మీడియా జెండర్ సెన్సిటివిటి పెంచడమెలా

14 February, 2018 - 1:56 PM

మీడియాపల్స్

మీడియా జెండర్ పరంగా ఎంత సెన్సిటివ్‌గా ఉంది? నిజానికి పెద్దగా చర్చింపబడని విషయం ఇది. చర్చ కాదు, కనీసం పరిశీలనకు కూడా నోచుకోని పార్శ్వమిది. ‘తెహల్కా’తో వార్తలలోకి సంచలనంగా వచ్చిన తరుణ్ తేజ్‌పాల్ చివరకు గోవాలో తోటి మహిళా జర్నలిస్టుతో అవమానకరంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన కథనం ప్రచురిస్తూ (క్యారవాన్ Caravan) పత్రిక సంపాదకులు ఈ సమస్యను తమ సంస్థలో పర్యవేక్షించటానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. పత్రికల యాజమాన్యాలు ఇలా స్పందించడం అరుదయిన విషయం. మీడియా సంస్థలు జెండర్ పరంగా ఎలా స్పందిస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణ.

నాలుగేళ్ళ క్రితం ఫిబ్రవరి మూడో వారంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. విడిపోయిన దంపతులు ప్రేమికుల రోజున మన్మథ బాణాలు తగిలి మళ్ళీ ఒకటయ్యారు అనే రీతిలో ఆ కథనం సాగింది. మరుసటి రోజు డెక్కన్ క్రానికల్ దీనికి సంబంధించి పూర్తి కథనం ప్రచురిస్తే కానీ అసలు విషయం తెలియరాలేదు. ఆడపిల్లలు ఎదిగివస్తున్నా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడాన్ని గృహస్తు పట్టించుకోలేదు. ఆ ఏర్పాటు చేసినపుడు తిరిగి వస్తానని ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లింది. విషయం కోర్టుకెళ్ళింది, సంవత్సరాలు గడిచాయి. భార్య పుట్టింటికి వెళ్ళినా ఆయన పిల్లల చదువుకు డబ్బులు కూడా పంపేవాడు. కోర్టు టాయిలెట్ కట్టించుకోమని కోరింది. వాటిని ఏర్పాటు చేశాడు ఆ పెద్దమనిషి. పిమ్మట మంచిరోజు చూసి ఇల్లాలు ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రోజు ఫిబ్రవరి 14 కావడం కాకతాళీయం. ఇలాంటి విషయాల వార్తలు ఎంత జెండర్ సెన్సిటివ్‌గా ఇస్తున్నారు అనేది మరో పార్శ్వం. పత్రికా రంగంలో మహిళలు బాగా తక్కువ. వారు కూడా నిర్ణాయక స్థానాల్లో లేరు. టెలివిజన్‌లో అమ్మాయిలున్నా, వారు గ్లామర్ కోసం కానీ, మేధస్సు ప్రధానంగా, జెండర్ సెన్సిటివ్‌గా వార్తలు మలచడానికి కాదు. స్త్రీల పుటలు, స్త్రీల కార్యక్రమాలు ఉన్నా అవి కేవలం వాణిజ్యవేత్తలు తయారుచేసే వినియోగ వస్తువుల అమ్మకానికి దోహదపడే కథనాలు మాత్రమే! పెట్టుబడి, లాభం, రాజకీయం, సంచలనం ప్రధానంగా సాగే మీడియాలో జెండర్ సెన్సిటివిటిని వెతకడం కష్టమే! సమాజంలో సగభాగమున్నా కానీ మీడియాలో ఆ స్థాయి భాగస్వామ్యం లేదు. కొన్ని చోట్ల సంఖ్యాపరంగా మహిళలు ఉన్నా వారు మీడియా జెండర్ స్వభావాన్ని ప్రభావితం చేయలేరు. జర్నలిస్టులలో అన్ని స్థాయిలలో మహిళలు ప్రవేశిస్తే కానీ జెండర్ స్వభావం మారదు. యాజమాన్యాలనూ, సంపాదకవర్గాలను జెండర్ సెన్సిటివ్‌గా ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు గానీ ఫలితం కనబడదు.ఈ అంశం ఇతివృత్తంగా ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక (ప్రరవే) నాల్గవ మహాసభలు తిరుపతిలో ఈ నెల 10, 11 తేదిలలో జరిగాయి. రెండు రాష్ట్రాలకు చెందిన నలభయి మంది రచయిత్రులు, మహిళా జర్నలిస్టులు ఈ సభలలో పాల్గొని చాలా విషయాలు చర్చించారు. ప్రారంభ సదస్సులో భవదీయ ఈ శీర్షికా రచయిత కూడా పాల్గొని పరిష్కారాలు కొన్ని సూచించారు. స్త్రీ వాద సాహిత్యం, ఆలోచన ఒక ఉప్పెనలా వచ్చి అప్పటి దాకా ఉన్న దృక్పథాన్ని, స్వభావాన్ని మార్చగలిగింది. దీనికి ప్రధాన సాధనం మీడియా. కానీ ప్రస్తుతం పోరాటం మీడియా మీదనే కనుక ఇక్కడ ఆ సాధనం పనిచేయదు. కనుక ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం లేదు. కనుక నిరంతరం అప్రమత్తంగా సాగాలి. అదెలా?

– జెండర్ పరంగా వార్తలు ఇవ్వడంలో ఏ మీడియా ఏ తీరుగా ఉంది అని సమీక్షలు నిరంతరం సాగాలి. దీనికి ఫేస్‌బుక్ వంటి కొత్త సులువైన, చౌకయిన మాధ్యమాలు వేదికలు కావాలి.

– ఇలాంటి పరిశీలనలను నెలకోసారి ఆయా మీడియా సంస్థల దృష్టికి తేవాలి. ఈ విషయం ఫేస్‌బుక్ వంటి వాటి ద్వారా మిగతా వారికి తెలియాలి. అభినందనలు స్పష్టంగానూ, విమర్శలు వివరంగానూ ఉండాలి.– మీడియా సంస్థలు అంతర్గతంగా ఎంత మీడియా సెన్సిటివ్‌గా ఉన్నాయో వివరాలు ఆధారంగా ప్రకటించే అవకాశం ఎంత ఉందో అన్వేషించాలి. ఈ కోణంతో పాటు కథనాలు రూపొందించడంలో మీడియా సంస్థలు ఎంతవరకు జెండర్ సెన్సిటివ్‌గా ఉన్నాయో బేరీజు వేసి ఆ సంస్థలను గుర్తించి, గౌరవించే ఏర్పాటు కోసం ప్రయత్నించాలి.

– ఇపుడు అందుబాటులో ఉన్న మహిళా జర్నలిస్టుల స్వీయ అనుభవాలతో వ్యాసాల సంకలనం డాక్యుమెంట్ చేసి మార్గదర్శనం చేయాలి.

ఈ దిశలో ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక (ప్రరవే) ముందుకు వస్తే ప్రణాళికాపరమైన తోడ్పాటు ఇవ్వడానికి సదా సిద్ధమేనని పేర్కొంటున్నాను.

-డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు