తిరుపతిలో మరో మెడికో ఆత్మహత్య

13 August, 2018 - 11:43 AM

 (న్యూవేవ్స్ డెస్క్)

తిరుపతి: ఎస్వీ మెడికల్ కాలేజిలో మరో మెడికో ఆత్మహత్య చేసుకుంది. ఐదు రోజుల క్రితం పీజీ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య ఉదంతం కళ్ళ ముందు కదలాడుతుండగానే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న గీతిక ఆత్మహత్య చేసుకోవడం విద్యార్థులు, వైద్యులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి అంటున్నప్పటికీ వారంలోనే ఒకే మెడికల్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎస్వీ మెడికల్‌ కళాశాలలో అసలు ఏం జరుగుతోందంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్‌ కళాశాల ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు సోమవారం పాథాలజీలో ఇంటర్నల్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే గీతిక మృతితో ఆ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని వైద్య విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. పరీక్షలకు భయపడేంత విధంగా ఇంటర్నల్‌ పరీక్షలు జరగవని జూడాల నాయకులు చెబుతుండగా, పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని భయపడి గీతిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కళాశాలలో గీతిక ఎక్కువగా ఎవరితోనూ కలివిడిగా ఉండేది కాదని విద్యార్థులు అంటున్నారు.

ఇలా ఉండగా.. తాను ఎదుర్కొంటున్న వేధింపులను భరించే ఓపిక ఇక లేదని భావించిన గీతిక ఆత్మహత్య చేసుకోగా.. ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఆ లేఖను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. తన తల్లిదండ్రులను క్షమించమని ఈ లేఖలో వేడుకున్న గీతిక, తానేమీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదని, కానీ ఆత్మహత్య చేసుకునేలా చేశారని రాసింది.

గీతిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమెను వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుసగా మెడికోలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. గీతిక ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను కళాశాల అధికారులతో మాట్లాడి తెలుసుకున్న కలెక్టర్ ప్రద్యుమ్న, పూర్తి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో గీతిక ఆత్మహత్య వెనుక ఒత్తిళ్లు, వేధింపులు ఏమీ లేవని, ఆమె కుటుంబ సమస్యల కారణంగానే సూసైడ్ చేసుకుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గీతిక రాసిన ఆత్మహత్య లేఖ వెలుగులోకి రావడం గమనార్హం.