క్రికెట్ బెట్టింగ్‌.. యువకుడి ఆత్మహత్య

09 June, 2017 - 4:43 PM

క్రికెట్‌ బెట్టింగ్‌ ఒక యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్‌‌లో నగదుతో పాటుగా కొత్తగా పెళ్ళి చేసుకున్న తన భార్య నగలు కూడా కోల్పోయిన ఆ యువకుడు చివరకు సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పేట్‌‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. బాపూజీనగర్‌‌లో చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఘన శ్యామ్‌ (27) అనే యువకుడు ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్‌‌లో ఎంతో నష్టపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న అతనికి వివాహం అయింది. భార్యకు చెందిన 28 తులాల బంగారు నగలను కూడా బెట్టింగ్‌‌లో ఘనశ్యామ్ పోగొట్టుకున్నాడు.

]ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌‌కు ఉరి వేసుకొని ఘనశ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌‌లో చాలా కోల్పోయానని ‘సారీ మమ్మీ, సారీ డాడీ’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఘనశ్యామ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘనశ్యామ్ ఫోన్‌ కాల్స్‌‌పై దృష్టి సారించారు. అతడి కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారణ చేపడితే క్రికెట్‌ బెట్టింగ్‌‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మృతుని బంధువులు చెబుతున్నారు.