సంకల్పంలో సకలాంగులు!

04 December, 2017 - 6:05 PM

మీడియా పల్స్

ఈ క్షణంలో జీవిస్తేనే.. జీవితం! – అంటూ అరుణ్ శౌరి ఫోటోతో శనివారం ఆంధ్రప్రభలో కథనం పత్రిక తీయగానే ఆకర్షించింది. అరుణ్ శౌరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేటు పొంది జర్నలిజంలో ప్రవేశించిన వ్యక్తి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పాత్రికేయుడిగా, సంపాదకునిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కూడా! తర్వాతి కాలంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, ఇటీవలి కాలంలో పార్టీకి దూరం సాగుతున్న వ్యక్తి కూడా! వాదం ఏదైనా, జర్నలిజానికి పరిశోధన ఎంత కీలకమో చూపిన ప్రతిభావంతుడాయన!

అయితే ఇది ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు. అడిగో శౌరి కుమారుడు ఆదిత్య నిలబడలేడు, నడువలేడు, తన కళ్ళకు ఎడమవైపు నుండి మాత్రమే చూడగలడు. కుడిచేతిని ఏమాత్రం ఉపయోగించలేడు. అక్షరమక్షరం కూడబలుక్కుని మాత్రం మాట్లాడగలడు. దీనికి తోడు రెండు దశాబ్దాల క్రితం అరుణ్ శౌరి భార్య అనితకు పార్కిన్‌సన్స్ వ్యాధి ఉన్నట్టుగా తేలింది. ఈ పరిస్థితిని ఎలా తట్టుకున్నారు? గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్ళకుండా కేవలం ప్రస్తుత క్షణంలో జీవించడం అలవాటు చేసుకున్నారు అరుణ్ శౌరి! వి. దుర్గాంబ రాసిన కథనానికి శీర్షిక ‘ఈ క్షణంలో జీవిస్తేనే జీవితం’. ఈ చక్కని కథనంలో మొత్తం నాలుగు ఫోటోలు అందంగా అర్ధవంతంగా అలంకరించారు.మానవాసక్తికరమైన కథనాలు ఎప్పుడూ ఆకర్షిస్తాయి, సందేహం లేదు. ఇటువంటివి మరింతగా! ఎందుకంటే అరుణ్ శౌరి పోరాట యోధుడైన జర్నలిస్టుగా మనకు తెలుసు. అటువంటి వ్యక్తి జీవితంలో తొలుత ఎదురయినది కుమారుడి ‘సెరిబ్రల్ పాల్సీ’ అనే ఆరోగ్య సమస్య. అటువంటి కుమారుని తీసుకుని అరుణ్ శౌరి- అనిత దంపతులు దేశమంతటా తిరిగారు. అంతే కానీ కుమారుడి వ్యాధిని దాచిపెట్టలేదు. ఇదీ ఒక సందేశమే మనకు. తన ఇతర కుటుంబ సభ్యులు ఎలా సహకరిస్తున్నారో చెబుతూ శౌరి సీరియల్స్ చూపే కుటుంబ సభ్యులు రాక్షసంగా ఉంటారని వ్యాఖ్యానిస్తారు. తర్వాతి దశలో భార్య కూడా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడటం. అందువల్లనే ఈ కథనం మనకు చాలా విలువయిన సందేశాన్ని ఇస్తుంది.

డిసెంబరు 2వ తేదీనే ‘మనం’ పత్రికలో ‘వీడని నేస్తం వీలు కుర్చి’ అంటూ ఒక పేజీ ప్రత్యేక కథనాలు ఫేస్‌బుక్‌లో ఆకర్షించాయి. ఇటీవల రంగప్రవేశం చేసిన కొత్త తెలుగు దినపత్రిక ‘మనం’. హైదరాబాదులో బాగా కనబడుతోంది అంటున్నారు. తిరుపతిలో ఎడిషన్ ఉంది కానీ నా కంటికి కనబడలేదు. అయితే రాజంపేట రోడ్డు మీద కనబడితే వారం క్రితం ఒక సంచిక కొన్నాను. ఈ రోజు బుధవారం ‘ముద్ర’ అని జనాభా సమస్య మీద ప్రత్యేక పేజీ కనబడింది. మళ్ళీ శనివారం రోజు ‘వీలు చైర్’ గురించిన ‘ముద్ర’ కథనాలు. దీనినే తెలుగు చేస్తున్నట్టు ‘వీలు కుర్చి’ అని ప్రతిభావంతంగా అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ప్రఖ్యాత పాకిస్తాన్ ఆర్టిస్ట్, రచయిత్రి మునీబా మజారీ, యువ రచయిత్ర సాయిపద్మ గార్ల విశేషాలతో ఈ పేజీ సుసంపన్నమయ్యింది. ముద్ర, మైత్రి పుటలను ‘మనం’లో ప్రత్యేకంగా, అర్థవంతంగా, కళాత్మకంగా రూపొందిస్తున్న పాత్రికేయురాలు పసుపులేటి గీత చిత్రకారిణి కూడా!

అరుణ్ శౌరికి చెందిన కథనం, వీలు కుర్చి కథనాల ప్రత్యేక పేజీకి కారణం డిసెంబరు 3. International Day of people with disability గా 1992 నుంచి డిసెంబరు 3ను జరుపుకుంటున్నాం. ఈ మాటలు ఇంగ్లీషులో రాయడం ఎందుకు? అంగవైకల్యం ఉన్నవారిని వికలాంగులు అని తెలుగులో వాడుతున్నాం. ఈ ఇంగ్లీషు, తెలుగు మాటలు నిరాశను, నిర్లిప్తతను ధ్వనించే మాటలు. మనిషి ఒక అంశంలో లోటు కలిగి ఉన్నా మరో అంశంలో మరింత ప్రతిభ, నైపుణ్యం కల్గి ఉంటాడు. అంటే మిగతా వారి కన్నా ప్రత్యేక ప్రతిభావంతుడు. ఈ మాటనే దివ్యాంగులుగా హిందీలో ఒకటి, రెండు సంవత్సరాలుగా వాడుతున్నారు. దీన్నే తెలుగులో కూడా వాడుతున్నారు. కనుక తెలుగులో దీనికి సంబంధించి వేర్వేరు స్థాయిలలో వేర్వేరు తెలుగు మాటలు కనబడుతాయి. మెయిన్ పేపరు, ట్యాబులాయిడ్ అనే కాదు; ఒకే పత్రికలో, అదే ట్యాబులాయిడ్‌లో ఒకే పుటలో రెండు, మూడు తెలుగు పదాలు వాడటం కనబడింది. అంటే స్థిరీకరణ అనేది పత్రికల మధ్యనే కాదు; ఒకే పత్రికలో విభిన్న స్థాయిలలో గానీ, ఒకే స్థాయిలో విభిన్న పాత్రికేయుల మధ్యన గానీ లేదని బోధపడింది.

అంగవైకల్యం గలవారు, వికలాంగులు, అవయవ లోపమున్నవారు వంటి నెగటివ్ పదాలు ఖచ్చితంగా పరిహరించాల్సిందే. వారికి బాధ కల్గించే రీతిలో భాష ఉండకూడదు. ఇక దివ్యాంగులు అనే మాట లోతుగా ఉన్న, ఉద్దేశించిన అర్థాన్ని ఇవ్వలేకపోతోంది. అందుకే ప్రత్యేక ప్రతిభావంతులు అనే మాట తయారయ్యింది. ఇంగ్లీషు మాటలకు చటుక్కున సంస్కృతం వైపు మొగ్గి అనువదించడం మనకు అలవాటయ్యింది. ఈ ధోరణి ఈనాడు సంస్థ కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్న విధానంలో కనబడుతోంది.ఇటీవల ఒక పాత్రికేయుడు, ఒక భాషాభిమాని అయిన యాంత్రోపాలజిస్టుతో ఈ పదం గురించి కాకతాళీయంగా చర్చించాను. ప్రత్యేక ప్రతిభావంతుడు అనే మాటకు ‘మరు దిట్ట’ అనేది బావుంటుందని అనుకున్నాం. దిట్ట అనే మాట అందరికీ తెలుసు. కనుక ‘మరు దిట్ట’ అనేది చక్కగా ఉంటుంది. అయితే భాష అనేది సంపాదక శ్రేణులలో కీలకాంశం కాదు కనుక యాజమాన్యాలు దీన్ని అసలు పట్టించుకోవు.

ఈ సందర్భంలో సాక్షి, ఆంధ్రప్రభ పత్రికలు ఆదివారం సంచికల కవర్ పేజీ కథనాలు దీనికే కేటాయించారు. ఒక పత్రిక సంకల్ప సిద్ధులు అని నామకరణం చేస్తే, మరొకటి బలాంగులు- సంకల్పంలో సకలాంగులు అనే శీర్షిక పెట్టింది. రెండూ బాగున్నా, రెండవ దానిలో సంపూర్ణ అర్థంతో పాటు సృజన కనబడుతోంది.

– డా. నాగసూరి వేణుగోపాల్

మీడియా విశ్లేషకులు