కొత్త సంపాదకుల వినూత్న పోకడలు

21 February, 2018 - 3:15 PM

మీడియా పల్స్

రౌతు కొద్దీ గుర్రం…
కొత్త రక్తం కావాలి…
ఒకటి కన్నా రెండు మిన్న…

– ఇటువంటి అనుభవ సూక్తులు చెప్పే విషయం ఒకటే! ఇటీవలి కాలంలో రెండు పత్రికలకు సంపాదకులు మారారు. ఆంగ్ల దినపత్రిక హన్స్ ఇండియాకు కె.నాగేశ్వర్ స్థానంలో వి. రాముశర్మ వచ్చారు. ఈ మార్పు త్వరగానే జరిగింది. స్థూలంగా పత్రికలో మార్పులు పెద్దగా కనబడలేదు. అయితే రెండు విషయాలు చెప్పవచ్చు-

అ) మహిళలకు (తెలుగు పత్రికల వలే) ప్రతిరోజు ఒక పుట కేటాయించడం హన్స్‌లో ఇటీవల మొదలైంది. ఆలోచన ఎప్పటిదయినా ఈ మార్పు కొత్త సంపాదకుల హయాంలో జరిగింది.
ఆ) ఇంతకు ముందు తొలి పేజీలో కీలకాంశం ఇతర ఇంగ్లీషు, తెలుగు పత్రికల కన్నా విభిన్నంగా విశ్లేషించే వార్తలుండేవి. ఇటీవల ఈ ధోరణి తగ్గిందా? ఈ రెండు విషయాలు మించి పెద్ద మార్పులు ఈ కాలమ్ రచయితకు కనబడలేదు.ఇక ఆంధ్రభూమిలో కొత్త నిర్వాహక సంపాదకులు నియమించబడటానికి నాలుగు నెలలు పట్టింది. ముళ్ళపూడి సదాశివశర్మ బాధ్యతలు స్వీకరించి, గమనించి, మార్పులు చేయడానికి మరి నాలుగు నెలలు పట్టింది. ఇరవై మూడు సంవత్సరాలు ఒకే సంపాదకుడున్న తర్వాత సహజంగా మార్పులు రావడానికి వ్యవధి పడుతుంది. మొదటి పుట కీలకాంశం ఆధారంగా పంచ్‌పాళీ పేరున పద్యం- కంద పద్యం రాయడంతో వారి ఆగమనం మా వంటి వారు గుర్తించారు. ఇదే మార్గం! ఎందుకంటే వారి పేరు నిర్వాహక సంపాదకుడిగా ఉండదు. యజమాని పేరు ప్రధాన సంపాదకుడిగా కనబడుతోంది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో చాలా మార్పులు వచ్చాయి. వాటిని పరిశీలిద్దాం.

1. చాలా పత్రికలుండవచ్చు. కానీ ఆంధ్రభూమి వారి సినిమా అనుబంధం ‘వెన్నెల’కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా వరకు నంది సినిమా విమర్శక అవార్డులు ఈ సంచికలో రాసిన వారికి రావడం గమనార్హం. ఇది చాలా కాలం శుక్రవారం వెలువడేది. ఇది పాఠకులకు సులువుగా ఉండేది- సమీక్షలు చూసి శని, ఆదివారాలు సినిమాలు చూడటానికి! అయితే ఎక్కువ సినిమాలు శుక్రవారం విడుదలవుతాయి. మరి వారం వరకు సమీక్షల కోసం నిరీక్షించడం కూడా కష్టమే! అందు వల్ల కొంతకాలం క్రితం మంగళవారానికి మార్చారు. ఇది ప్రేక్షకులకు మరో రకంగా ఇబ్బంది- సినిమా సమీక్షలు ఆధారంగా చూడాలనే వారికి. ఇపుడు ఆదివారానికి మార్చడం మెరుగయిన ఆలోచన. శుక్రవారం సినిమాల సమీక్షలు ఆదివారం వస్తే, వెళ్ళాలనుకునేవారు వెళ్ళవచ్చు. ఆదివారం టైముంటుంది కనుక చదవడానికి సౌలభ్యం. మూడు ఇతర పత్రికలు ఆదివారం అదనంగా సినిమా గురించి ఇస్తున్నపుడు నాలుగు పేజీల వెన్నెల మంచి పోటీయే!

2. క్రీడల విషయాలు లోపలికి పంపి, చివరి పేజీని రెండవ మొదటి పేజీగా తీర్చిదిద్దడం మన దేశంలో మొదలై కొన్ని సంవత్సరాలైంది. ప్రస్తుతం ఆంధ్రభూమి చివరి పేజీ ఆకర్షణీయం, ఆసక్తికరంగా మారింది.
3. ఇది వరకు సంపాదకీయ పుటకు సెలవు వుండేది కాదు. సోమవారం సాహితి పేజీ వేరే చోట ఇచ్చేవారు. ఇపుడు మిగతా పత్రికల లాగా నాల్గవ పేజీ సాహిత్యం కోసం వాడటం పాఠకులకు సౌకర్యం. సంపాదక సిబ్బందికి వారాంతపు ఆటవిడుపు.4. ఫిబ్రవరి రెండవ వారంలో సంపాదకీయ పుట లే అవుట్ మార్చివేయడం గమనార్హం. ఈ విషయంలో సృజనాత్మకత సాధించడం కష్టం- అయినా ప్రయత్నం అభినందనీయం. ఉత్తరాలకు ప్రాధాన్యత ఇచ్చే తెలుగు పత్రికలలో ఆంధ్రభూమి ఒకటి. ప్రజాస్వామ్య పోకడకు దర్పణం ఈ పోకడ. దీన్ని మరింత అర్థవంతంగా- చర్చా వేదికగా మార్చడం ఎంతో అవసరం. కొన్ని శీర్షికలకు సెలవు ఇచ్చి, కొత్తవి రావాల్సిన అవసరం చాలా ఉంది.

5. భూమిక, వాహిని వంటి అర్థవంతమైన, సమగ్రమైన పేర్లు పరిహరించడం బాగా లేదు. మూస కన్నా ఇవి చాలా మెరుగు. వాణిజ్యభూమి, క్రీడాభూమి, చిత్రభూమి, ధర్మభూమి బాగున్నాయి. ఈ విషయం గురించి తప్పక పునరాలోచించాలి సంపాదకవర్గం.6. పదకొండో పేజీలో గురువారం ఒక కీలకాంశం గురించి పలువురి అభిప్రాయాలు ఇచ్చే విధానం ఉండేది. ఇది ఈ మార్పులలో పోయింది. దీన్ని తప్పక పునరుద్ధరించాలి తక్షణం. అలాగే ఆరోగ్యం, న్యాయం, చట్టం, పర్యావరణం, సైన్స్ వంటి విషయాలకు వేదిక అవసరం. 10, 11 పేజీలు ఈ దిశలో పునర్ వ్యవస్థీకరించాలి.

7. ఆకాశవాణిలో గతంలో ప్రసారమైన ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు ‘విన మరుగయిన’ శీర్షికలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభించారు. వారి ప్రఖ్యాత ఎడిటర్ గోరా శాస్త్రి ‘ఆశ ఖరీదు అణా’ తర్వాత ఇపుడు ‘ఆమె నవ్వింది’ ప్రచురింపబడుతోంది. ఇది ఒక అపురూపమైన ఆలోచన. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి వంటి వారు ఆకాశవాణికే ప్రత్యేకంగా రాశారు.

8. ఆదివారం సంచికలో మార్పులు ఫిబ్రవరి 18 సంచిక నుంచి మొదలయ్యాయి.

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు