వార్తా చానళ్ళు సిగ్గుపడాలి

06 March, 2018 - 4:37 PM

మీడియా పల్స్

టెలివిజన్ యజమానులకూ, ఉద్యోగులకూ వారానికో పరీక్ష ఉంటుంది! అదే పత్రికలకయితే అర్ధ సంవత్సరానికోసారి! పత్రికల సర్క్యులేషన్ల లెక్కలు ఆరు నెలలకు ఒకసారి వెల్లడి చేస్తారు. అయితే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ వారానికోసారి విడుదల చేస్తారు. ఆ లెక్కలు వచ్చే రోజు అందరి హృదయ స్పందన ఎక్కువగా ఉంటుంది. దేని ఆధారంగా ఈ లెక్కలు తేలుస్తారు అనేది చాలా మందికి తెలుసు. వాటి కోసమే చానళ్ళు నానా రకాల ఫీట్లు చేస్తుంటాయి. అయితే ఇంకో రకమైన టి.ఆర్.పి. గురించి చెప్పుకోవాల్సి ఉంది. అదే తిట్లలో రేటింగ్ పాయింట్. ఇటీవల టెలివిజన్ చానళ్ళు అన్నీ వెంపర్లాడి, పరువు తీశాయి. పరువు పోగొట్టుకున్నాయి. ఎంత పరువు పోగొట్టుకున్నాయని తెలియజేసేది తిట్లు తినడంలో రేటింగ్ పాయింట్.

పత్రికలు మాత్రమే ఉన్నప్పపుడు, పత్రికలు పరస్పరం విమర్శలు చేసుకోని ఆ కాలంలో అంతర్గత విషయాలు పెద్దగా తెలియవు. పత్రికలనుపయోగించుకుని ఏ మేరకు స్వంత లాభాలు గడించారో పూర్తి సమాచారం లేదు. అయితే మానవ స్వభావం గనుక ఎంతో కొంత జరిగి ఉంటుంది.1969లో బ్యాంకుల జాతీయకరణ జరిగిందని చెప్పుకుంటాం. ప్రభుత్వ పరంగా బ్యాంకులు నడవటం వల్ల గ్రామసీమలకు విస్తరించడం, పారదర్శకంగా ఉండటం సాధ్యమని పరిగణిస్తూ వచ్చాం. అయితే దీనికి మీడియా కోణం ఉందని అంటారు. అప్పట్లో పత్రికాధిపతులలో చాలా మందికి బ్యాంకు వాణిజ్యం ఉండేదట. కొందరికి జనుము వ్యాపారం కూడా ఉండేది. కనుకనే శ్రీమతి ఇందిరాగాంధీ నర్మగర్భంగా ‘జూట్ ఇండస్ట్రీ’ అనేవారట. పత్రికల యజమానుల ఆటలు కట్టడి చేయాలని అప్పట్లో బ్యాంకుల జాతీయకరణ చేశారని ఒక విశ్లేషణ. ఈ సమయంలోనే పత్రికా స్వేచ్ఛ పత్రికా యజమానుల స్వేచ్ఛ కాదనే వాదం వినబడేది.

కానీ నేడు గోప్యత సాధ్యం కావడం లేదు. తొలుత టెలివిజన్‌ వచ్చినపుడు విమర్శలు రాలేదు కానీ; న్యూస్ టెలివిజన్ ప్రవేశించినపుడు విమర్శలు పలు రకాలు వచ్చాయి. గట్టిగానే విమర్శలు వెలువడ్డాయి. న్యూస్ టెలివిజన్‌కు సినిమా గ్లామర్ ఉంది, పత్రికల గౌరవం ఉంది. కనుక న్యూస్ టెలివిజన్‌ను ఖండించడం మాని; పత్రికా యజమానులూ, జర్నలిస్టులు న్యూస్ టెలివిజన్‌లో ప్రవేశించారు. ప్రవేశించని పత్రిక ఏదంటే చెప్పడం కష్టం. అదీ పరిస్థితి! ఈ నేపథ్యంలో టెలివిజన్ చానళ్ళ తీరుపై కూడా విమర్శలు వినబడవు. తమ వ్యాపారానికి భంగం కల్గించేది ఎందుకు?కార్గిల్ ప్రాంతంలో, యుద్ధ సమయంలో ఒక రిపోర్టర్ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలని మొబైల్ ద్వారా ప్రయత్నించారు. అయితే మొబైల్ సిగ్నల్ కారణంగా శత్రు సైన్యం గుర్తించింది. ఆ దిశగా కాల్పులు జరిగాయి. ఆమె ఫోన్ చేయకపోతే వారికాచూకీ దొరికేది కాదు. అయితే తిరకాసు ఏమిటంటే శత్రువుల తుపాకీ గుండ్లకు వెరవకుండా అని సదరు చానల్ ప్రచారం చేసుకుంది. కానీ ఈ విషయం ఎంతో కాలానికి కానీ బయటికి రాలేదు. కనుక ఆ చానల్ ప్రచారం బాగానే సాగింది.

అయితే ఇపుడు మీడియాను నిలదీయడానికి సోషల్ మీడియా ఇరవై నాలుగ్గంటలూ, వేలాది కళ్లతో కాచుకుని కూచొంది. శ్రీదేవి మరణం గురించి చాలా జుగుప్సాకరంగా వార్తా చానళ్ళు ప్రవర్తించాయనే చెడ్డపేరు మూటగట్టుకున్నాయి. ఎంత అవమానకరంగా, ఎంత వెకిలిగా, ఎంత అసహ్యంగా చానళ్ళు సాగాయో సోషల్ మీడియాలో ఆడియో, వీడియో ఆధారాలతో సహా కనబడ్డాయి. ఈ ఆధారాలు లేకపోతే ఎవరైనా వాటిని అంగీకరించడానికి సందేహిస్తారు. ఎందుకంటే భావ ప్రకటనా స్వేచ్ఛ, రాజ్యాంగం నిర్దేశించిన తీరు, సామాజిక బాధ్యత అంటూ ప్రసంగాలు చేసే జర్నలిస్టులూ, వారి యాజమాన్య సంస్థలూ ఇలా దిగజారాయా అనే సందేహాలు తప్పక వస్తాయి. అంత నీచంగా ఉంది శ్రీదేవి విషయంలో వార్తా చానళ్ళ తీరు!

అయితే ఇటువంటి సమయంలో ప్రతిస్పందన ఎలా ఉంటుంది:
– మాకు ఎంత వత్తిడి ఉంటుందో మీకు తెలుసా?
– మాకు (టెలివిజన్‌కు) ఉండే గ్లామరంటే పత్రికలకు అసూయ
– మాకు పోటీగా ఉండే చానల్ (భాష, ప్రాంతం, దేశం కూడా వేరు కావచ్చు) తీరు గురించి మీకు విమర్శలు లేవా?
– మమ్ములను విమర్శించడం మీకు కాలక్షేపం.

ఇలా సమాధానం చెప్పాలని, సమాధానపడలేరు. గ్లామర్, వత్తిడి ఒకే నాణేనికి రెండు ముఖాలు. అలాగే వాణిజ్యం, సామాజిక బాధ్యతలు కూడా! కనుక నచ్చినా, నచ్చకపోయినా విమర్శలు ఎదుర్కోవలసిందే! కార్టూనిస్టు మృత్యుంజయ్ అద్భుతమైన చిత్రణ చేశాడు. న్యూస్ టెలివిజన్ చానల్ రిపోర్టర్ చితి మీద పడుకొని వార్తాంశం వివరిస్తున్నట్టు! నిజానికి వార్తా చానళ్ళ గౌరవం చితి మీద ఉందా అనే ఆలోచన రాక మానదు. ముంబయిలో తాజ్ హొటల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే మన చానళ్ళు టి.ఆర్.పి.ల కోసం కార్యక్రమాలు చేశాయనే విమర్శ వచ్చింది. ఇలా ప్రతిసారీ మరింత అధ:పాతాళంలోకి పోవడం అలవాటుగా మారింది వార్తా చానళ్లకు. దీనికి మీడియా సిగ్గు పడాలి!

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు