కీలక వార్తలకు వ్యాఖ్యగా పద్యం

27 November, 2017 - 6:04 PM

♦ మీడియా పల్స్

ప్రసిద్ధ సంపాదకులు, పాత్రికేయులు ఎం.వి. కామత్ గారి మీడియా విశ్లేషణ శీర్షిక ‘మీడియా వాచ్’ను బొంబాయి నుంచి వెలువడే ‘కరంట్’ పత్రికలో మూడో పుటలో క్రమం తప్పకుండా చదివే రోజులు అవి. మూడు దశాబ్దాలకు ముందు గోవాలో ఉద్యోగం చేసే కాలమది. పాతిక ఆంగ్ల పత్రికలు ప్రతిరోజు పరిశీలిస్తానని ఒకసారి పేర్కొన్నారు. అదెలా సాధ్యమనే ప్రశ్న కల్గిందపుడు. ఎన్ని పత్రికలు ఆంగ్లంలో చదివినా మాతృభాష పత్రికలు కనీసం రెండు చదవాలి. ఎందుకంటే ఇంగ్లీషులో అర్థం కానివి బోధపడేది వీటి ద్వారానే అని కూడా ఆయన వివరించారు కూడా! గోవా నుంచి వెలువడే ‘గోమంతక్ టైమ్స్’ పత్రిక గురించి చేసిన పరిశీలన చూస్తే, పత్రికలను జాగ్రత్తగా పరిశీలించి రాసిన మాటలుగా బోధపడ్డాయి. బహుశా నా మీడియా పరిశీలన హాబీకి ఎం.వి.కామత్ గారి కృషి ఒక కారణం కావచ్చు.ఎక్కువ పత్రికలు చూడాలంటే ధనం, సమయం అందుబాటులో ఉండదు. కనుక కొన్ని పత్రికలను కొంత కాలం పరిశీలించడం ఒక మార్గం. అందుబాటులో ఉండే పత్రికలలో ఏవి ఎలా ఉన్నాయో దూరం నుంచి చూసి గమనించవచ్చు. ఆంధ్రప్రభ దినపత్రిక కాస్త మెరుగు పడిందని ఒకటిన్నర నెల క్రితం అనిపించింది. కనుక ఈ నెల నుంచి ఆంధ్రభూమి బదులు ప్రభ పరిశీలించాను. నిస్సందేహంగా తొలిపేజీ, సంపాదకీయ పుట, ఫీచర్స్ పేజీ (13) మెరుగుపడ్డాయి. ఇతర రాష్ట్రాల సమాచారంతో సాగే విశ్లేషణలు వారంలో ఒకటి రెండుసార్లు సంపాదకీయ పేజీ వ్యాసాలుగా రావడం ఎంతో అవసరం. ఒక రకంగా మూడు పెద్ద పత్రికలు చేయలేనిది ఇక్కడ జరిగిందని పరిగణించాలి. అంతకు మించి 2017 ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకీయ పేజీని – ఆ విషయం గుర్తు చేసేలా అలంకరించడం ప్రారంభించింది. ప్రతి బుధవారం తెలుగుకు సంబంధించి ప్రత్యేక వ్యాసాలు ఇవ్వాలనే ప్రణాళిక ఉన్నట్టుంది. ‘తల్లి భాషకే తొలి తాంబులం’ అనే కర్లపాలెం హనుమంతరావు గారి వ్యాసాన్ని చాలా ప్రధానంగా నవంబర్ 15న ప్రచురించారు. నవంబర్ 22న ‘భాషంటే ఇదని చెప్పిన భాష’ అంటూ రెండు వ్యాసాలు సంపాదకీయ పుటలో వెలువరించారు. అలంకరణే కాదు అంశాల ఎంపిక ద్వారా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనబడుతుంది. ప్రతిరోజు ఒక సారస్వతమూర్తి కృషిని క్లుప్తంగా పరిచయం చేస్తూ వారి ఛాయాచిత్రం, మహాసభల చిహ్నంతో ఇవ్వడం అభినందనీయం.
అలాగే కుటుంబ కదంబం ‘లైఫ్’ పేజి గానీ, ఆదివారం సంచిక గానీ చాలా మెరుగుపడ్డాయి. ఆ మేరకు ఆంధ్రప్రభ యాజమాన్యాన్నీ, సంపాదక వర్గపు సామర్థ్యాన్నీ చొరవనూ మనం అభినందించాలి.
ఇదిలా ఉండగా ఇటీవల ప్రజాశక్తి పత్రికను నెట్‌లో చూస్తుండగా గురువారం ‘రంగస్థలం’ పేరున ఓ ఫీచర్స్ పేజీ కనబడింది. గమనిస్తే ఇంకో మార్పు కనబడింది. సవ్వడి- సాహిత్యం, కళలు, మీడియా అంశాల గురించి ప్రతి ఆదివారం వెలువడేది ఎంతోకాలంగా. దీనిని ఇప్పుడు ‘అక్షరం (సోమవారం), రంగస్థలం( గురువారం )గా విభజించి రెండు పేజీలు చేశారు. కళలకు ప్రత్యేకంగా ఒక పేజీ ఇవ్వడం బహుశ ఏ తెలుగు దినపత్రికలో లేదేమో! సాహిత్య పేజీని సోమవారం ఇవ్వడం- దానిని మాత్రమే చూసే వారికి అనుకూలం. ఒక రకంగా సోమవారం విడి ప్రతుల సర్క్యులేషన్ కొంత పెరిగే వీలు ఇక్కడ ఉంది.ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. మీరు ఏ పత్రిక చదివినా, అప్పుడప్పుడు ఇతర పత్రికలు కూడా చూడాలి. చానళ్లు కూడా అంతే. ఎందుకంటే కిటికీలు తెరచిపెట్టుకోవడం మన మానసిక ఆరోగ్యం కాపాడుకోవడంలో ఓ భాగం కనుక. నవంబరు మూడవ తేదీ నుంచి ఆంధ్రభూమి పత్రికలో ఒక చమత్కారం కనబడింది. ‘పంచ్ పాళీ’ పేరున! తొలి పేజీలో ఒకటో, రెండో కీలక వార్తలకు సంక్షిప్త వ్యాఖ్యలాగా ఒక పద్యం కనబడుతోంది.నవంబరు 21న తెలుగు మహాసభల నిర్వహణ గురించి జరిగిన సమావేశంపై ‘అమ్మభాష మురిసేలా…’ అని ఒక యాంకర్ ఐటమ్ ప్రచురించారు. అందులో ఒక బాక్స్ ఐటమ్‌గా పంచపాళీ పద్యం ఇలా సాగుతోంది.

తెలుగు భాష మనది తెలుగు జాతి మనది
తెలుగువెలుగులెపుడు తేజరిల్ల
రాష్ట్రమేదియైన రాణించగలములే
తెలివిగలదు మనకు తెగువగలదు

సుమారు ఐదారు రోజులు పరిశీలించాను. దాదాపు ప్రతిరోజు పద్యం తప్పకుండా కనబడింది. ఒక్కరోజు రెండు పద్యాలు కనబడ్డాయి. తొలిపేజీ అంశాలు నిర్ణయమయ్యాక, అలంకరణ సమయంలో పద్యం రాయాల్సి ఉంటుంది. కనుక అక్కడి సిబ్బంది మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తతో పాటు ‘టైమ్స్ వ్యూ’ అని క్లుప్తంగా వ్యాఖ్య ప్రచురించే ప్రయోగం చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్నదో లేదో గమనించలేదు. ఇటువంటి ప్రయోగాన్నే ఆంధ్రభూమి పద్యంగా వ్యాఖ్యానిస్తోంది. ఈ పోకడను అభినందించాలి. ఇటువంటి మార్పు వచ్చింది అంటే సారథి ఎవరు అనే సందేహం కల్గుతుంది. జులైలో ఎం.వి.ఆర్. శాస్త్రి గారు ‘ఆంధ్రభూమి’ నుంచి వైదొలిగారు. యజమాని పేరు సంపాదకులుగా కనబడుతోంది.నవంబర్ 25న ఆంధ్రభూమి దినపత్రిక తొలిపేజీ పైభాగాన ఒక కార్టూన్ ప్రధానంగా కనబడింది. ఇటీవలి కాలంలో పెద్ద కార్టూన్లు మాయమైపోయాయి తెలుగు పత్రికలలో. ప్యాకెట్ కార్టూన్లు లోపలి పుటల్లోకి వెళ్లిపోయాయి. ఈ మార్పులకు కారణం నాలుగు వారాల క్రితం ఎం. సదాశివశర్మ ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులుగా చేరడమే! వారే తొలి పేజీ ‘పంచ్ పాళీ’ పద్యాలు రాస్తున్నారు.

 

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు