తమ పత్రికల్ని చదవని సంపాదకవర్గాలు

20 March, 2018 - 2:43 PM

మీడియా పల్స్

‘శేఖర్ గుప్తా, రాజ్‌దీప్ సర్దేశాయ్ కాలమ్స్ ప్రతివారం తెలుగు వెర్షన్ రెగ్యులర్‌గా సాక్షి, ఆంధ్రజ్యోతిలో వస్తాయి. కొత్త రాష్ట్రం ఏ.పి. గురించి గడచిన నాలుగేళ్ళలో ఒక్కసారి వీళ్ళు రాసింది లేదు. వీళ్ళ చూపులో ఏదో తేడా ఉంది… అనుమానం మొదలైంది… చివరికి ఈ వారంలో నా నాలుగేళ్ళ అంచనా నిజమైంది. వాళ్ళ దృష్టిలో మన ఉనికి గురించి…’ ఇదీ ఈ ఆదివారం సాయంకాలం ఫేస్‌బుక్‌లో కనబడిన ఒక వ్యాఖ్య! నిజమే… ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కాదు మూడు ప్రధాన పక్షాలు విభిన్న కారణాల చేత వార్తలలో ఉన్నాయి. తెలుగుదేశం బీజేపీతో విడిపోతున్నట్టు ప్రకటించడం; వైఎస్ఆర్‌సీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం; తెలుగుదేశం పార్టీ కూడా ఇదే బాటలో ప్రకటన చేయడం- ఈ మూడు పక్షాలకు చెందిన విషయాలు కీలకమైనవే ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాదు, మిగతా దేశానికీ ముఖ్యమైన పార్లమెంటు నిర్వహణ సంబంధమైనవి కనుక.వార్తా పత్రిక అంటే అది చదవబడే ప్రాంతానికి సంబంధించి కీలకమైన సమాచారం ఇవ్వాలి. సంపాదకీయం, సంపాదకీయ పుట విశ్లేషణలు ఎక్కువ ప్రభావ వంతమైన పోకడలను వివరించి, విశ్లేషించి, వ్యాఖ్యానించి దిశా నిర్దేశనం చేయాలి. సంపాదక సిబ్బందికి మించిన సామర్ధ్యం, చూపు గలవారు కనుక బయటి నుంచి కాలమ్స్ రాయిస్తారు. నాలుగేళ్ళలో ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి రాయకపోవడం ఏమిటి? ఇటువంటి కీలక పరిస్థితులలోనే రాయకపోతే ఇంకెప్పుడు రాస్తారు? దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. వీటిని ఆయా కాలమిస్టులూ, సంపాదకులూ పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ పాఠకులు- కొంతమంది పాఠకులు అయినా గమనిస్తారు. నిజానికి ఇలాంటి విషయాలు ప్రస్తావించడానికీ, చర్చించడానికీ గతంలో అవకాశం ఉండేది కాదు. మళ్ళీ ఇదే సంపాదకుల దయా ధర్మాల మీద ఆధారపడి ఉండేది. కానీ నేడు ఆ పత్రికల కన్నా ముఖ్యమైనదీ, తక్షణమే స్పదనకు కూడా అవకాశం కల్గించే సోషల్ మీడియా అందుబాటులో ఉంది. వారు ఇప్పుడు కాకపోయినా ముందు ముందయినా గుర్తించక తప్పదు.

– శేఖర్ గుప్తా ఇంగ్లీషు పత్రికల ద్వారా ప్రాచుర్యం పొందిన వారు కాగా; రాజ్‌దీప్ సర్దేశాయ్ వార్తా చానళ్ళ ద్వారా గుర్తింపు పొందినవారు. ఆ ప్రాంతాలలో వారు ఉండటం మూలాన వారికి ప్రాధాన్యం వస్తోంది. ఆకార్ పటేల్, కరణ్ థాపర్, రామచంద్ర గుహ, మహేష్ విజపుర్కర్ ఇలా చాలా మంది తెలుగు పత్రికలలో రాసారు. నిజానికి వీరు తెలుగులో రాయరు- ఇంగ్లీషులో రాస్తారు. వాటిని మన పత్రికల సందాదక వర్గాలు అనువదించి ప్రచురిస్తాయి. డెక్క్ క్రానికల్‌లో శనివారం వచ్చే ఆకార్ పటేల్ వ్యాసం ఆదివారం సాక్షిలో వస్తుంది. సంపాదకుల, పత్రికల ‘మీడియా సంబంధాల’ కారణంగా వారి వ్యాసాల అనువాదాల ప్రచురణ ప్రారంభమయినా- ఆయా కాలమిస్టులు కూడా ఏమి రాస్తున్నాం, ఎవరు చదివే అవకాశం ఉంది అనే స్పృ‌హ కలిగి ఉండాలి. ఇంత పెద్ద పేరు గల కాలమిస్టులు కనీసం ఆ విషయం గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం మాత్రమే కాదు విషాదం!

– వీటిని ప్రచురించే ముందు ఏ కారణాల చేత పలానా నిర్ణయం తీసుకుంటారో ఈ పత్రికల సంపాదకులు గమనించరనుకోవాలి. ప్రచురణ ప్రారంభించిన తర్వాత పాఠకుల ఫీడ్‌బ్యాక్ గురించి పట్టించుకోకపోయినా; కనీసం తామయినా వాటిని చదవాలి. ఆ కాలమ్స్ ధోరణి గురించి ఆలోచించాలి. సగానికి మించిన సర్క్యలేషన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు ఆ పాఠకులను పట్టించుకోవడం లేదని ఆయా కాలమిస్టులకు చెప్పాలి ఈ సంపాదకవర్గం. ఇది జరగడం లేదు కనుక వారు రాసింది వీరు అనువదిస్తున్నారు. అంతే!
ఈ రెండింటికీ మించిన విషయం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మరొకటి ఉంది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలకు వాణిజ్య పరమైన అవసరాలు హైదరాబాదుతో ఉన్నాయి. కనుక అవే రాజకీయ అవసరాలుగా రూపుదిద్దుకుంటాయి. అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఆ పత్రికల గౌరవం, సర్క్యులేషన్ కూడా ముఖ్యం కదా! ఈ రాష్ట్ర అవసరాలు ఏమిటి- అనే స్పృహ ఈ మూడు పత్రికల సంపాదక వర్గాలకు కూడా పట్టినట్టు భావించలేము. లేకపోయి ఉంటే ఇప్పటికే ఈ రాష్ట్రానికి విడిగా సంపాదకీయ పేజీలను తయారుచేసుకుని ఉండేవి. ప్రధాన సంపాదకులు మాత్రమే కాదు ఇతర సంపాదకవర్గ సభ్యులు సైతం ఈ విషయాన్ని గమనించలేదనే భావించాలి. దీనికి కొసమెరుపు ఇంకోటి ఉంది. సోషల్ మీడియాలో తమ మీద విమర్శలు వెల్లువెత్తుతాయి కనుక దానిని చూడడానికి సాహసించని సంపాదకులు కొందరైతే; విమర్శలుంటాయి కనుక సోషల్ మాఫియా అని ప్రతి విమర్శించే పత్రికలు మరికొన్ని!

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు