MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్ మూవీ రివ్యూ

21 December, 2017 - 12:26 PM

సినిమా : ‘MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్’
నటీనటులు : నాని, సాయి పల్లవి, రాజీవ్ కనకాల, భూమిక తదితరులు
దర్శకుడు : వేణు శ్రీరామ్
నిర్మాత   :  దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
సంగీతం : దేవిశ్రీప్రసాద్
విడుదల తేది : డిసెంబర్ 21, 2017.

వరుసగా ఏడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఈసారి మిడిల్ క్లాస్ అబ్బాయిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాజు, శిరీష్, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నాని, సాయిపల్లవి, భూమిక ప్రధాన పాత్రలలో నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథే ఈ MCA అంటూ చిత్ర యూనిట్ ముందుగానే చెప్పేసారు. నాని అన్న, వదినలుగా రాజీవ్ కనకాల, భూమిక నటించగా… పిన్ని, బాబాయ్‌లుగా నరేష్, ఆమనిలు నటించారు. పల్లవి అలియాస్ చిన్ని పాత్రలో హీరోయిన్ సాయిపల్లవి నానితో జతకట్టింది. ఇక సినిమా కథలోకి వెళితే పిన్ని, బాబాయ్, అన్న, ఫ్రెండ్స్ ఇదే తన ప్రపంచం అనుకునే నాని జీవితంలోకి వదినగా భూమిక(జ్యోతి) ఎంట్రీ ఇస్తుంది. భూమిక ఓ ఆర్టీవో ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటుంది. తనకు వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో భూమికతో పాటు నాని కూడా వదినకు తోడుగా వరంగల్ వెళ్తాడు. వదినపై గౌరవం వున్నప్పటికీ… తను చెప్పే పనులకు నాని ఎప్పుడు చిరాకు పడుతుంటాడు. ఇదిలా వుండగా నాని జీవితంలోకి పల్లవి ఎంట్రీ ఇస్తుంది. నానిని ఆటపట్టిస్తూ, లవ్ చేస్తుంటుంది.

ఇలా అటు వదిన, ఇటు ప్రేమించే అమ్మాయి మధ్యలో నలిగిపోతున్న నానికి వీరిద్దరి విషయంలో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అటు వదినను, ఇటు సాయిపల్లవిని అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు. ఇంతలో భూమిక పనిచేస్తున్న ఆఫీసులో ఓ సమస్య ఏర్పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న నాని.. తన వదినకు అండగా వుండాలని ఫిక్స్ అయ్యి, వదినకు ఎలాంటి సమస్య రాకుండా ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాని వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు నానికి ఎదురైన సమస్యలేంటీ? నాని జీవితంలో భూమిక ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనే అంశాలు వెండితెరపై చూస్తేనే బాగుంటుంది.

MCA మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాకు ముగ్గురు మేజర్ ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. నాని, భూమిక, సాయిపల్లవి. న్యాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని.. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడికి సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొంటాడు అనే అంశాలలో నాని ఆకట్టుకున్నాడు. సినిమా అంతా కూడా నాని మరోసారి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసాడు. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన భూమిక.. వదిన పాత్రలో బాగా చేసింది. చాలా సెటిల్డ్‌గా, ఎక్కడా కూడా ఓవర్ కాకుండా తన పాత్ర మేరకు బాగా చేసింది. నాని, భూమికల మధ్య సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఫిదాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సాయిపల్లవి ఈ సినిమాలో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని అయితే… హీరోయిన్లలో న్యాచురల్ స్టార్ సాయిపల్లవి అని చెప్పుకోవచ్చు. స్వతహాగా డాన్సర్ అయినటువంటి సాయిపల్లవి.. ఈ సినిమాలో తన స్టెప్పులతో అదరగొట్టేసింది. ముఖ్యంగా ‘ఏవండోయ్ నానిగారు..’ పాటలో సాయిపల్లవి మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. నాని, సాయిపల్లవిలు పోటాపోటీగా నటించారని చెప్పుకోవచ్చు. విలన్‌ పాత్రలో నటించిన విజయ్ వర్మ తన పాత్ర మేరకు బాగా చేసాడు. నాని ఫ్రెండ్స్‌గా నటించిన ప్రియదర్శి బాగా చేసాడు. ఆమని, నరేష్, రాజీవ్ కనకాల, పోసానీ కృష్ణమురళీ, రచ్చ రవి తదితరులు వారి వారి పాత్రలలో బాగా చేసారు.

ఇక సినిమా విషయానికొస్తే… కొన్ని కీలక విషయాలు, స్క్రీన్‌ప్లే తప్ప స్టోరీ లైన్ ఇదేనంటూ చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించేసారు. ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా వుంది. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఎంటర్‌టైనింగ్‌గా కొనసాగుతోంది. సెకండ్ హాఫ్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు కాస్త ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ అంశాలు కూడా కొనసాగుతాయి. వదిన, మరిదిల మధ్య వుండే అనుబంధాన్ని ఇందులో బాగా చూపించారు. సెకండ్ హాఫ్‌లో మిడిల్ క్లాస్ కుర్రోడు సీరియస్‌గా మారి తన ఫ్యామిలీ కోసం దిగితే పరిస్థితి ఎలా వుంటుందో బాగా చూపించారు. నాని కొన్ని కొన్ని సీన్లలో అదరగొట్టేసాడు. ఈనెల చివరి వరకు MCA హంగామా కొనసాగితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగడం ఖాయమనిపించే విధంగా ఈ సినిమా వుండటం విశేషం.

ఇక టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే…. అందరూ కూడా బెస్ట్ ఎఫర్ట్‌ను అందించినట్లుగా కనిపిస్తోంది. ముందుగా ఈ సినిమాకు సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి హైలెట్‌గా చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కూడా అందంగా చూపించారు. విజువల్స్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చూపించారు. ఇక రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు విజువల్స్ పరంగా మరింత బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకుడు శ్రీరామ్ వేణు తను రాసుకున్న కథను అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగాడు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడమే కాకుండా స్క్రీన్‌ప్లే పరంగా బాగా చూపించారు. ముఖ్యంగా నాని, సాయిపల్లవి, భూమిక, విజయ్ వర్మల పాత్రలను బాగా డిజైన్ చేసారు. దర్శకుడిగా శ్రీరామ్ వేణు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక ముందుగానే చెప్పినట్లుగా నిర్మాత దిల్‌రాజు తన బ్యానర్‌లో MCAతో ఆరవ హిట్టు కొట్టాడని చెప్పుకోవచ్చు. రాజు, శిరీష్, లక్ష్మణ్ సంయుక్తంగా అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా MCA చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పుకోవచ్చు.