మీడియా పల్స్ : ఎడిటర్స్ డే ఎందుకంటే…

19 September, 2017 - 4:48 PM

తెలుగు ఎడిటర్స్ డే- అంటూ ప్రత్యేకంగా జరుపుకోవాలనే ఈ కొత్త ప్రతిపాదన ప్రతిపాదన ఏమిటి? సెప్టెంబర్ 14 ఉదయం మొబైల్ ఫోన్లో పదే పదే నాకు ఎదురైన ప్రశ్న ఇది! నీటి వసతి తగ్గిపోతు న్నప్పుడే నీటి వనరుల గురించి ఆలోచిస్తాం, అన్వేషిస్తాం. ఒక మీడియా సంస్థలో ఎడిటర్ ఏమి చేస్తున్నాడు? ఏమి చేయాలి? అని నేడు ఆలోచిస్తే బోధపడుతుంది. పైసలు గడించడానికీ, పైరవీలు చేయడానికీ, పదవులు పొందడానికీ- కాదు, కానే కాదు. కాకపోతే మరేమిటి? పాండిత్యం, ప్రతిభ, నైపుణ్యం, పరిశీలన, పరిశోధన, ప్రజాప్రయోజనం ఇలాంటి గుణాలన్నీ మూర్తీభవించిన వ్యవస్థ సంపాదకత్వం. ఇక్కడ పత్రికలా టీవీలా రేడియోనా అనే తేడాలు కాదు, ప్రధానం. మీడియా రూపం ఏదైనా కావచ్చు కానీ మీడియా ధర్మం, మీడియా స్వభావం ప్రధానం. దాని గురించే మనం చర్చించుకుంటున్నాం. ప్రజల సమస్యలకు అద్దం పట్టడమనే ప్రజాస్వామిక లక్షణంలో మీడియావారు అధికారం చేరువకు చేరగలిగే అవకాశం ఉంది. ఈ స్థాయిలోనే బాధ్యతలు మరవడంతోనే అనర్థాలు!

ఇటీవలి కాలంలో ఏ పెద్ద కుంభకోణం కావచ్చు, లేదా చిన్న స్కామ్ కావచ్చు; ఏదో స్థాయిలో మీడియా వ్యక్తుల తోడ్పాటు ఉంటోందనే విమర్శ వినబడు తోంది. కనుక మనం అద్దంలో చూసుకోవాల్సిన సందర్భాలను రూపొందించుకోవాలి. దానికే ఈ సెప్టెంబర్ 14 – తెలుగు సంపాదకుల దినోత్సవం. అలా అంటే ఛానల్స్ పరిభాషలో “పండుగ చేసుకోవడం”కానే కాదు సుమా! సెప్టెంబర్ 14 ఎందుకు?1883 సెప్టెంబర్ 14న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మదినం. వారి ప్రత్యేకతలు ఏమిటీ?

– ఎంఏ చదివిన రెండవ తెలుగు వ్యక్తి.

-తొలి పూర్తిస్థాయి తెలుగు దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’ తొట్టతొలి సంపాదకుడు (1914-17)

-తెలుగు వారపత్రిక ‘స్వరాజ్య’ సంపాదకుడిగా బ్రిటీషువారిని 1908లో సంపాదకీయంలో విమర్శించి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించిన తొలి దక్షిణాది వ్యక్తి.

-The Nationalist ఆంగ్ల వార పత్రిక, ‘సౌందర్యవల్లి’ స్త్రీల పత్రిక, ‘మాతృసేవ’ పత్రిక, ‘ఆంధ్రవార్త’ దినపత్రిక, గ్రంథాలయ సర్వస్వం పత్రికలతో పాటు తెలుగు, తమిళం, ఆంగ్లభాషల్లో వెలువడిన ‘పంచాయతీ’ పత్రిక సంపాదకత్వం.

-ఎడిటర్ అనే మాటకు ‘సంపాదకుడు’ అనే తెలుగు మాట సూచించిన తొలి వ్యక్తి.‘ఆంగ్లపదాలకు ఆంధ్రపదాలు’ – అనే శీర్షిక నిర్వహించిన పాత్రికేయుడు.

-విదేశీ ప్రముఖుడైన అబ్రహాం లింకన్ జీవిత చరిత్ర తెలుగులో రాయడం.

-పలు విజ్ఞాన సంబంధమైన రచనలు చేయడం.

-‘ది హిందూ’ దినపత్రికలో తెలుగు సాహిత్య గ్రంథాలను ఒకటిన్నర దశాబ్దం పాటు పరిచయం చేయడం.

-విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర గ్రంథమాలలతో గ్రంథాలయోద్యమంలో కీలకపాత్ర వహించడం.

-కాంగ్రెస్ పార్టీ, స్వరాజ్య పార్టీ, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆంధ్రవిశ్వవిద్యాలయం సెనేట్ వంటి చోట్ల ప్రాతినిధ్యం మాత్రమే కాదు, మద్రాసు పాకీ పనివారి సంఘాన్ని కూడా నిర్మించారు కూడా. ఇలాంటి పనులు లెక్కలేనన్ని. ఆయన కాలూనని రంగం లేదు.

-వీటన్నిటినీ మించి చివరి దశలో ఎవరినీ ఏమీ ఆశించకుండా చాలా సాధారణ జీవితం గడిపిన ధీశాలి, సుగుణాల ప్రోవు. గాడిచర్లవారిలోని గొప్ప సుగుణాలన్నీ సంపాదకులకు బాధ్యతను గుర్తు చేయాలి. దారి దీపం కావాలి. అందుకే వారి జన్మదినోత్సవాన్ని తెలుగు సంపాదకుల దినోత్సవంగా ప్రతిపాదించడం.

  • – డా. నాగసూరి వేణుగోపాల్

    మీడియా విశ్లేషకులు