ఇండియా- విండీస్ తొలివన్డే వర్షార్పణం

09 August, 2019 - 8:15 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రావిడెన్స్‌ (గయానా): ఇండియా- వెస్టిండీస్‌ జట్ల మధ్య గురువారం జరగాల్సిన తొలి వన్డే వర్షార్పణం అయింది. తరచుగా వర్షం కురిసిన కారణంగా ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్‌ రద్దయింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. దీంతో టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇన్నింగ్స్‌ను మొదట 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత కూడా వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్‌ కొనసాగటం కష్టంగా మారింది. 13 ఓవర్ల వరకూ సాఫీగా సాగిన మ్యాచ్‌కు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. సుమారు గంటకు పైగా ఇదే పరిస్థితి ఉండడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ముందుగా టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లూయిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన గేల్‌ భారత బౌలర్లను ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పిచ్‌ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ భారత బౌలర్లు కట్టడి చేస్తూ వచ్చారు. దీంతో తొలి 5 ఓవర్లకు విండీస్‌ వికెట్ కోల్పోకుండా 8 పరుగులు మాత్రమే చేసింది. ఆరో ఓవర్‌ కొనసాగుతుండగా మళ్లీ వర్షం తన జోరు పెంచింది.కొద్దిసేపటికి వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. ఈ సారి క్రీజులోకి వచ్చిన లూయిస్‌ భారీ షాట్లతో అలరించాడు. స్వేచ్ఛగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఖలీల్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో రెండు బౌండరీలు, ఓ సిక్సర్‌ సాధించి జోరు పెంచాడు. మరోవైపు క్రిస్‌ గేల్‌ మాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. చాలా బంతుల్ని వృథా చేస్తూ అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే కుల్దీప్‌ వేసిన 11వ ఓవర్‌లో గేల్‌ (4- 34 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్’ అయ్యాడు. తర్వాత వచ్చిన షై హోప్‌ (6*- 11బంతుల్లో)తో కలిసి లూయిస్‌(40*- 36బంతుల్లో 2×4, 3×6) జోరు సాగిస్తుండగా మరోసారి వాన కురిసింది. అప్పటికి విండీస్‌ స్కోరు 13 ఓవర్లకు వికెట్‌ నష్టానికి 54 పరుగులు. అప్పటి నుంచి వర్షం వస్తూ పోతూ చాలాసేపు అంతరాయం కలిగించింది. ఒకానొక దశలో 20-20 మ్యాచ్‌ అయినా సాధ్యం అవుతుందేమో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అప్పటికే సమయం వృథా అవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే పోర్టు ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఈ నెల 11న జరుగుతుంది.