రేడియో ఇంకా అవసరమా?

22 January, 2018 - 5:14 PM

మీడియా పల్స్

కంప్యూటర్లతో నిరుద్యోగ సమస్య పెరుగుతుందా? అని మూడు దశాబ్దాల క్రిందట పదే పదే చర్చించారు. రకరకాల వాదనలు, ప్రతివాదనలు వినపడ్డాయి. నిజానికి కంప్యూటర్ల రాకతో మన యువతరానికి ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని చర్చలు అలా సాగుతుంటాయేమో!

టేప్ రికార్డర్లు, క్యాసెట్లు పెద్ద ఎత్తున వచ్చినపుడు రేడియో ఎందుకనే భావించారు చాలా మంది. అంతకు క్రితం అంటే డెబ్బయి, ఎనబయ్యి సంవత్సరాల క్రితం టెలివిజన్ వచ్చినపుడు కదిలే చిత్రాలతో రేడియో చిత్తయిపోతుందని పరిగణించారు. కేబుల్ టీవీ రాకతో సినిమా హాళ్ళు చిరునామా లేకుండాపోతాయని జ్యోతిష్యం చెప్పారు పాతికేళ్ళ క్రితం.

ఇదే కోవలో రేడియోకు కాలం చెల్లిందా? 21వ శతాబ్దంలో రేడియో అవసరమా? అనే చర్చ సాగుతూ ఉంటుంది. జనవరి 12న ‘హిందూ’ పత్రిక అరపేజీలో మూడు వ్యాసాలు ప్రచురించి మన దృష్టినాకర్షించింది. అలారం పీసుతో ఇపుడు ఎవరూ నిద్ర లేవకపోవచ్చు. ఎందుకంటే గోడ గడియారం గోడ మీద ఉంది. దీనికి చేతి గడియారం, మొబైల్ ఫోన్ ప్రత్యామ్నాయాలు కాదు. కానీ అలారం పెట్టుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి మొబైల్ ప్రత్యామ్నాయం అయ్యింది.సౌలభ్యం ప్రధానమైనదిగా ఉంటుంది- నిర్ణయం తీసుకోవడంలో. మొబైల్ ఫోన్ రాక ముందు పేజర్ అనే సదుపాయం ప్రవేశించింది. అయితే దాని కన్నా సులువైనది, మెరుగైనదీ అయిన మొబైల్ రాకతో అది పూర్వపక్షం అయ్యింది. నేడు ఎవరికీ గుర్తుండకపోవచ్చు కూడా! రేడియోలో స్వభావ సిద్ధంగా ఉన్న సదుపాయాలు ఏమిటో గమనిస్తే- అది ఉంటుందో పోతుందో కొంతవరకు చెప్పవచ్చు.

ముందుగా రేడియోకు, పత్రిలకూ తేడా చూద్దాం. చదవగలిగినవారే పత్రిక చదువగలరు. లేదా ఎవరయినా చదివితే వినగలం. రేడియోకు ఆ పరిమితి లేదు. చదవడం రాక వినగలిగినవారూ, ఆ భాష అర్థమయినవారూ రేడియో సమాచార ప్రసారాన్ని అందుకోగలరు. పత్రిక సిద్ధం కావాలి, అచ్చు కావాలి, పంపిణి కావాలి. అంటే ఇక్కడ కాలం, దూరం, వ్యయం అనే మూడు పరిమితులున్నాయి. రేడియోలో అప్పటికప్పుడు వార్తా ప్రసారం జరుగుతుంది. దేశ సరిహద్దులు కూడా రేడియోని ఆపలేవు. ఒకసారి రేడియో సెట్టు కొంటే, బ్యాటరీలుంటే చాలు. పత్రికకు యజమాని ఖర్చు పెట్టాలి. పాఠకుడు నిత్యమూ చెల్లించాలి. కనుక రేడియో అనేది కాలాన్ని, దూరాన్ని జయించడమే కాదు చౌక అయిన మాధ్యమం కూడా!

వందేళ్ళ క్రితం రేడియోలో వార్త ప్రసారం మొదలవుతున్న వేళ, సాయంకాలం ఏడు గంటల తర్వాతనే- అంటే వార్తా పత్రికలు అందరి ఇళ్ళకు చేరిన తర్వాతనే వార్తలు ఇవ్వాలని పత్రికలు రేడియోను కట్టడి చేశాయి. ఇంగ్లండులో- అయితే అది ఎంతో కాలం సాగలేదు. కనుక దేని బలం దానిని, దేని పరిమితి దానిది.

బుల్లితెర వచ్చింది. కదిలే బొమ్మలు చేరువగా వచ్చాయి. ఆ తర్వాత ఆ బొమ్మలకు రంగు కూడా వచ్చింది. సందేహం లేదు. భాష చదవడం రాకపోయినా టెలివిజన్ హాయిగా చూడవచ్చు. అయినా రేడియోతో పోల్చినపుడు టెలివిజన్‌కు కరెంటు అవసరం ఉంది. బ్యాటరీతో నడిచే టెలివిజన్‌కు ఖర్చు చాలా ఎక్కువ. రేడియో కార్యక్రమాల నిర్మాణంతో పోలిస్తే టెలివిజన్‌లో వ్యయం ఐదు నుంచి పది రెట్లుగా ఉంటుందని ఒక అంచనా. అలాగే రేడియో సెట్టు ఖరీదు కూడా టెలివిజన్ సెట్టు కన్నా బాగా తక్కువ. రేడియోను పక్కన గదిలో నుంచయినా వినవచ్చు. కానీ టెలివిజన్‌కు ఆ సదుపాయం లేదు.

వీటన్నిటికి మించి టెలివిజన్ కన్నా రేడియోలో సౌలభ్యం ఏమిటో తెలుసా? శ్రమపడి కళ్ళతో చూడాలి. ఒకే భంగిమలో చూడాలి. మరే పని చేయకుండా చూడాలి. కానీ రేడియో విషయం అది కాదు. ప్రకృతి సహజంగానే మన చెవులు తెరచుకుని ఉంటాయి. ఏ భంగిమలో అయినా ఉండి వినవచ్చు. అలవాటు పడితే రేడియో వింటూ చదవడం, చేనేత, పరిశోధన వంటి చాలా పనులు చేసేవారున్నారు. టెలివిజన్ గురించి అంటారు- సందేహం లేదు మంచి రూపాన్ని అందిస్తుంది, అయితే రేడియో వేలాది రూపాలను ప్రేరేపించగల సృజనాత్మక శక్తి గలది- అని, రేడియోలో మానవగళం ఉంటుంది కనుక పుస్తకం కన్నా మెరుగయిన భావనాత్మక మాధ్యమం.

రేడియో క్రమంగా పరిమాణం తగ్గింది. ఉపగ్రహాలతో అనుసంధానమైన మెరుగయిన ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. రికార్డెడ్ కార్యక్రమాలే కాక ‘లైవ్’ కార్యక్రమాలు పెరిగాయి. టెలిఫోన్ కలవడంతో రేడియో స్టుడియో గోడలు చెల్లాచెదురైపోయాయి. ఎవరైనా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ప్రయాణంలో టెలిఫోన్ చూడటం, పత్రికలు చదవడం కష్టం కావచ్చు కానీ రేడియో వినడం ఏమాత్రం కష్టం కాదు. భూకంపాలు, వరదలు వచ్చినపుడు రేడియోనే మెరుగయిన సాధనం. హుద్ హుద్ విశాఖను తాకినపుడు ఒక్క ఆకాశవాణియే అందుబాటులో ఉంది. వరదలు మద్రాసును ముంచెత్తినపుడు ‘హిందూ’ పత్రిక ప్రచురణ ఆగింది కానీ రేడియో ప్రసారాలు ఆగలేదు. ఎఫ్ఎం ప్రసారాలు, మొబైల్ వ్యాప్తి రెండు రేడియో ప్రసారాలకు రెక్కలు తొడిగాయి.

ఇక మన దేశం వంటి సువిశాల దేశానికి రేడియో అవసరం చాలా ఉంది. మారుమూల పల్లెలు, గూడేలూ మాత్రమే కాక పలు భాషలు, లిపి లేని భాషలు, యాసలున్న చోట రేడియో చాలా దోహదపడుతుంది. టెలిఫోన్‌కు దృశ్య సంబంధమైన అవాంతరాలు శ్రద్ధను దెబ్బతీస్తాయి. కానీ రేడియో నేరుగా మెదడునూ, మనసునూ చేరుతుంది. వైయక్తిక, సంస్థాగత లోపాల వల్ల రేడియో కార్యక్రమాలు, సంస్థలు దెబ్బతినవచ్చు. కానీ రేడియో మాధ్యమం అజేయమని వందేళ్ళ మాధ్యమాల చరిత్ర చెబుతోంది. అయితే ఎంతమంది వింటున్నారనే విషయం మాత్రం ఎంత భూభాగంలో ఏ మేరకు ఎండ పడుతోందని లెక్కించడం వంటిది. ఈ లెక్కలు తేల్చలేకపోవడం రేడియోకు పెద్ద అవాంతరం! రేడియో ఉంటుంది… ఉంటుంది!

కొసమెరుపు: గత ఆదివారం (21.1.18) రోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలలో ప్రధాన వార్తలో సామ్యం లేదు కానీ, మూడు పత్రికలూ సినీనటి అనుష్కతో పరిచయాన్ని సుమారు ఒక పేజీ చొప్పున ప్రచురించాయి!

డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు