానికి తగిన గాలం రూపుదిద్దుకుంటుంది కనుక కొత్త పరిణామాన్ని కొత్త కొలబద్దతో కొలువ కూడదు కదా! వారు ఎలా విశ్లేషించినా మద్రాసుతో ముడిపడిన తెలుగు మీడియా పార్శ్వం బలమైందీ, స్పష్టమైందీ!

-డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు