కన్నడ దినపత్రికలు

09 April, 2018 - 4:17 PM

మీడియా పల్స్

గత ఆదివారం అంటే ఏప్రిల్ 1వ తేది ఉదయం బెంగళూరులో ఉన్నాం. ముందు రోజే కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్నాం- బెంగళూరు తెలుగు మిత్రులు మాల్యాద్రి, వాసుదేవ్, వేంకటేశ్వర శాస్త్రి గార్ల ఆహ్వానం మీద! నిజానికి నాకు బెంగళూరు అంత కొత్త కాదు. హైస్కూలు, ఇంటర్మీడియట్ చదువు సాగిన హిందూపురం నుంచి కేవలం వంద కిలోమీటర్లు మాత్రమే! ఉద్యోగం కోసం రాసిన పరీక్షలు చాలా భాగం బెంగళూరులోనే- ఆకాశవాణి ఉద్యోగం కోసం రాసిన దానితో సహా! కొంతకాలం కన్నడ ప్రాంతం బాగేపల్లిలో ఉద్యోగం కూడా చేశాను. కనుక బెంగళూరు అంటే ఇష్టమే! ఈ నగరం కూడా మద్రాసులాగే ఎటు చూసినా తెలుగు! కన్నడ కవిత్రయంలో రన్న- పొన్నలిద్దరూ పుంగనూరుకు చెందినవారట. ఇలాంటి విషయాలు రాస్తూ పోతే- మన విశ్లేషణ ఇంకో రకంగా తయారవుతుంది.

ఎటువంటి శ్రమ లేకుండా, ఇష్టంగా చేసేది హాబీగా చెప్పుకుంటాం. వార్తా పత్రికలను పరిశీలించడం నాకు అలాంటి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఉదయం టాక్సీ మిత్రుడికి డబ్బులు ఇచ్చి లభించే కన్నడ, ఇంగ్లీషు పత్రికలు తీసుకురమ్మని పంపాను. అతను ఎంతో విజయంతో 7 కన్నడ దినపత్రికలూ, 7 ఆంగ్ల దినపత్రికలతో వచ్చారు. ఇంగ్లీషు పత్రికల కమామిషూ మరోసారి చూద్దాం. ప్రజావాణి, కన్నడప్రభ, సంయుక్త కర్ణాటక, ఉదయవాణి, విజయ కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి- ఇవి ఆ పత్రికలు. విజయవాణి ఆరు రూపాయలు కాగా మిగతావన్నీ ఐడు రూపాయలు. ఈ ఏడు పత్రికలలో ప్రజావాణి, ఉదయవాణి, విజయవాణి, విశ్వవాణి- ఈ నాలుగు పత్రికల మకుటాలలో ‘వాణి’ అనే మాట గమనార్హం. ఒకప్పుడు తెలుగు దినపత్రికలకు ఆంధ్ర అనే పదం, ఇప్పుడు తెలంగాణలో దినపత్రికలకు తెలంగాణ అనే మాట తప్పనిసరి అయినట్టు ఇక్కడ ‘వాణి’ అనే పదాన్ని పరిగణించాలి. ఇక రెండింటిలో కర్ణాటక అనే మాట కాగా మిగిలింది కన్నడ ప్రభ. ఈ ఏడు పత్రికలలో ప్రజావాణి, కన్నడప్రభ సంయుక్త కర్ణాటక చాలా కాలంగా వస్తున్న వాటిగా పరిగణించవచ్చు. విజయ కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి ఇటీవలి పత్రికలు. అందువల్లనే కావచ్చు పేజీలకు నామకరణంలో ఇంగ్లీషు మాటలు బాగా కనబడతాయి. ఈ ధోరణి మిగతా నాలుగు పత్రికల్లో కనబడదు. విజయ కర్ణాటక పత్రిక మకుటంలో వి.కె. అనే ఆంగ్ల అక్షరాలు పెద్దగా కనబడటమే కాదు, ‘ప్రైడ్ ఆఫ్ యంగ్ కర్ణాటక’ అనే పదాలు ప్రధానంగా ఉన్నాయి. బాగా నడిచే విజయ టైమ్స్ ఆంగ్ల పత్రికనూ, విజయ కర్నాటక కన్నడ పత్రికను 2007లో టైమ్స్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసి, ఆంగ్ల పత్రికను మూసివేసి కర్ణాటకలో డెక్కన్ హెరాల్డ్ పత్రిక కంటే సర్క్యులేషన్‌లో అధిగమించింది. కర్ణాటకలో టైమ్స్ సంస్థ చాలా చమత్కారాలు చేసింది. కొంతకాలం టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కన్నడ దినపత్రికను అనువాద పత్రికగా నడిపింది. తొలి పేజీలో పూర్తి పేజీ ప్రకటన, కన్నడ పత్రికల్లో గరిష్ట సంఖ్యలో (11) ఎడిషన్లు కల్గి ఉంది విజయ కర్ణాటక. రాజ్య (అంటే రాష్ట్రం) అనే పేజికి STATE అని కూడా ప్రధానంగా కనబడేట్టు పెట్టారు. ఇదే ధోరణి దేశ/ NATION, విదేశ/ WORLD, క్రీడ/ SPORTS లలో కూడా కనబడుతుంది. ఆర్థిక విషయాల పేజికి The Economic Times అని కూడా గమనించాను. మొదటి స్థానాన్ని ఇటీవలే కోల్పోయినట్టుంది- నెంబర్ వన్ కర్ణాటక నిష్పక్షపాత దినపత్రిక అని ప్రకటించుకుంటోంది.

విజయవాణి కథ వేరు. విజయ సంకేశ్వర్ అని గదగ్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు 2005లో కన్నడ, ఆంగ్ల పత్రికలు విజయ కర్ణాటక, విజయ టైమ్స్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియాకు అమ్మివేశారు. ఎంతకు అమ్మకం జరిగిందో తెలియదని అంటారు. మరో పత్రికను ఐదేళ్ళ దాకా ప్రారంభించకూడదనే నియమం కారణంగా ఆగి, 2012లో ‘విజయవాణి’ ప్రారంభించారు. ఎనిమిది లక్షల పైచిలుకు సర్క్యులేషన్‌తో ఈ విజయవాణి పత్రిక అగ్రస్థానంలో ఉంది. ఒక సంవత్సరం క్రితం ‘దిగ్విజయ 24 X7 న్యూస్’ అనే టీవీ చానల్‌ను ప్రారంభించారు. విజయ కర్ణాటకకు 11 ఎడిషన్లు ఉండగా విజయవాణికి 10 ఎడిషన్లున్నాయి.

డెబ్బయి సంవత్సరాలుగా వస్తున్న పత్రిక- ప్రజావాణి. డెక్కన్ హెరాల్డ్ ఆంగ్ల పత్రిక ఈ సంస్థదే! ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఈ కన్నడ పత్రిక నేడు మూడో స్థానంలో ఉంది. సర్క్యులేషన్ పరంగా అయితే పత్రిక గంభీరంగా సాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు కదా మిగతా పత్రికలు ఎన్నికల ప్రత్యేక పేజీలకు కదన, యుద్ధ కాండ, రణ, కురుక్షేత్ర వంటి మాటలు వాడుతుండగా ప్రజావాణి మాత్రం ‘ప్రజా మత’ అనే మాట వాడటం విశేషం.‘కన్నడ ప్రభ’ ఒకప్పుడు ఎక్స్‌ప్రెస్ గ్రూపు పత్రిక. ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన పత్రిక. అయితే నేడు ఆసియానెట్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రజావాణికి ఏడు ఎడిషన్లు ఉండగా కన్నడ ప్రభ, సంయుక్త కర్ణాటక, ఉదయవాణి పత్రికలకు ఆరు ఎడిషన్లు ఉన్నాయి. సంయుక్త కర్ణాటక ఆదివారం అనుబంధం నాలుగు పేజీలు మాత్రమే ఉన్నా- చాలా గంభీరంగా కనబడింది. ఈ సంయుక్త కర్ణాటక 1921లో లోక శిక్షణ ట్రస్టు ద్వారా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో మొదలైంది. కర్మవీర, కస్తూరి పత్రికలను కూడా ప్రచురించే ఈ సంస్థ ప్రధాన కేంద్రం హుబ్లీ.

ఉదయవాణి పత్రికను 1971లో మణిపాల్ నుంచి మోహన్‌దాస్ పాయ్, సతీష్ పాయ్ గార్లు ప్రారంభించారు. వీరికి చాలా సంస్థలున్నాయి. తరంగ వారపత్రిక, రూపతార సినీ మాసపత్రిక, తుషార మాసపత్రిక, తుంటురు పిల్లల మాసపత్రికలను కూడా నిర్వహిస్తోంది.

విశ్వవాణి పత్రిక ఒక విషయంలో విభిన్నంగా కనబడింది. ఆదివారం సంచిక, ఏప్రిల్ 1 ప్రత్యేకంగా కర్ణాటకలోని కార్టూనిస్టుల గురించి పూర్తిగా ఆరు పేజీల సమాచారం ఇవ్వడం గొప్ప సంగతి. హుబ్లీ ప్రాంతంలో 90 సంవత్సరాల క్రితం మొదలైన ఈ పత్రిక ఇటీవల పెద్ద ఎత్తున పున: ప్రారంభమైంది. సంపాదకుడు విశ్వేశ్వర భట్ పేరు మాత్రమే కాదు, ఫొటోను కూడా పత్రిక మకుటం దగ్గర ప్రచురించడం విశేషం. వీరు గతంలో విజయ కర్ణాటక, కన్నడ ప్రభ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.

-డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు