సెంచరీ మిస్: మర్క్రమ్ అవుట్

13 January, 2018 - 6:51 PM

              (న్యూవేవ్స్ డెస్క్)

సెంచూరియన్‌: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా లంచ్‌ తరువాత ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (31)ను అవుట్‌ చేసిన అశ్విన్‌.. వరుస బౌండరీలతో శతకానికి చేరువైన మరో ఓపెనర్‌ మర్క్రమ్‌ (94;150 బంతుల్లో 15 ఫోర్లు)ను కూడా పెవిలియన్‌కు పంపించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. మర్క్రమ్ కుదురుగా ఆడుతూ సెంచరీకి దగ్గరవుతున్న ‌సమయంలో అశ్విన్‌ వేసిన చక్కని బంతికి వికెట్‌‌ను సమర్పించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 48 ఓవర్‌ మూడో బంతికి మర్క్రమ్‌ పెవిలియన్‌ చేరాడు.

అశ్విన్‌ వేసిన వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయని మర్క్రమ్‌ ఆఫ్‌‌సైడ్‌ డిఫెన్స్‌ ఆడబోయాడు. బ్యాట్‌ అంచుకు తాకిన బంతి కీపర్‌ పార్దివ్‌ పటేల్‌ చేతుల్లో పడింది. బంతి ప్యాడ్లను తాకిందనుకున్న మర్క్రమ్‌ అంపైర్‌‌ను సమీక్ష కోరాడు. అందులో బ్యాట్‌ను తాకినట్లు తేలడంతో మైదానం నుంచి బయటికి వెళ్ళాడు.

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తన బౌలింగ్‌ గార్డ్‌‌ను మార్చుకుని మర్క్రమ్‌‌ను అవుట్ చేయడం గమనార్హం. ఆ ఓవర్‌‌లో తొలి రెండు బంతులు ఓవర్‌ ద వికెట్‌ బౌలింగ్‌ వేయగా, మూడో బంతిని రౌండ్‌ ద వికెట్‌ రూపంలో విసిరాడు. దాంతో ఒక్కసారిగా తడబడిన మర్క్రమ్‌ వికెట్‌ సమర్పించుకున్నాడు. తొలి వికెట్‌‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన మర్క్రమ్‌.. రెండో వికెట్‌‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. అయితే మర్క్రమ్‌ సెంచరీకి చేరువలో అవుట్‌ కావడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో నిరాశ అలుముకుంది. టీమిండియా శిబిరంలో ఆనందం చోటు చేసుకుంది.అంతకు ముందు నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ను విడదీసేందుకు బాగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (31; 83 బంతుల్లో 4×4)ను స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పెవిలియన్‌‌కు పంపించాడు. అతడు వేసిన 29.3వ బంతిని ఆడిన ఎల్గర్‌ షార్ట్‌ స్క్వేర్‌‌లెగ్‌‌లో ఉన్న ఫీల్డర్‌ మురళీ విజయ్‌‌ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్‌ అందుకోవడం ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. ఎల్గర్‌ డిఫెన్స్‌ చేయబోయిన బంతి బ్యాట్‌ అంచుకు తగిలి అక్కడే ఉన్న విజయ్‌ భుజాలకు తగిలి చేతుల్లో కాసేపు ఊగిసలాడింది. చివరికి దాన్ని విజయ్‌ ఒడిసి పట్టాడు.

కాగా.. భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ సెంచూరియన్‌ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌‌లో ముందుగా టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ తీసుకుంది. భారత జట్టులో ధావన్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌ స్థానంలో ఇషాంత్‌ శర్మకు తుది జట్టులో స్థానం దొరికింది.

కేప్‌‌టౌన్‌‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో రెండో టెస్టు కీలకంగా మారింది. మూడు టెస్టు మ్యాచ్‌‌ల ఈ సీరీస్‌‌పై ఆశలు నిలుపుకోవాలంటే సెంచూరియన్ మ్యాచ్‌‌లో భారత్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది.