ఉత్తరప్రదేశ్ పత్రికలు

03 April, 2018 - 4:10 PM

మీడియా పల్స్

ఒక వారం పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి ప్రాంతంలో ఉన్నాను. అక్కడ వార్తా పత్రికలు పట్టుకోవడం కష్టం. అందులో ఇంగ్లీషు పత్రికలు అయితే దొరకడం ఇంకా ఇబ్బంది. వారణాసి అనగానే కాశీ విశ్వేశ్వరుడు చాలా మందికి స్ఫురిస్తాడు. అదే సమయంలో మదన మోహన మాలవ్యా కూడా గుర్తుకు వస్తారు. దానికి కారణం ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పి, అమోఘంగా దానికి క‌ృషి చేయడం. అయితే నాకు ‘ది లీడర్’ పత్రిక ద్వారా కూడా మాలవ్యా గుర్తుకు వచ్చారు. అలహాబాదులో 1909లో మాలవ్యా స్థాపించిన The Leader అప్పట్లో ఎంతో ప్రభావవంతమైంది. అంతే కాదు ఆ పత్రికకు పాతికేళ్ళు ఎడిటర్‌గా సాగిన సి.వై.చింతామణి (10 ఏప్రిల్ 1880- 1 జూలై 1941) జర్నలిజానికి చేసిన క‌ృషి విలువయినది. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన వీరు ‘ది లీడర్’ సంపాదకులుగా ఉంటూ కొంతకాలం (1927- 1934) ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ పక్షం నాయకుడుగా చరిత్ర సృష్టించారు. చింతామణి గుర్తు రాగానే స్ఫురించే మరో పాత్రికేయ దిగ్గజం ఎం. చలపతిరావు. లక్నో నుంచి నడిచిన నేషనల్ హెరాల్డ్ (National Herald)కు 1946 నుంచి ముప్పయ్యేళ్ళు ఎడిటర్‌గా చరిత్ర సృష్టించారు. వారణాసి, అలహాబాదు, లక్నో- అని ఈ రెండు గొప్ప ఆంగ్ల పత్రికల గురించీ; వాటితో ముడిపడిన తెలుగు పాత్రికేయ శిఖామణులు చింతామణి, చలపతిరావు గురించి ఆపుకోలేక ప్రస్తావించాను.

అన్నట్టు ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక ఇటీవల కటక్ (ఒరిస్సా), పాట్నా (బీహార్)లలో ప్రచురణ కేంద్రాలు ప్రారంభించింది. వారణాసిలో హిందూ పత్రిక లక్నో నుంచి వెలువడే నార్తర్న్ ఎడిషన్ అందిపుచ్చుకుని పరిశీలించాను. స్పష్టమైన తేడా ఏమిటంటే దాని ధర పది రూపాయలు. వారంలో అన్ని రోజులు అలా ఉన్నట్టు గమనించాను. ఆదివారం సంచిక విషయం తెలియదు. స్థానికంగా ఎక్కువ అమ్ముడుపోయే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ పత్రికల ఖరీదు నాలుగు రూపాయలుగా ఉంది. కాన్‌పూర్, అలహాబాదు, వారణాసి, గోరక్‌పూర్, లక్నో నగరాలు కాకుండా ఇతర ప్రాంతాలలో 2 రూపాయలు రవాణా ఖర్చులకని అధికం. రెండు పెద్ద పత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. ఈ రెండు పత్రికలలో మరో పోలిక కనబడింది. ప్రధాన సంపాదకుల పేర్లు లేకుండా స్థానిక ఎడిషన్‌లను నిర్వహించే సంపాదకుల పేర్లు ప్రచురించడం. ఈ ధోరణి ముందు ముందు ప్రబలవచ్చు. అప్పుడు చింతామణి, చలపతిరావు వంటి ఆ తరం సంపాదకుల ప్రతిభ వెలికి రాకుండాపోవచ్చు.తెలుగు ప్రాంతాల మీడియా పరిశీలించే వారికి అవసరమైన విషయాలను మాత్రమే ఇక్కడ చెప్పుకుందాం. పరిశీలించగలిగిన అవకాశమున్న విషయాలనే ఇక్కడ విశ్లేషిస్తాం. హింది పత్రికలు నాలుగు మాత్రమే చూశాను. రాదు కనుక చదివానని చెప్పడం లేదు. ‘రాష్ట్రీయ సహారా’ రెండున్నర రూపాయలుండగా ‘దైనిక్ జాగరణ్’ మూడు రూపాయలు. ‘అమర్ ఉజాలా’, ‘హిందుస్తాన్’ పత్రికల ధర మూడు లేదా నాలుగు రూపాయలని కనబడింది. హిందూస్తాన్ హింది పత్రిక హిందూస్తాన్ టైమ్స్ సంస్థది. ఈ హింది పత్రిక 1936లో రావడానికి మదన్ మోహన్ మాలవ్యా కృషి కారణం. వారు 1924- 1946 మధ్య కాలంలో హిందూస్తాన్ టైమ్స్ చైర్మన్‌గా పనిచేశారు. హిందిలో ఎక్కువ సర్క్యులేషన్ గల రెండు పత్రికలలో దైనిక్ జాగరణ్ ఒకటి. డి.ఎన్.ఎ. ఆంగ్ల పత్రిక వీరిదే. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అంటే 11 రాష్ట్రాల నుంచి ఈ పత్రిక ప్రచురింపబడుతుంది. రాష్ట్రీయ సహారా పత్రిక సహారా గ్రూపు వారిది. పెద్ద హింది పత్రికలకు తొలి పేజీ ప్రకటనలు బాగానే ఉన్నాయి. పేజీలూ, రంగులూ ఎక్కువగానే ఉన్నా నాసిరకం న్యూస్ ప్రింట్, నాజూకుగా లేకపోవడం కనిపించింది. ఇక ఇంగ్లీషు మాటలు (రోమన్ లిపిలో) ఎడాపెడా వాడుతున్నారు. CBSE గురించిన వార్తకు శీర్షికలో రోమన్ లిపిలో తొలి పుటలో వాడారు రాష్ట్రీయ సహారా పత్రికలో. జాగరణ్ Latest Jobs అనే శీర్షిక ఉంచింది. అమర్ ఉజాలా స్థానిక పేజీ కాశీ లైవ్ అనే శీర్షికలో లైవ్ అనే మాటను రోమన్ లిపిలో వాడారు. ఇంగ్లీషు మన దేశంలో అన్ని భాషలను ఒకే రకంగా కబళిస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో పున:ప్రారంభమై వినోద్ మెహతా నేతృత్వంలో సంచలనం సృష్టించిన ‘ది పయొనీర్’ ఆంగ్ల పత్రిక ప్రధాన స్థావరం లక్నో. చందన్ మిత్రా ప్రధాన సంపాదకులుగా సాగుతున్నది. ది స్టేట్స్‌మన్ పత్రిక ఢిల్లీ సంచిక వారణాసిలో లభించింది. సంచలనాలకు పోకుండా గంభీరంగా సాగే ఈ పత్రిక తనే ప్రకటించుకున్నట్టు పీపుల్స్ పార్లమెంట్. ఈ పత్రిక ప్రధాన సంపాదకులు రవీంద్ర కుమార్ తెలుగు వ్యక్తి. వారణాసిలో పరిశీలించిన పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. రామ్‌నాథ్ గోయంకా కుమారుడు భగవాన్ దాస్ గోయంకాకు సంతానం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణాది ఎడిషన్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రచురింపబడుతున్నాయి. సర్క్యులేషన్ తక్కువ అయినా నాణ్యతతో వస్తున్న పత్రికగా శేఖర్‌గుప్తా ఎడిటర్‌గా ఉన్న కాలంలో పేరుగాంచింది ఈ పత్రిక. ఉత్తర భారతదేశంలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ గానే పిలువబడుతోంది. ఈ సంచికల సంపాదకీయం పైన Founded by Ramnath Goenka అని కనబడుతోంది. ఇది కొంచెం ఆశ్చర్యం కల్గించింది. Behind the Scenes in the Indian Express అనే ఉప శీర్షికతో T.J.S. George ‘The Goenka Letters’ అనే పుస్తకం 2006లో వెలువరించారు.ముగ్గురు మహనీయుల ఒకే దృష్టి- పేరున రాసిన ఉపోద్ఘాతం (పేజీ 7)లో తొలి పేజీ రెండవ పేరా ఇలా సాగుతుంది. ఇది చదవండి…
“… Dr. P. Varadarajula Naidu, S. Sadanand and Ramnath Goenka were not a team. They were successive owners who came one after the another during the first four years as the paper`s life…”

కనుక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ను 1932లో స్థాపించింది డా.పి. వరదరాజుల నాయుడు (1887- 1957). రెండు నెలలు తిరగకుండానే ఈ పత్రిక ఎస్. సదానందం (1900- 1953) అనే గొప్ప సంపాదకుడి చేతికి వెళ్ళింది. నాలుగేళ్ళ తర్వాత ఈ పత్రిక సదానందంగారి నుంచి రామ్‌నాథ్ గోయంకా (1904- 1991) వశమైంది.

జర్నలిజమంటే హడావుడిగా తయారయ్యే చరిత్ర కదా! కనుక దోషాలు ఉండవచ్చేమో!

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు