స్వతంత్ర భారత మీడియా- పరిణామాలు

26 March, 2018 - 3:39 PM

మీడియా పల్స్

ఏడు దశాబ్దాలలో సంభవించిన పరిణామాలు అని విడిగా చూడాల్సిన అవసరం ఉందా?

ఈ సంఖ్యకు ఉండే ప్రాధాన్యత ఏమిటి? అంతకు క్రితం పరిస్థితి ఏమిటి? వంటి ప్రశ్నలు తప్పక ఎదురవుతాయి! ఇక్కడ సంఖ్య కాదు ప్రధానం, ఒక మహా ప్రయాణంలో సమాజం తనవైపు తాను ఒకసారి పరికించుకోవడానికి ఇది మంచి సందర్భం! ఈ అంతరావలోకనం మనం ఎటు నుంచి ఎటు వైపునకు పయనిస్తున్నామని తెలుసుకోవడానికీ, అలాగే మన ప్రణాళికలు పునర్ రూపొందించుకోవడానికీ దోహదపడుతుంది. ఇదే రకంగా స్వాతంత్ర్యం వచ్చిన ఈ ఏడు దశాబ్దాలలో మీడియా – రేడియో, టీవీ, పత్రికలు వగైరా ఎటువంటి మార్పులకు లోనైందని విహంగ వీక్షణం చేద్దాం. ఇందులో సంవత్సరాలు, అంకెలు, శాతాలు వీటి కన్నా గుణాత్మకంగా పరిణామాలు ఏమిటనే భావనాత్మక విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయినా – ప్రపంచ వ్యాప్తంగా జర్నలిజానికి ఇది వంద సంవత్సరాల వంటి సందర్భం. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఇతర ప్రపంచదేశాల పట్ల విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇదే జర్నలిజం అనే కొత్త విభాగం రావడానికీ, అది పరిపుష్ఠం కావడానికి ఎంతో దోహదపడిందని అంటారు. అలాగే రెండవ ప్రపంచయుద్ధంలో సాంకేతిక విజ్ఞానం కీలక పాత్ర పోషించడంలో వినాశనం విపరీత స్థాయికి చేరింది. ఫలితంగా సైన్స్ పట్ల ఆసక్తి పెరిగి, సైన్స్ జర్నలిజం వృద్ధి చెందడానికి తోడ్పడింది. కనుక మీడియా గురించి బేరీజు వేసుకోవడం చాలా అవసరం. అచ్చు యంత్రం, టెలిగ్రాఫ్, టెలిఫోన్, టెలి ప్రింటర్, రేడియో, టీవీ వంటి ఆవిష్కరణలు 20వ శతాబ్దం రాకతో గొప్పగా విచ్చుకున్నాయి. ఇది సైన్స్ ప్రగతి, సాంకేతిక విజ్ఞాన ప్రగతి! సామాజిక అవసరాలకు తగినట్టు సాంకేతిక విజ్ఞానం అందించిన పనిముట్లను వినియోగించడం ఒక సౌలభ్యం, ఒక చరిత్ర. అగ్రరాజ్యాల కాంక్షల వెనక ప్రణాళికలు ఏమిటో, అంతర్గత ఉద్దేశాలు ఏమిటో బోధపడడం పెరిగింది. అప్పటికే సర్వమానవ సౌభ్రాతృత్వ భావనలు వృద్ధి చెందాయి కనుక అవి విచ్చుకొని మరింత మందిని చేరడానికి మీడియా ఎంతో ఉపయోగపడింది. మానవ మస్తిష్కంలో ప్రపంచపు ఎల్లలు విస్తృతమయ్యాయి.

ఇతర దేశాల సంగతులే కాదు, ఆయా దేశాలలోని అంతర్గత విషయాలు తెలుసుకోవడానికి కూడా మీడియా పోషించిన పాత్ర విశేషమైంది. అప్పటికి పత్రికలు, రేడియో మాత్రమే సాధనాలు – అక్షరాస్యత తక్కువ ఉన్నా, అచ్చు యంత్రాలు అతి సాధారణంగా ఉన్నా చేయాల్సిన పనిని సమగ్రంగా, చిత్తశుద్ధితో చేసే ధోరణి స్పష్టంగా కనబడుతుంది. మన దేశంలో ఉన్న విభిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు ఏకమైంది కేవలం ఈ సమాచార ప్రసారం కారణంగానే! అప్పటికి పుస్తకాలు, పత్రికలు చాలా కీలకంగా మారాయి. అందుకే ఆ దశలో పుస్తక ప్రచురణ సంస్థలూ, పత్రికా ప్రచురణ సంస్థలూ వేర్వేరుగా ఉండేవి కావు. మిగతా దేశాల మాట ఏమో గానీ, భారతీయ పత్రికల ప్రారంభ చరిత్ర మహోజ్వలం. వందేళ్ల క్రితం మన సమాజంలో బయలుదేరిన ప్రతి మంచి ఆలోచనకు బాసటగా నిలిచినవి పత్రికలు. సమాజం గురించి ఆలోచించిన ప్రతి వ్యక్తీ, పత్రికల వేదికగానే ముందుకు సాగాడు. తిలక్, లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, గాంధీ, అంబేద్కర్ – ఇలా ప్రతి మహా వ్యక్తి తనతో పాటు ఒక పత్రికో, కొన్ని పత్రికలో కనబడతాయి. వారు చేపట్టిన పనులు సాధించడానికి పత్రికలు కేవలం సాధనాలు మాత్రమే.

స్త్రీ విద్య, గ్రంథ్రాలయోద్యమం, మత్తుపానీయాల విసర్జన, మూఢ నమ్మకాల నిర్మూలన, కుటీర పరిశ్రమల వ్యాప్తి, స్వదేశీ వస్తువుల తయారి, చదువు వంటి సంస్కరణ కార్యక్రమాలన్నీ పత్రికల జెండాలో అంతర్భాగం అయ్యాయి. మన దేశంలో ప్రతిభాషలోనూ స్వాతంత్రోద్యమంతో మమైకమైన పత్రికలూ చాలా కనబడతాయి. ఆ పత్రికల పరిధి, ప్రతుల సంఖ్య తక్కువ కావచ్చు- కానీ అన్నీ కలసి సాధించిన ఫలితం విశేషమైంది. దేశ ప్రజలను ఒక తాటి మీద నిలపడానికి దోహదపడిన వాటిలో పత్రికలు కీలకమైనవి. కాశీనాథుని నాగేశ్వరరావు (ఆంధ్రపత్రిక), కేసరి (గృహలక్ష్మి), పందిరి మల్లికార్జునరావు (కిన్నెర), వరదరాజులు నాయుడు (ఇండియన్ ఎక్స్‌ప్రెస్) వంటి పత్రికా స్థాపకులందరూ ఔషధాల అమ్మకం ద్వారా లాభించిన మొత్తంలో పత్రికలు నడిపారు. వాణిజ్యం, జర్నలిజం అనేవి కలవడం అనేది ఈ నాటి విషయం మాత్రమే కాదు. అయితే అంతర్గత లక్ష్యాలు పూర్తిగా మారిపోవడం తర్వాతి పరిణామం. బ్యాంకుల జాతీయకరణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, దాని వెనుక ఉండే మీడియా కోణం సాధారణంగా చర్చకు రాదు. అప్పట్లో మీడియా యజమానులకు జనుము (జూట్) పరిశ్రమలు ఉండేవి. అందువల్లనే ‘జూట్ ఇండస్ట్రీ’ అనే మాట శ్లేషతో వాడేవారు. పత్రికల యజమానులను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల్ని జాతీయం చేశారని భావిస్తున్నారు. ఇది అంతర్గత వ్యూహమని వేరుగా చెప్పనక్కరలేదు. ఎమర్జన్సీ ప్రకటించాక పత్రికారంగం బలపడింది. దక్షిణాది పత్రికా రంగం ఎమర్జన్సీ తర్వాత విస్తరించగా, మధ్య భారతదేశపు హింది పత్రికారంగం 1995 తర్వాత వ్యాప్తి చెందింది. పాతికేళ్లకు ముందు కొన్ని ప్రాంతాలలో కొన్ని పత్రికలు బహుళ వ్యాప్తిలో ఉండేవి. ఆనంద బజార్ పత్రిక, మలయాళ మనోరమ, దైనిక్ జాగరణ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ టైమ్స్, స్టేట్స్‌మన్, గుజరాత్ సమాచార్- ఇలా ఉండేవి. అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒకటి పలుచోట్ల ప్రచురింపబడేది. ఇప్పుడు అలా కాదు – పత్రికా సంస్థలు భాషలు దాటి, ప్రాంతాలు దాటి తమ వాణిజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. అంతే కాదు పత్రికల వారు టీవీ, రేడియో రంగాలలో ప్రవేశించి తమ స్థానాలను పటిష్టం చేసుకుంటున్నారు.

ఈ రకంగా చూసినపుడు అంశాల వారీగా విశ్లేషించడం సులువుగా ఉంటుంది.
1) విస్తరణ: ఈ ఏడు దశాబ్దాలలో పత్రికలు, రేడియో, టెలివిజన్ పెద్ద ఎత్తున విస్తరించాయి. జన జీవితంలో మీడియా చాలా ముఖ్యమైనదిగా మారింది. జన జీవితంలో మీడియా జోక్యం చేసుకుంటుంటే; యజమానులు, జర్నలిస్టులు అధికార కేంద్రాలలో జోక్యం చేసుకోవడం పెరిగింది.

2) పెట్టుబడి: అభిప్రాయాలు చెప్పగలిగే వారు పత్రికలు స్థాపించుకునే అవకాశం ఎంతో కొంత ఉండేది. నేడు పెద్ద స్థాయిలో పెట్టుబడి కీలకం కావడంతో, పత్రిక ఉంటే అభిప్రాయాలు, ఉద్బోధలు తయారు చేసుకోవచ్చు అనే ధోరణి పెరిగింది. దానితో ఎటువంటి ఫలితాలు సాధ్యమో అవే ఎదురవుతున్నాయి.

3) టెక్నాలజీ: విస్తరణ, పెట్టుబడి, టెక్నాలజీ ఈ మూడు ఒక వలయంలో ఉంటాయి లేదా మరో రకంగా చూస్తే మూడూ సమానార్థకాలుగా మారిపోతాయి. వస్తువూ, దాని ధోరణి కాకుండా; వేగం, ఆకర్షణ, మేళవింపు కీలకంగా మారాయి. ఎక్కువ మందిని వేగంగా చేరగలిగే సదుపాయం కల్గింది టెక్నాలజీ ద్వారానే.

4) భాషలు: మనదేశంలో ఉండే ఎన్నో భాషలకు ఊతం కల్గిస్తూ పత్రికలు విస్తరించాయి. ఇది పత్రికల తోడ్పాటు కాగా, లిపి లేని భాషలకు సైతం తోడైంది రేడియో. నిజానికి రేడియో, టెలివిజన్లు అక్షరాస్యత అనే పత్రికల పరిమితిని దాటి విజయవంతమయ్యాయి. పత్రికలు చదివే, రాసే భాషకు తోడ్పడగా; రేడియో, టెలివిజన్లు మాట్లాడే విధానాలకూ, మాండలికాలకూ హారతి పట్టాయి.

5) ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత: మీడియా విస్తరణ వల్ల అవాంఛనీయ ధోరణులు బహిర్గతం కావడమే కాకుండా పలు రకాల వివక్షల గురించి అవగాహన పెరిగింది. తద్వారా ఆరోగ్యకరమైన లక్షణాలు పెరిగే వీలుంది. వార్తాపత్రికలో వచ్చిన అంశాలను సుమోటోగా న్యాయస్థానాలు స్వీకరించే పరిస్థితి దీనినే చెబుతోంది.

6) అందరికీ అవకాశం: పెట్టుబడి పెట్టగలిగే వారంతా మీడియాలో ప్రవేశించడం నేటి చరిత్ర. ఫలితంగా వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు మీడియా యజమానులుగా మారిపోతున్నారు. తత్ఫలితంగా ఈ ప్రముఖుల లక్ష్య సాధనకు మీడియా ఒక పనిముట్టుగా మారిపోయింది.

7) అవినీతి: అవినీతిని ప్రశ్నించి, అరికట్టే మీడియా ఏదో ఒక దశలో అందులోనే కూరుకుపోవడం ఇప్పటి విషాదం. స్కాము ఏ స్థాయిదయినా అందులో ఎంతో కొంత కీలకపాత్ర పోషించిన పత్రికా రంగపు వ్యక్తి ఉండటం తప్పనిసరి అయ్యింది.

8) నడమంత్రపు సిరి: ఎంతో కొంత అవకాశం మాత్రమే ఉంది. తగిన జీతభత్యాలు లేకపోవడంతో మీడియా జర్నలిస్టులు కొత్త ధోరణిలో పడుతున్నారు. ఇది యజమానులకూ వర్తిస్తుంది.

9) వేగం: తక్కువ వ్యవధిలో ఇపుడు సమాచారం అందుతోంది. ఎక్కువ ప్రాంతాలకు చేరుతోంది. ఇది ప్రజలకు ఆనందదాయకం, యజమానులకు లాభదాయకం అయినా జర్నలిస్టులకు వత్తిడి పెంచుతోంది. అది వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితి మీద ప్రభావం చూపుతోంది.

10) స్ర్తీ వివక్ష : మీడియాలో స్త్రీల సంఖ్య బాగా తక్కువ. లోతుగా పరిశీలించి త్రీవంగా కృషిచేయాల్సిన కోణమిది.

11) ఆధిపత్య ధోరణి: చదువులు, పత్రికలు గతంలో కొందరికే పరిమితం అయినా నేడు ఇటు యాజమాన్యంగా అటు జర్నలిజంలో చాలా మంది ప్రవేశిస్తున్నారు. అయినా అగ్రవర్ణాల అధిపత్యం ఉందనే విమర్శ స్పష్టంగానే వినబడుతోంది.

హార్డ్‌వేర్ మాత్రమే వృద్ధి చెంది, సాఫ్ట్‌వేర్ చాప కిందకు వెళ్లిపోతున్నప్పుడు సామాజిక విలువల స్థానంలో వైయక్తిక ప్రయోజనాలు పెద్ద పీట పొందుతాయి. నియంత్రణ భావనను తిరస్కరిస్తూ పయనించే మీడియాకు న్యాయస్థానాల నుంచి గుణపాఠాలు తరచూ ఎదురవుతున్నాయి. సమాంతర అభిప్రాయాలను తిరస్కరించే మీడియాకు టెక్నాలజీ అందించిన ప్రత్యామ్నాయం సోషల్ మీడియా. మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రత్యామ్నాయ అభిప్రాయాలను కూడా గుర్తించడమే వ్యక్తి స్థాయిలో చిన్న తరుణోపాయం.

డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు