ప్రచారంలో మేనక మరో బాంబ్!

15 April, 2019 - 11:22 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు మానడంలేదు. తనకు ఓటు వేస్తేనే సహాయం చేస్తానని ముస్లిం ఓటర్లను బెదిరించి వివాదంలో చిక్కుకున్న మేనకాగాంధీ.. మరోసారి నోటికి అదుపు లేకుండా మాట్లాడడం చర్చనీయాంశం అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏబీసీడీ కేటగిరీలుగా విభజించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మేనకా గాంధీ అన్నారు. బీజేపీకి 80 శాతం మద్దతుగా ఉండే ఓటర్లున్న గ్రామాలను ఏ కేటగిరిగా.. 60 శాతంలోపు ఉండే గ్రామాలను బీ.. 50 శాతానికి తక్కువ ఉండే ఊళ్ళను సీ.. 30 శాతం కన్నా తక్కువగా ఉన్న గ్రామాలను డీ కేటగిరీగా ఆమె విభజించారు. గెలిచిన తర్వాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ కేటగిరిల మాదిరిగానే ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పిలిబిత్‌ నియోజకవర్గంలో ఈ కేటగిరి విధానాన్ని అమలు చేశామని మేనకా గాంధీ అన్నారు.

పిలిభిత్‌ నుంచి ఆరుసార్లు గెలిచిన మేనకా గాంధీ ఈ సారి సుల్తాన్‌‌పూర్‌ నుంచి బరిలో దిగారు. సుల్తాన్‌‌పూర్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ పిలిబిత్‌ నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు.

మరోపక్కన ఇంతకు ముందు ముస్లిం ఓటర్లను బెదిరించిన వ్యవహారం సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ అవడంతో వివరణ కోరుతూ ఆమెకు ఈసీ నోటీసులు జారీచేసింది. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషాన్నివ్వదు అంటూనే తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలని, తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ మేనకా బ్లాక్‌‌మెయిలింగ్‌‌కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసిపోతాయనీ ఈ నేపథ్యంలో వారికి అందాల్సిన సహాయం ఆధారపడి ఉంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించడం గమనార్హం.