ఈ ప్రశ్నలకు బదులు?

16 April, 2018 - 5:32 PM

మీడియా పల్స్

తెలుగులో గంతకు తగిన బొంత అనే మాట ఉంది. చాలా అర్థవంతమైంది. మూడు దశాబ్దాల క్రితం ఒక ఎన్నిక జరిగింది. మేధావులు పలువురు ఆశ్చర్యపోయారు- ఆ ఎన్నిక ఫలితం పట్ల. దీని గురించి ఒక పత్రిక తన వ్యాఖ్యను ఇలా ముగించింది. సరిగ్గా ఇవే మాటలు కాదు, కానీ భావం మాత్రం ఇదే. సొగసరి అనో, పొడుగరి అనో, గడుసరి అనో- ఎన్నుకున్నారు. దేశ ప్రజలు తమ స్థాయికి తగిన వ్యక్తిని ప్రతినిధిగా పొందారని చెప్పుకోవాలి!

శ్రీరెడ్డి ఉదంతం ఏప్రిల్ నెల తొలి రెండు వారాలు మీడియాను వ్యాపించింది. అటువంటి సంచలన ఘటన మరోటి జరిగేదాకా అది మరింత సాగవచ్చు కూడా! అయితే మొత్తం వ్యవహారం గమనిస్తే ఏమనిపిస్తుంది? విలువలు మారాయి; సామాజిక ధోరణులు మారుతున్నాయి. వ్యూహాలు మారాయి; వాదాలు మారాయి… ఈ సమాజం ఇలా ఉంది కనుక- ఇవి ఇలాగే నడుస్తాయా అని కూడా ప్రశ్నించుకోవాలి. ఇందులో ఎవరూ అమాయకులుగా కనబడటం లేదు. కేవలం పెద్ద చేప, చిన్న చేప వ్యవహారాలే! అయితే ఈ సంఘటన, సంఘటన రచింపబడిన తీరు అనేవి సినిమా రంగం, జర్నలిజంపై స్పష్టమైన వ్యాఖ్యానాలే!మల్లిడి శ్రీరెడ్డి 1992లో జన్మించిన పాతికేళ్ళ యువతి. వయసు తేడా కొంచెం ఉంటే ఉండవచ్చు. ఒక తెలుగు టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేశారు. కొన్ని సినిమాలలో నటించారు. వీటితో పాటు ఆవిడకు జర్నలిజం ఎలా సాగుతోంది, సినిమా రంగం ఎలా నడుస్తోంది అనే అవగాహన స్పష్టంగా ఉందని ఈ సంఘటనల క్రమం గమనిస్తే బోధపడుతుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఎంతవరకు వినియోగించుకోవాలి అనే విషయాల గురించి కూడా మంచి స్పష్టత ఉన్నట్టుంది. ఈ గుర్తింపుతో సినిమా అవకాశాలు పెరుగుతాయనే ఆశావహ దృష్టి కూడా ఆమెలో ఉంది.

సినిమా రంగం వ్యక్తులు శ్రమించి రూపొందించే కళాత్మక సినిమాలు మాత్రమే జనసామాన్యాన్ని అలరిస్తాయి. సినిమా తెర వెనుక ఏమి జరుగుతుందో తొలి నుంచీ బయటికి రావడం లేదు. కార్పొరేట్ మీడియా కారణంగా ఫిల్మ్ జర్నలిజం అనేది ఫిల్మ్ ఇన్ఫర్మేషన్‌గా, ఫిల్మ్ కాంపెయిన్‌గా మారిపోయింది. సినిమా సమీక్షలకు కాలం చెల్లింది. తెర మీద కనబడే సినిమా గురించి సమీక్ష కూడా మృగ్యమైనపుడు విమర్శ ఎక్కడి నుంచి వస్తుంది? కనుక సినిమా రంగం గురించి ఏ రకమైన వదంతులు ఏ స్థాయిలో వినబడినా, ఎక్కడ కనబడినా జనం ఖాతరు చేసే పరిస్థితి ఉంది.

అయితే ఆడియో ఫంక్షన్లు, విజయోత్సవాలు బుల్లితెర మీద కనబడతాయి. వీటి ఔచిత్యం లేని పొగడ్తలూ, దాస్య భక్తి ధోరణులు పుష్కలంగా కనబడతాయి. మరి తెర వెనుక తీరు ఏమిటో ఎవరికి వారు ఊహించుకుంటారు. తెలుగువారికి అవకాశాలు ఇవ్వడం లేదనే కారణంతో పోరాటానికి దిగింది శ్రీరెడ్డి. మొబైల్ సాధనంలో ఉండే సాంకేతిక సదుపాయాల ఆధారంగా తన మందుగుండు సామాగ్రిని సమాయత్తం చేసుకుంది. తొలుత అస్పష్టంగా కొందరి వ్యక్తుల గురించి కొంత సమాచారం తన ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేస్తూ వచ్చారు. శేఖర్ కమ్ముల ఈ విషయంలో తీవ్రంగానే స్పందించారు. అయితే ఏప్రిల్ ఏడున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలియజేయడం, ఒకే ఒక చానల్ దాన్ని లైవ్‌గా ఇవ్వడం కీలక సంఘటన. టైమ్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఎడిషన్‌లో ప్రముఖంగా ప్రచురించడమే కాదు, న్యూయార్క్ టైమ్స్ సైతం మరుసటి రోజు వార్తాంశంగా ప్రాధాన్యత ఇచ్చింది.

దీనికి స్పందించిన సినిమా వ్యక్తుల తీరు వారి స్థాయికి తగినట్టుగా ఉంది. అంతవరకు విమర్శకులు కూడా ఆమె నగ్న పోరాటాన్ని జీర్నించుకోలేకపోయారు. అది వారికి ఒక షాక్. జాతీయ మానవహక్కుల కమీషన్ వార్తలాధారంగా తనకు తానే స్పందించి తెలంగాణ ప్రభుత్వానికీ; సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకూ నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందించే హృదయాలూ, మద్దతు ఇచ్చే మెదళ్ళూ పెరిగాయి.

సినిమా రంగంలో పనిచేసే మహిళలకు భద్రతను కల్పించే రీతిలో ఓ వ్యవస్థ ఏర్పడవచ్చు- ఈ ఉదంతం కారణంగా. అయితే మొత్తం సంఘటన రేకెత్తించే ప్రశ్నలు చాలా ఉన్నాయి.

– సినిమా రంగం- భాష ఏదైనా, నగరం ఏదైనా మహిళల పట్ల లైంగిక దోపిడి ఏ స్థాయిలో ఉంది? ఇది ఎలా బయటి ప్రపంచానికి తెలుస్తుంది?
– ఒకే ఒక్క చానల్‌కు ప్రత్యక్ష ప్రసారం చేసే మహా అవకాశం ఎలా లభిస్తుంది. బుల్లితెర మరగు ఏర్పాటు ఏదో కొంత ఉండి ఉండాలి.
– అర్ధనగ్న ప్రదర్శన కొంతసేపు అయినా, టీఆర్‌పీ రేటింగులు పెంచే రీతిలో శ్రీరెడ్డి గారు జాగ్రత్త పడ్డారు. ఈ విజువల్స్ ఎడాపెడా వాడి మిగతా చానళ్ళు వ్యూయర్‌షిప్‌కై వెంపర్లాడాయి. ఇక్కడ చానళ్ళకు వీక్షకుల కళ్ళ మీద మోజు ఉంది కానీ, స్త్రీల మీద జరిగే దోపిడి నిర్మూలన మీద మక్కువ ఉందా అనే ప్రశ్న రాక మానదు.
– సంఘటనలు నడుస్తున్న కాలంలో రేటింగుల లబ్ధి పొందిన చానళ్ళ నిర్వాహక యాంకర్ల మీద సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడాలూ; దీనికి శ్రీరెడ్డి గారు ఆచి తూచి ఆయా చానళ్ళ మేల్ యాంకర్లను సమర్థించడాలు కూడా గమనార్హం.
– తేళ్ళ అరుణ ఇలా వ్యాఖ్యానిస్తున్నారు- ఏవిటో కొంత మంది శ్రీరెడ్డి లాంటి స్టుపిడ్ విమెన్ వలన కొన్ని నెరవేరతాయి కాబోలు… ఇది ఖచ్చితంగా విచ్చలవిడితనమే!
కోనేరు రూపవాణి గారు ఈ దృష్టాంతానికి సంబంధించి, శ్రీరెడ్డి గారి వీడియోలోని విశృంఖల వాచాలత్వం గురించి పేర్కొంటూ- మొత్తం వ్యవహారం దీర్ఘకాలిక సింహావలోకనం చేస్తూ, జటిలమైన ప్రశ్నలు వేస్తూ కఠోరమైన వాస్తవాలు మన ముందుంచారు.‘… శ్రీరెడ్డి అమాయకురాలు నిజమే… మోసం చేశారు… పచ్చిగా చెప్పాలంటే వాడుకుని వదిలేశారు… (ఆ) వీడియో చూశాక ఆమె ఎంత అమాయకురాలో.. సినిమా ఇండస్ట్రి ఎంత పచ్చిగా, విచ్చలవిడిగా.. ఏమీ తెలియని అమాయకురాలిని ఎంత వాడుకున్నారో… ఆడుకున్నారో కళ్లకు కట్టినట్టుగా కనబడుతోంది. మన మహిళా సాధికారత మనం ఎలా అయినా స్వేచ్ఛగా బతికే హక్కునిచ్చింది. ఇదేనా ఆ హక్కు??
14 సంవత్సరాల నా జర్నలిజంలో మహిళల సమస్యలను ఆవిష్కరిస్తూ.. మీ అందరితో చర్చలు పెట్టి.. ఎండలో వానలో తిరిగి రిపోర్టులు రాసి మహిళల హక్కుల కోసం పోరాడిన అనుభవంలో నా మస్తిష్కంలో ఒకటే ప్రశ్న తొలుస్తోంది… మహిళా సంఘాల ఆక్కయ్యలూ ఇదేనా మనం కోరుకున్న స్వేచ్ఛ? ఇదేనా మనం కోరుకున్న… చర్చించుకున్న సాధికారత…?!

మహిళలుగా మనకి ఇలా అంటే… (ఆ) వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడినట్టుగా మాట్లాడే హక్కుంది… మనం ఇలాంటివాళ్ళని సమర్థిస్తాం… పోరాడతాం… చూసిన మగాడు మాత్రం మనల్ని ముట్టుకోకూడదు.. మడికట్టుకోవాలి.. వాళ్ళని చీల్చి చెండాడతాం.. మనకే హార్మోన్లు ఉన్నాయ్.. మగాడికి లేవు మరి… పోరాటం అంటే పారదర్శకత… అక్కడ లింగ భేదాలు… రాగద్వేషాలు… స్వార్థ ప్రయోజనాలు ఉండవు.. ఉండకూడదు.

ఇండస్ట్రీలో కామపిచాచులపైన కొరడా ఎంత అవసరమో… ఇండస్ట్రీలో అవకాశాల కోసం అడ్డదారిలో కంచె దాటాలనుకునే లేడిపిల్లలకు మార్గ నిర్దేశకాలు… చట్టాలూ అంతే అవసరం.

డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు