తెలంగాణ పత్రికలు

14 March, 2018 - 3:05 PM

మీడియా పల్స్

‘మీడియా పల్స్’లో ఇంత వరకు 25 వారాలు వివిధ అంశాలు చర్చించుకున్నాం. భవదీయ కాలమిస్టు ప్రస్తుతం తిరుపతి వాసి కావడంతో, అక్కడ గమనించడానికి సాధ్యపడిన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాం. కనుక తిరుపతిలో లభ్యం కాని పత్రికల పోకడల గురించి చెప్పుకోవడానికి వీలు కాదు. ఉదాహరణకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిషన్ లేదు కనుక విరివిగా కనబడదు. మనం, సూర్య పత్రికలు ఇక్కడ ఎడిషన్ కేంద్రాలున్నాయి అంటారు కానీ ఆ పత్రికలు పెద్దగా కనబడవు. గత వారంలో ఒక మూడు రోజులు హైదరాబాదులో ఉన్నప్పుడు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, హిందూ, ఎక్స్‌ప్రెస్ పత్రికలు కాకుండా అక్కడ మాత్రమే లభించే పత్రికలు గమనించాలని నిర్ణయించుకున్నాను. అవి టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ టుడే అనే ఆంగ్ల పత్రికలు ఇంకా నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, మనం. లకడికాపూల్ ప్రాంతం ద్వారకా హొటల్ దగ్గర నవ తెలంగాణ మూడు రోజులూ లభించలేదు. కేవలం ఉదయం మాత్రం దొరికిన పత్రికలు చదవడానికి ప్రయత్నించాను. ఈ ఐదు పత్రికల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ముఖ్యమంత్రికి చెందినవని ప్రచారంలో ఉంది. మన తెలంగాణ పత్రిక సి.పి.ఐ. పార్టీకి సంబంధం లేకపోయినా కె.శ్రీనివాసరెడ్డి సంపాదకులు కావడం వల్ల కొందరలా భావించవచ్చు.

మార్చి 6,7,8 తేదీల పత్రికల్లో కీలకాంశం కె. చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించిన వార్త. ఒక్క తెలంగాణనే కాకుండా యావత్తు దేశం ఆకర్షించిన వార్తాంశమది. కనుక నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలలో దీనికి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అధికంగానూ, అనుకూలంగానూ కనబడడం సహజం. రెండు పత్రికలూ అన్ని హంగులతో, మంచి న్యూస్ ప్రింటుతో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. తెలంగాణ టుడే పత్రికలో ప్రతి పేజీ పై భాగాన కుడి వైపున ‘A’ అనే అక్షరం అన్ని పేజీల్లో ఉంది. అంటే ఒకటో సెక్షన్ ‘ఏ’ కాగా రెండవది ‘బి’. హిందూ పత్రికలో చాలా కాలం పనిచేసిన కొత్తూరు శ్రీనివాస్‌రెడ్డి గారు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమయిన ఈ ఇంగ్లీషు పత్రిక ‘తెలంగాణ టుడే’కు సంపాదకులు. నమస్తే తెలంగాణ లే అవుట్, డిజైన్ అందంగా ఉంది. ఈ మూడు రోజుల్లో మహిళా వారోత్సవం, దినోత్సవం సందర్భంగా చాలా అంశాలు కనబడ్డాయి. సైన్స్ విషయాలకు ‘శాస్త్ర’, టెక్నాలజికి ‘సంకేత’ అని రెండు ప్రత్యేక పేజీలు నిర్వహించడం అభినందనీయం. పరిశోధనారంగం గురించి విద్యా విషయక అంశం గురించి సంపాదకీయ పుటలో ఒక వ్యాసం రావడం ముదావహం.

ఐదేళ్ళ క్రితం జర్నలిస్టు నాయకులు, విశాలాంధ్ర జర్నలిస్టు కె. శ్రీనివాసరెడ్డి తన మిత్రుల సాయంతో ప్రారంభించిన పత్రిక ‘మన తెలంగాణ’. ప్రధాన సంచిక 12 పేజీలతో ఏడు కేంద్రాల నుంచి ప్రచురింపబడే పత్రిక ఇది. నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, మన తెలంగాణ ఇటీవలి కాలంలో మొదలైన పత్రికలు. చివరి రెండు పత్రికలు ప్రజాశక్తి, విశాలాంధ్ర బదులు తెలంగాణలో మొదలయిన పత్రికలు. అందం, హంగులో లోపం లేదు. సంపాదకీయ పుటలో ప్రధాన వ్యాసానికి ‘చూపు’ అని నామకరణం చేశారు. మార్చి 7వ తేదీన ప్రధాన వ్యాసం శీర్షిక- ఆర్ట్ ఆఫ్ బ్లాక్‌మెయిల్. ఇది జిల్లా అనుబంధాలలో అయితే సర్దుకోవచ్చు. ప్రధాన సంచిక, ఎడిట్ పేజి. ఈ పేజీ రూపొందించే వారికీ, పేజీ వ్యాసాలు చదివే వారికి కొంత ఇంగ్లీషు తెలిసే అవకాశం ఉంది. ‘అమ్మడూ.. లెట్ అజ్ కుమ్ముడూ’ లాగా ఉందీ వ్యవహారం. జిల్లా అనుబంధానికి ‘మన విశ్వనగరి’ అని నామకరణం చేయడం బావుంది.

సంవత్సరం క్రితం మొదలైన పత్రిక ‘మనం’. ఇది తెలంగాణకు మాత్రమే కాదు, ఉభయ రాష్ట్రాలలో ఏడేసి కేంద్రాల నుంచి వస్తోంది. అయితే ప్రస్తుతం హైదరాబాదు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనబడుతోంది. నూతనత్వం కోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. మహిళా దినోత్సవం రోజున 5 కె. రన్ నిర్వహించారు హైదరాబాదులో.

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రధానంగా నగరాలను దృష్టిలో పెట్టుకుంటుంది. తెలంగాణలో హైదరాబాదు ఎడిషన్ ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడల్లో ఉన్నాయి. నగరాల్లో అయితే సర్క్యులేషన్ ఎక్కువ, ప్రకటనలు ఎక్కువ. అది వారికి లాభదాయకం. ఇలాంటి పెద్ద పత్రికల ధోరణి వేరుగా ఉంటుంది.

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు