‘శక్తినిచ్చింది సినిమాలే’

13 August, 2019 - 8:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : కమర్షియల్ పరిమితుల వల్ల తాను అనుకున్న సినిమాలు తీయలేకపోయానని పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ తానకు మాట్లాడగలిగే శక్తినిచ్చింది సినిమాలే అని ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో తెలకపల్లి రవి రచించిన ‘మన సినిమాలు’ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రను అంతా గుర్తించేలా చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పవన్ తెలిపారు. మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’కి జాతీయ స్థాయి గుర్తింపు రావడం సంతోషకరమని ఈ సందర్భంగా పవన్ అన్నారు. అలాగే గతంలో జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్న మా భూమి, దాసి, రంగులకల సినిమాల్లోని విలువలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

చరిత్ర రాసేవాళ్లు లేకపోతే చరిత్ర కనుమరుగవుతుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మందిని ప్రభావితం చేయగల శక్తి సినిమాకి ఉందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖలు రావి కొండలరావు, తనికెళ్ల భరణి, పరూచురి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ పలువురు హాజరయ్యారు.