ప్రక్షాళన దిశగా…

04 May, 2018 - 4:14 PM

మీడియా పల్స్

శ్రీదేవి కనుమూసిన వార్తకు సంబంధించి మన మీడియా ఎలా సాగిందో అందరికీ గుర్తుంది!

ఈ వ్యవహారం మన దృష్టిపథం నుంచి పూర్తిగా తప్పుకోక ముందే శ్రీరెడ్డి దృష్టాంతం ఎలా సాగి, ఎక్కడి దాకా వెళ్లిందో- మొత్తంగా చూస్తే మీడియా ఏ రకమైన పాత్ర పోషించిందో మళ్లీ వివరించనక్కరలేదు.

టీవీ చానళ్ళ శైలి ఇలా సాగుతుండగా- వాట్సప్ వంటి మీడియాలో ప్రచురింపబడని పత్రిక ఒకటి పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రకటనలు పొందుతోందనీ, అదే పత్రిక పాత్రికేయుల అక్రిడేషన్ కార్డుల విషయంలో జిల్లాల వారీగా వసూళ్ళు మొదలుపెట్టి- యావత్తు పత్రికా రంగానికే తలవంపులు తెచ్చారని తెలుస్తోంది. ఈ పత్రిక ఘనకార్యాలు సోషల్ మీడియా లేకపోతే కేవలం జర్నలిస్టుల మధ్య వదంతులుగా మిగిలిపోయి ఉండేవి. ఏ పత్రికా, ఏ టీవీ చానల్ ఇలాంటి వార్తలు ఇవ్వదు. పెట్టుబడి లేకుండా ప్రజలు పంచుకునే సమాచార సాధనం సోషల్ మీడియా ఉండటంతో ఇలాంటి గొప్ప పనులు బయటపడుతున్నాయి!

అసలు మీడియా ఏమిటి? ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల సభ; ఆ సభ చేసిన నిర్ణయాలను అమలుపరిచే యంత్రాంగం; ఈ రెండింటికీ, ప్రజలకు దిశా నిర్దేశం చేసే న్యాయ వ్యవస్థతో పాటు సమాన గౌరవం మీడియాకు ఉంది. ఈ మూడు వ్యవస్థలకు ప్రజల పక్షం నుంచి వారి వైఖరిని వివరించే బాధ్యత మీడియాది- సమాచారం అందించడంతో పాటు. కేవలం ఈ ఉన్నత బాధ్యత కారణంగానే మీడియాకు అంత గౌరవం ఉంది. అయితే నిజానికి జరుగుతున్నది వేరుగా ఉందా?

ఈ శనివారం (ఏప్రిల్ 28, 2018) రామచంద్ర గుహ గారి విశ్లేషణ ‘ఎన్నికలు, జీవన కర్ణాటకం’ ఆంధ్రజ్యోతి దినపత్రికలో అచ్చయింది. ఈ విషయాలు పరిశీలించాలి.

”.. భారతదేశం ఎన్నికలు మాత్రమే జరిగే ప్రజాస్వామ్య దేశంగా పరిణమించే ప్రమాదంలో ఉంది… ఈ శోచనీయ వ్యవహారంలో మీడియాది ప్రధాన పాత్ర. వార్తా పత్రికలు, టీవీ చానల్స్, ఇప్పుడు వెబ్‌సైట్లు ఎన్నికల పట్ల మితిమీరిన శ్రద్ధ చూపుతున్నాయి.

… ఒక నిర్దిష్ట పార్టీ విజయం సాధించిన వెన్వెంటనే మీడియా తన దృష్టిని పాలనా ప్రక్రియ నుంచి వేరే తావులకు మళ్లిస్తోంది. ఒక ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదేళ్ళు ప్రజల శ్రేయస్సుకు ఏమి చేస్తుందీ లేదా ఏమి చేయడం లేదు అన్న విషయమై మీడియా పెద్దగా శ్రద్ధ చూపడమే లేదు…”

”… ఎక్కడైనా భారీ స్థాయిలో మతతత్వ హింసాకాండ చోటుచేసుకున్నా, లేదా ప్రాక‌ృతిక విపత్తు సంభవించినపుడు మాత్రమే కర్ణాటకపై జాతీయ మీడియా దృష్టి పడుతోంది. లేని పక్షంలో తదుపరి ఎన్నికలు వచ్చేంత వరకు కర్ణాటక మరుగున పడిపోతుంది…”రామచంద్ర గుహ పేర్కొన్న విషయాలను ఎవరూ విభేదించరు. అందరి అభిప్రాయం ఇదే. హైదరాబాదులోని క్యాస్టింగ్ కౌచ్ వార్త రాగానే రెండు డజన్లకు మించిన తెలుగు వార్తా చానళ్ళే కాదు, జాతీయ న్యూస్ చానళ్ళు కూడా ఈ విషయమై చర్చలు పెట్టాయి. కానీ కరువు గురించి, ఆకలి గురించి, పంట నష్టం గురించి, మంచి ఫలితాలు గురించి, కళల గురించి- ఇటువంటి విషయాలు ప్రాంతీయ మీడియాకు అవసరం లేదు, జాతీయ మీడియాకు అవసరం లేదు.

ఈ సందర్భంలో ఇంకో విషయం గురించి కూడా చర్చించాలి. ఇలాంటి విషయాలు ఏకరువు పెట్టి, విమర్శించి- పొగడ్తలు పొంది, మిన్నకుండటం మామూలుగా జరుగుతుంది. నిజానికి మీడియా ఇలా ఉంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని దిశా నిర్దేశనం సమాజం చేయాలి. సమాజం అంటే రాజకీయ పార్టీలు, వాణిజ్య సంస్థలు కాదు. ప్రజల పక్షం ఆలోచించే మేధావులు, రచయితలు, కళాకారులు సమాజానికి గొంతు కట్టి మీడియాకు దారి చూపాలి. కానీ వీరంతా మీడియా వెంట పడి తమ బాధ్యతను మరచిపోతున్నారు.

సమాజానికి ఏమి కావాలి? రాజకీయాలు, ప్రభుత్వాలు, మీడియా అవసరం లేకుండా మనం సవ్యంగా జీవించాలంటే ఏమి కావాలి అనే చర్చ ఈ మేధావులు, కళాకారులు సూచించాలి. సూచనల నుంచి అధ్యయనం సాగి ఒక ప్రణాళిక రూపొందాలి. ఈ ప్రణాళికను సాధించడం ప్రభుత్వాలు, మీడియా, పాలక యంత్రాంగంతో పాటు ప్రజలు ఏమి చేయాలని నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రయత్నం కర్ణాటకలో Speaking for Karnataka పేరున నలుగురు మేథావుల ద్వారా జరుగుతోందని రామచంద్ర గుహ విశ్లేషణ ద్వారా బోధపడింది. ఇలాంటి ప్రయత్నాలు అన్ని చోట్లా జరగాలి. నిరంతరాయంగా జరగాలి. తెలుగు ప్రాంతాల గురించి ఇలాంటి ప్రయత్నం ఎలా జరుగుతుంది? దీనికి ఎవరు నడుం కట్టాలి? రామచంద్ర గుహ రాసిన విషయాలు మన భాషలో వస్తున్నాయి. ఇదే విధంగా మన రాష్ట్రం విషయాలు ఏ మేథావి ఇతర ప్రాంతాల వారికి, ఇతర భాషల వారికి అందించే స్థాయిలో ఉన్నారు? తెలుగు సమాజాన్ని చైతన్యవంతం చేసే మేథో వర్గాలు మరింత అర్థవంతంగా, ప్రయోజనకరంగా, అంతర్గత ఎజెండాలు లేకుండా ముందుకు వస్తే తప్పా సాధ్యం కాదు. అలా జరిగితే మీడియాతో పాటు ప్రభుత్వాలు ప్రక్షాళన అవుతాయి. సమాజానికి మేలు జరుగుతుంది?

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు