ప్రజలకు దూరమవుతున్న మీడియా

27 February, 2018 - 3:03 PM

మీడియా పల్స్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ప్రతినిత్యం మలుపులతో సాగుతున్నాయి. రాజకీయాల పోకడలను ప్రతిఫలించే జర్నలిజం కూడా అదే రీతిలో సాగుతోంది. జరిగిన పరిణామాలనూ, సంఘటనలనూ విశ్లేషించడం, వ్యాఖ్యానించడం జర్నలిజం విధి. అలాగే ఈ దిశలో మార్గనిర్దేశనం జరిగేలా వివేచన కల్గించడమూ అవసరమే! అదే సమయంలో అధికారంలో ఉన్నవారూ, చేయగలిగినవారూ- గుర్తించని విషయాలను సమస్యలను ఎరుకపరచడమూ మీడియా బాధ్యత. ఇటీవలి రెండు విషయాలు ఈ అంశాలను చర్చించక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నాయి.

ఫిబ్రవరి 23న కర్నూలు డిక్లరేషన్ పేరున భారతీయ జనతా పార్టీ రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి కొన్ని డిమాండ్లు చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగినా పెద్ద పత్రికలలో కనబడలేదు, లేదా కనబడనంత అప్రధానంగా వేశారు. ఈనాడులో కనబడలేదు, సాక్షిలో కుదించి లోపలి పేజీల్లో ఉంచారు. ఆంధ్రజ్యోతిలో తొలిపేజీలో సూచించి లోపల వార్త వేశారు. ఆంధ్రప్రభ తొలి పేజీలో కొంచెం కనబడేటట్టు వేస్తే, ఆంధ్రభూమి ప్రధానంగా వేసింది. ఇంగ్లీషు పత్రికలలో కూడా ఇదే ధోరణి కనబడింది. డెక్కన్ క్రానికల్ తొలి పేజీలో పై భాగాన ఎడమ వైపు ప్రధానంగా వేయగా- హిందూ, ఎక్స్‌‌ప్రెస్, హన్స్ లోపలి పేజీల్లో వేశాయి. నిజానికి హన్స్ స్థానిక విషయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే తెలుగువారి ఇంగ్లీషు పత్రిక. తొలిరోజు మిస్ అయ్యారు. పిదప స్పెషల్ స్టోరీతో ఇస్తారేమో అని ఎదురు చూసిన వారికి నిరాశే కల్గింది. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న తెలుగు మీడియా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై దృష్టి పెట్టలేదనే విమర్శ క్షేత్ర స్థాయిలో బలంగా వినబడుతోంది. ఇది ఒక ప్రధాన స్రవంతి పత్రికలూ, చానళ్లకే కాదు; కొందరు జర్నలిస్టులు నడిపే పోర్టల్స్‌కు సైతం వర్తిస్తుందనేది మరో అంశం.ప్రత్యేక హోదా రెండవ చర్చనీయాంశం. రాష్ట్ర విభజన జరిగిన 2014లో భవదీయ కాలమిస్టు మద్రాసులో ఉన్నారు. ఎకనామిక్‌ టైమ్స్, మింట్ వంటి పత్రికలు చాలా వివరంగా స్పెషల్ క్యాటగెరి స్టాటస్ అంటే ఏమిటి, ఏమి ఉపయోగాలు, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, చట్ట ప్రకారం లోతుపాతులు ఏమిటి అని రాశాయి. అప్పట్లో ‘ప్రజాశక్తి’ పత్రికలో ‘మీడియా టుడే’ శీర్షికలో ఈ అంశాలు చర్చించాను కూడా. తెలుగు పత్రికలు (లేదా తెలుగు ప్రాంతపు ఇంగ్లీషు పత్రికలతో సహా) ఈ విషయం లోపలి వివరణను దాటవేశాయనే రీతిలో సాగాయి. చానళ్ళ గురించి విడిగా చెప్పనక్కర లేదు. ఎందుకంటే స్వరూపం వేరు కావచ్చు, మూల స్వభావం ఒకటే. పెద్ద మూడు పత్రికలకు వార్తా చానళ్లు ఉన్నాయి. కనుక విడిగా చర్చించనవసరం లేదు.ప్రత్యేక హోదా ఎన్నికల ముందు సంవత్సరం రాజకీయ నాయకులు ప్రకటించగానే పత్రికలూ, చానళ్ళు దీని గురించి లోతుగా చర్చించడం మొదలు పెట్టాయి. ఒక చానల్ వెంట మరో చానల్ ఊరూరా చర్చలూ, ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభించాయి. ఈ విషయాలు, పోకడలు గమనిస్తే మీడియాకు ఉండే పరిమితమైన చూపు లేదా నియంత్రితమైన ధోరణి బోధపడతాయి. క్రమంగా ప్రజలకు దూరంగా వెళ్లడం సమాజానికి మంచిది కాదు, మీడియాకు దీర్ఘకాలికంగా లాభదాయకం కాదు!

– నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు